Aug 03,2023 08:50

ప్రజాశక్తి- మాచర్ల (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా మాచర్ల శివారు ప్రాంతంలో చిరుత పులి సంచరించడం, ఒక పిల్లిని నోట కరుచుకొని తీసుకుపోవడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం... 7వ వార్డు శివారు అటవీ ప్రాంతం సమీపంలో కళాకారుల కాలనీ ఉంది. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి బయట కూర్చున్న మహిళ కొద్ది దూరంలో పులి కనిపించడంతో భయంతో కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు వచ్చి వెతికినా పులి కనబడలేదు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అదే ప్రాంతంలో ఆశ అనే మహిళ... తన ఇంటి వెనుక ప్రాంతంలో పిల్లిని నోట కరుచుకొని తీసుకెళ్తున్న పులిని చూసి భయకంపితురాలయ్యారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు ఆ ప్రాంతంలో పులి అడుగుజాడల కోసం పరిశీలించారు. ఎటువంటి ఆనవాళ్లూ లభించలేదని, కళాకారుల కాలనీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అటవీ శాఖాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. పులి సంచారంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.