Jul 03,2023 09:31

తులసీ చందు ... ఇటీవల కాలంలో ప్రజల సమస్యలపైనా, ప్రభుత్వాల నిర్ణయాల పైనా విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్న బలమైన గొంతుక. ఆమె ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో నైపుణ్యవంత జర్నలిస్టుగా రాణించారు. ఆపై ఆరోగ్య సమస్యలతో వృత్తికి కొంత విరామం ఇచ్చిన ఆమె ఆ తరువాత స్వతంత్ర జర్నలిస్టుగా ప్రస్థానం సాగిస్తున్నారు. సొంతంగా యూట్యూబ్‌ చానెల్‌ పెట్టి అందులో ఎన్నో విషయాలపై సమగ్ర నివేదికలు అందిస్తున్నారు. ఎంచుకున్న ఏదేని అంశంమైనా సుస్పష్టమైన వివరాలతో.. విశ్లేషణలతో ఆమె చేస్తున్న వీడియోలను వేలాదిమంది అనుసరిస్తున్నారు. ఇష్టపడుతున్నారు. అయితే, మతోన్మాద శక్తులు కొన్ని పనికట్టుకొని ఆమెపై దుష్ప్రచారానికి, దుర్మార్గమైన ఆరోపణలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో తులసితో 'జీవన' ముచ్చటించింది.

'కొందరు నా చుట్టూ ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నారు. నన్నెప్పుడూ చూడని కొన్ని సందేహాత్మక చూపులు పదే పదే నన్ను వెన్నాడుతున్నాయి. దీంతో ఎవరు.. ఎక్కడ.. ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియని అయోమయ పరిస్థితికి వెళ్లిపోయాను. నా ఆందోళన చూసి నా బిడ్డలు తల్లడిల్లుతున్నారు. 'అమ్మకు ఏమవుతోందో'నని బెంబేలు పడిపోతున్నారు. జర్నలిస్టుగా నిజాన్ని వెలికితీయడంలో ముందుండే నేనూ ఓ అమ్మనే.. బిడ్డల భవిష్యత్తుకై ఎన్నో అందమైన కలలు కన్నాను. అందుకే ప్రస్తుతం నా చుట్టూ ఉన్న భయంకర వాతావరణానికి తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నాను..' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టు తులసీ చందు. తాను చేస్తున్న కృషి గురించి తన మాటల్లోనే ...
 

                                                                తులసీచందు యూట్యూబ్‌ చానెల్‌

'2020 ఏడాది చివరిలో నా పేరుతోనే యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించాను. ఇప్పటి వరకు 300 పైగా వీడియోలు చేశాను. వాటిలో 100 నుంచి 150 వరకు విశ్లేషాణాత్మక వివరాలతో పలు అంశాలపై చేసిన వాటికి విశేష స్పందన వచ్చింది. రాజధానిలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్నా చేస్తున్న సమయంలో ఆ చట్టాలను వివరిస్తూ నాలుగు వీడియోలు చేశాను. ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. వైజాగ్‌ స్టీలుప్లాంటు కార్మికుల ఆందోళన జరుగుతున్నప్పుడు పాలకులు పరిశ్రమలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో వివరిస్తూ ... గుజరాత్‌ స్టీలు కంపెనీ నిర్వీర్యం అయిన క్రమాన్ని వివరించాను. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వ సంస్థలను ఎలా వాడుకున్నారో విశ్లేషించాను.
           చానెల్‌ ప్రారంభించిన తొలినాళ్లల్లో రెండు నిమిషాల నిడివిలో 'మతం వస్తోంది.. మేలుకో మిత్రమా' అంటూ ఓ వీడియో చేశాను. జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరుగుతున్న సమయంలో చేసిన ఆ వీడియో చాలా మందిని ప్రభావితం చేసింది. బెదిరింపు మెసేజ్‌లు, కాల్స్‌ రావడం అప్పటి నుండే ప్రారంభమైంది. విదేశాల నుంచి కూడా బెదిరింపులు వచ్చేవి.
 

                                                                    ప్రజా చైతన్యమే ముఖ్యం

జనం ఏది తెలుసుకోవాలి.. ఏది ముఖ్యం.. రాజ్యాంగం ఏం చెప్పింది? వంటి అంశాలతో పాటు, పాలకులు ప్రజలకు సేవ చేయాలి అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కానీ పరిస్థితి అలా లేదు. పాలకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మతాన్ని తీసుకొచ్చి ఉన్మాదం పెంచుతున్నారు. ప్రజలు పాలకుల కుయుక్తులను అర్థం చేసుకోవాలి. అందుకే నా వీడియోలన్నీ ప్రజలకు మేలు చేసేవి.. వాళ్లను మేల్కొల్పేవిగా ఉంటాయి. డబ్బు కోసం కంటే సమాజానికి ఉపయోగపడే.. ప్రజలను చైతన్యం చేసే వీడియోలు చేయడం నాకు ఇష్టం. అందుకే నేను చేసిన వీడియోలలో ఎక్కువశాతం అవే ఉంటాయి.
 

                                                                     సరైన సమాచారం అందివ్వాలని ...

జర్నలిజం అంటే నా దృష్టిలో ప్రజలకు సరైన సమాచారం అందించాలి. వ్యవస్థను ప్రశ్నిస్తున్నప్పుడు లోపం ఎక్కడుందో వివరించాలి. కులం పేరుతో, మతం పేరుతో, వ్యక్తిగతంగా దూషించడం జర్నలిజం మార్గం కాదని నేను బలంగా నమ్ముతాను. నా వీడియోల్లో ఎక్కడా ఎవరినీ దూషించలేదు. వ్యవస్థను నిర్వీర్యం చేసే వారి చర్యలను వివరిస్తూ.. ప్రజలను హెచ్చరించేలా నా వీడియోలు ఉంటాయి. జర్నలిజంపై నాకున్న మక్కువతో 250 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను. వారిలో చాలా మంది సొంతంగా చానెళ్లు ప్రారంభిస్తున్నారు. సమాజానికి చైతన్యం అందించే నా బాధ్యతలో వారు కూడా భాగస్వామ్యం అవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది.
 

                                                                          తీవ్రంగా బాధిస్తోంది..

నేను చేసిన వీడియోలలో వ్యవస్థను జాగృత్తం చేసేవే ఉంటాయి. వాటిని తప్పుపట్టడానికి వీల్లేక.. నా మీద వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. నన్ను హిందూ వ్యతిరేకి అంటున్నారు. అర్బన్‌ నక్సలైట్‌ ముద్ర వేశారు. పనిగట్టుకుని మూడు యూట్యూబ్‌ చానెళ్లు నాపై విష ప్రచారం చేస్తున్నాయి. 'అహం బ్రహ్మస్మి', 'మతోన్మాదంపై రామబాణం', 'ఆర్‌ జె కిరణ్‌' పేరుతో రిజిస్టర్‌ అయిన చానెళ్లతో పాటు 'పాస్టర్‌ పరంజ్యోతి' పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ పేజీలో నాపై చెడ్డ వార్తలు వ్యాపింపజేస్తున్నారు. ఈ ప్రచారం వల్ల కొంతమందికి నేను శత్రువును అవుతున్నాను. ఆ వీడియోల ప్రభావంతో ఎంతమంది ప్రేరేపితమవుతున్నారో నాకు తెలియదు. నన్ను చంపుతామని నేరుగా బెదిరించకపోయినా ఇలా నా చుట్టూ భయంకర వాతావరణం సృష్టిస్తున్నారు. అమాయకులను నాపై ఉసిగొల్పుతున్నారు. అదే నన్ను తీవ్రంగా బాధిస్తోంది..
            ఇప్పటికే మార్కెట్లో.. బస్సుల్లో.. పార్కుల్లో, ఊర్లో నన్ను నేరుగా ప్రశ్నించిన వారున్నారు. శారీరకంగా నాపై దాడి చేయడం కంటే ఇది ఘోరమైనది. నన్ను విమర్శించవచ్చు.. నన్ను కౌంటర్‌ చేయొచ్చు.. కానీ నాపై కొంతమందిని రెచ్చగొట్టడం సరికాదు. ఒక మతానికో.. పార్టీకో నేను పరిమితం కాదు. ఎవరికీ లోబడి వీడియోలు చేయలేదు. అయినా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. కులం మీద మాట్లాడితే నేను దళితురాలిని. మతం మీద మాట్లాడితే ముస్లింని. ఇలా వారికిష్టమొచ్చిన కులం, మతం నాకు ఆపాదిస్తున్నారు' అంటూ తులసీ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ ఆవేదనతోనే తులసీ ఇటీవల ఓ లేఖను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఆ లేఖకు విశేష స్పందన వస్తోంది. ఆమెకు అండగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ప్రజాసంఘాల కార్యకర్తలు, ప్రముఖులు అండగా నిలబడ్డారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని ఉన్మాద శక్తులు చూసిన ప్రతిసారీ ప్రజల నుంచి బలమైన సంఘీభావం అవసరం.
 

                                                                అరాచక శక్తులపై చర్య తీసుకోవాలి

ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన ప్రతిభ తులసి చందుది. లక్షలమంది అభిమానించే చైతన్య గొంతుక తనది. నిరుద్యోగం, రైలు ప్రమాదాలు, టీచర్ల ఉద్యోగాలు, పెట్రోలు ధరలు, భారీ పరిశ్రమలు, మణిపూర్‌ హింస, రైతు చట్టాలు, మతం బూచి ఆమె చేసిన వీడియోల్లో కొన్ని. ఇవన్నీ సమాజాన్ని ప్రభావితం చేసేవే.. సమాజాన్ని చైతన్యం చేసే బాధ్యత ఎవరు భుజాన వేసుకున్న పాలకులకు నచ్చదు. ఏదోవిధంగా ఆ ప్రశ్నించే గొంతుకలను చిదిమేయాలని చూస్తారు. కర్నాటక గౌరీ లంకేష్‌, గుజరాత్‌ రానా అయ్యూబ్‌, కేరళ సిద్దిఖీ వంటి వారిపై జరిగిన దాడులు వెలుగులోకి వచ్చినవే. ఇలాంటి అరాచక మూకల ఆగడాలను ప్రారంభంలోనే అరికట్టాలి. అవమానకరంగా, అమానుషంగా వ్యాఖ్యలు చేస్తున్న దశలోనే అడ్డుకట్ట వేయాలి. ప్రజల గొంతుకగా నిలిచే జర్నలిస్టులపై రెచ్చగొట్టుడు పనికి పూనుకుంటున్న అరాచక శక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి.

- జ్యోతిర్మయి