Aug 28,2023 07:36

ఏ మువ్వ మోగినా
యాది కొచ్చింది నువ్వే
ఏ కష్టజీవి చేతికర్ర కంట బడినా
నీ చేతులే మతిల బడుతున్నాయి
నువ్వు కప్పుకున్న గొంగడిలో
మబ్బుపట్టిన ఆకాశం అగుపిస్తే
కురుస్తున్న జడివానలో
నీ గానమే వినిపిస్తుంది
...
నాట్లేస్తూ వానలో నానుతున్న
పనిదేవతల్ని పలకరిస్తే
అందరిలో అమ్మ లచ్చుమమ్మే
అవుపడతంది
ఏ చెల్లెమ్మ పాదమ్మీద
పుట్టుమచ్చ కంటబడినా
నీ పాట ముచ్చట్లే
ముసురుకుంటాయి
...
నీ జునపాల జుట్టు
కనిపించినప్పుడల్లా
ధిక్కార గునపాలే అనిపిస్తాయి
ఇంతకీ నువ్వు ఎక్కడికెళ్లినావన్నా
మా గొంతులోనే గెంతుతున్నా వన్నా

నీ పాటలు వింటూ
పరకలు మేస్తున్న మేకల కొమ్ములకు
కత్తులు పూస్తున్నట్టే వుంటుంది
...
నాడు నేడు ఏనాడూ
నువ్వు పాటై పోటెత్తుతూనే వుంటావు
బడుగులోల అడుగుల్లో నువ్వు
అడుగై అగుపడుతుంటావు
నీ పాటల తోటలో ఏరుకోవాలిగానీ
ఏ పాటైనా నీటిని నిప్పుగా రాజేసి
అసమ సమాజమ్మీద
అగ్గిపిడుగై రాలగలదు
...
వెల్లినట్టే వెళ్ళావు
నీ కాయాన్ని కాల్చుకున్నావుగానీ
రాల్చిన పాటల్ని
మాలో రగిలించుతున్నావు
మువ్వల కర్రతో మురిపించి
ఎన్నుకు ఏలాడిన డప్పు
దరువుల చప్పుడై
పాదాలను కదిలిస్తున్నావు
పిడికిళ్లను మొలిపిస్తున్నావు!
 

- చింతా అప్పల నాయుడు
9441714185