
ఒక చెరువులో చేపలు, కప్పలు, తాబేలు, మొసలి ఎంతో స్నేహంగా ఉండేవి. ఆ చెరువు ఒడ్డున గల చెట్టు పై ఉన్న ఓ చిలుక కూడా వీటితో సఖ్యతగా ఉండేది.
ఒకసారి ఆ చెరువులో నీటిని తాగడానికి ఓ నక్క వచ్చింది. అది నీటిలోకి దిగిన వెంటనే మొసలి దాని కాలును పట్టుకుంది. అప్పుడు నక్క 'అయ్యో మొసలి మామా! నేను నీకు ఏదైనా సాయం చేద్దామని వచ్చాను. నన్ను పట్టుకుంటావేమిటి? నీకు ఏం కావాలో అడుగు. నేను వాటిని తెచ్చిస్తాను. నన్ను వదిలిపెట్టు' అంది. అది విన్న మొసలి 'నాకు కొన్ని పండ్లు కావాలి. తెచ్చివ్వగలవా' అంది. 'ఓ, తప్పకుండా తెస్తాను. ముందు నన్ను వదిలిపెట్టు' అంది నక్క. అప్పుడు మొసలి దాన్ని వదిలిపెట్టింది. కానీ ఎంతకూ తిరిగి రాలేదు .
అప్పుడు చెట్టుపైగల చిలుక 'ఓ మొసలి మిత్రమా! నువ్వు నక్కను ఎందుకు వదిలి పెట్టావు? అది వట్టి అబద్దాలకోరు. అది పండ్లు తెస్తుందంటే ఎలా నమ్మావు' అంది.
'ఈసారి మాత్రం నక్క మాటలను నేను అసలు నమ్మను' అంది మొసలి. కొన్ని రోజులకు నక్క మళ్లీ చెరువుగట్టుకు వచ్చింది. విచారంగా ముఖం పెట్టి 'మొసలి మిత్రమా.. నేను పండ్లు తెద్దామని ఎంతో ప్రయత్నించాను. కాని వాటిని కోతులు తినేశాయంట. ఈసారి తప్పకుండా తెస్తాను. సరేనా' అనగానే మొసలి ఆ మాటలు నిజమేనని నమ్మేసింది. ఇలా చాలా రోజులపాటు నక్క మొసలిని నమ్మించి, చెరువులో నీరు తాగటంతో నాటు చేపలనూ తినేసేది.
ఇదంతా గమనిస్తున్న చిలుక ఒకరోజు మొసలితో జరిగిన విషయాన్ని చెప్పింది. కప్పలు, తాబేలు ఇతర చేపలు కూడా ఈ విషయాన్ని విన్నాయి. 'అయ్యో! మొసలి మిత్రమా... నీ అమాయకత్వం వల్ల మన నేస్తాలైన చేపలను పోగొట్టుకుంటున్నాం. మా మాటలు విను. మిత్రుడుగా నటిస్తున్న మోసకారి నక్క మాటలు నమ్మకు' అని హితబోధ చేశాయి. అప్పుడు తన చేప మిత్రులను తినేస్తున్న నక్కను ఆ రోజు నుండి మొసలి చెరువు వైపు రానీయకుండా కట్టడి చేసింది.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
9908554535