Sep 19,2023 21:38
  • తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో ఓటమి

హాంగ్జూ(చైనా): ఆసియా క్రీడల ఆరంభ పోరులో భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ఓటమిపాలైంది. గ్రూప్‌-ఎలో భాగంగా మంగళవారం జరిగిన ఫుట్‌బాల్‌ పోటీల్లో భారత్‌ 1-5 గోల్స్‌ తేడాతో ఆతిథ్య చైనా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్‌ అరంభం నుంచే చైనా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. తొలి అర్థ భాగంలో చైనా జట్టు 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత భారత ఆటగాడు రాహుల్‌ కేపీ గోల్‌ చేయడంతో స్కోర్‌ 1-1గోల్స్‌తో సమమైంది. అయితే.. రెండో అర్థ భాగంలో చైనా జట్టు చెలరేగి ఆడింది.ఉన్న భారత్‌, చైనా ఈరోజు తలపడ్డాయి. తొలి అర్థ భాగంలో స్కోర్‌ సమం కావడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. రెండో అర్ధభాగంలో చైనా ఆటగాళ్లు ఏకంగా నాలుగు గోల్స్‌ చేశారు. టావో, హావో ఫాంగ్‌ రెండేసి గోల్స్‌తో జట్టుకు విజయాన్నందించారు. సొంత గడ్డపై వరుసగా మూడు ట్రోఫీల్లో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా ఇది ఊహించిని షాక్‌.

15పరుగులకే కుప్పకూలిన మంగోలియా

cricket

ఆసియా క్రీడలు మూడు రోజుల్లో అధికారికంగా ప్రారంభం కానుండగా.. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ తదితర క్రీడాంశాలు ముందే ప్రారంభమయ్యాయి. టి20 ఫార్మాట్‌లో జరుగుతున్న మహిళల క్రికెట్‌లో మంగళవారం ఇండోనేషియాపై మంగోలియా జట్టు కేవలం 10ఓవర్లలో 15పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులోని ఏడుగురు డకౌట్‌ కావడం విశేషం. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇండోనేషియా జట్టు 4 వికెట్ల నష్టానికి 187పరుగుల భారీస్కోర్‌ను చేసింది. ఇందులో 49పరుగులు అదనపు పరుగుల రూపంలో వచ్చాయి. అందులో ఏకంగా 38వైడ్లు మంగోలియా బౌలర్లు వేయడం విశేషం. ఛేదనలో మంగోలియా జట్టు 10 ఓవర్లలో 15పరుగులకే కుప్పకూలింది. ఇండోనేషియా పేసర్‌ అండ్రియాని 4 వికెట్లతో రాణించింది. దీంతో ఇండోనేషియా 172 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.ఓటమి అనంతరం మంగోలియా కోచ్‌ డేవిడ్‌ తలాల్లా మాట్లాడుతూ.. తమ జట్టులో అందరూ 19ఏళ్ల సగటు వయసులోపు వారేనని, తమ పరిమిత వనరులతోనే ఈ క్రీడలో బరిలోకి దిగామని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మంగోలియా జట్టుకు ఇదే తొలి మ్యాచ్‌. ఈసారి ఆసియా క్రీడల్లో క్రికెట్‌, వాలీబాల్‌, బీచ్‌వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ తదితర క్రీడాంశాలు చోటు దక్కింది. ఈనెల 23నుంచి అధికారికంగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.