ముంబయి : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో హైదరాబాద్‌లో 51 లక్షల చదరపు అడుగుల వేర్‌హౌసింగ్ (గిడ్డంగుల) లావాదేవీలు నమోదయ్యాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 2021-22లో 54 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే 7 శాతం తగ్గుదల చోటు చేసుకుందని తెలిపింది. ఇండియా వేర్‌హౌసింగ్ మార్కెట్ రిపోర్ట్- 2023 పేరుతో నైట్ ఫ్రాంక్ మంగళవారం నివేదికను వెల్లడించింది. ''ప్రస్తుత విశ్లేషణ కాలంలో లావాదేవీ పరిమాణాలలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, అవి 2022 ఆర్థిక సంవత్సరం మినహా అంతక్రితం కాలం కంటే ఎక్కువగా ఉన్నాయి. 3పిఎల్, ఇ-కామర్స్ సంస్థల నుంచి లావాదేవీలు తాత్కాలికంగా మందగించడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. కానీ ఆన్‌లైన్ షాపింగ్ ప్రజాధారణ, లాస్ట్ మైల్ డెలివరీ యొక్క అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది దీర్ఘకాలిక డిమాండ్ అవకాశాలను ప్రభావితం చేయదు.'' అని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. మేడ్చల్ క్లస్టర్‌లో వేర్ హౌసింగ్ డిమాండ్ కొనసాగుతోంది. దీని వాటా 2022 ఆర్థిక సంవత్సరంలో 60 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 61 శాతానికి పెరిగింది.










