Apr 03,2023 07:45

చెప్పకుండానే ఆకస్మాత్తుగా
మహారాజులా దర్జాగా నువెళ్లిపోయావు
కానీ వీరి దృష్టిలో నేను అంటరాని దాన్నైపోయా..
ఊపిరి నీదాగిపోయింది
బతికుండగానే ఆచారాల పేరుతో
నా ఊపిరిక్కడ నలిగిపోతుంది కర్కశంగా..

నువ్వు పోయావని
చితిమంటల్లో నీ అస్తిత్వం భస్మమైపోయింది
నేను బతికుండగానే నా
అస్తిత్వమిక్కడ విస్మితమౌతుంది..

అడుగడుగునా
ఈ లోకం నాకు సాయం చేసే మిషతో
నా హృదయానికి గాయం చేసి
నన్ను నా నుంచి మాయంజేసి
శోకవనంలోకి తోసేస్తోంది!
నేనేం చేయాలో, ఏం చేయరాదో
ఎలా ఉండాలో, ఎలా ఉండరాదో
వీళ్ళే నిర్ణయిస్తున్నారు..

నువ్వు భవబంధాలు తెంపుకుని
స్వేచ్ఛగా ఎగిరెళ్లిపోయావు
నా స్వేచ్ఛ ఇక్కడ అడుగడుగునా
సాంప్రదాయాల పంజరంలో
బందీయై మిగిలిపోయింది..

నువ్వు ఇహలోక స్వాతంత్య్రం పొంది
అన్నింటినీ తోసిరాజని నిష్క్రమిస్తే,
నేను నా స్వాతంత్య్రాన్ని కోల్పోయి
ఒంటరి పోరాటమై, సంఘర్షణ సంకటమై
జ్ఞాపకాల శిలయై, భావోద్వేగాల శిలాజమై
అశ్రువుల్ని ఆలింగనం చేసుకుని
ఇక్కడ బతుకీడుస్తున్నాను..!
- సర్ఫరాజ్‌ అన్వర్‌
9440981198