తెలుగు నాటక రంగంపై ఇది ఒక విజ్ఞాన సర్వస్వం. విజ్ఞాన భాండాగారం. చరిత్ర, రంగస్థలం అభిమానులు, పరిశోధకులు, భాషాభిమానులు పది కాలాల పాటు దాచుకోదగ్గ అమూల్య గ్రంథం. 'తెలుగు నాటక రంగ మూల స్తంభాలు' పేరిట ప్రచురించిన ఈ బృహత్ గ్రంథం తెలుగు నాటక రంగ సమాచారాన్ని ఇచ్చే గ్రంథమే కాదు; గ్రంథాలయాలు.. ముఖ్యంగా విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు తెలుగు అధ్యయన విభాగాలు సేకరించి పెట్టుకోదగ్గ సమాచార ఖని. దీని వ్యాసకర్తలు ఏడు పదుల తమ జీవితంలో, అత్యధిక కాలం నాటకరంగంతో ఎన్నో విధాల సంబంధం కలిగి, దాన్ని కొనసాగిస్తున్న వారు. అధ్యాపకత్వంతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో, వెబినార్లలో పాల్గొని పరిశోధక పత్రాలు సమర్పించిన వారు. ఒక అకడమిక్ అసైన్మెంట్ లాగానో, సరదాగా అప్పుడప్పుడు రాస్తూ వచ్చిన వ్యాసాల సంపుటీకరణో కాదు ఇది. ఒక నిబద్ధత, కచ్చితత్వం కోసం రోజులు, దూరాలు అధిగమించి వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలు, పరిశోధనాలయాలను సందర్శించి, ప్రామాణికంగా రూపుదిద్దిన గ్రంథం ఇది. డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు, వాడ్రేవు సుందరరావు ఈ వ్యాస సంపుటి రచయితలు. 900 పేజీలకు పైబడిన సైజులో ప్రతి ఒక్క రంగస్థల తేజోమూర్తి ఛాయాచిత్రాన్ని పొందుపరుస్తూ, సాగిన గ్రంధం ఇది. తెలుగు రంగస్థలం ప్రారంభ కాలం నుంచి నిన్న మొన్నటి వరకు మన మధ్యలోనే జీవించి, జీవితపు రంగస్థల వేదిక నుంచి దిగిపోయిన వారి జీవితాల్లోని వెలుగునీడలను, ప్రభవించి అస్తమించిన రంగమార్తాండుల, నాటక రంగ కులదీపకులు, మణిదీపాలు అయిన వారి జీవిత చరిత్రను అక్షర చిత్రలేఖనా సమ రచన ఇది.
తెలుగు సాహిత్య, సాంస్క ృతిక, నాటకరంగాలకి నిస్వార్ధ శ్రేయోకాంక్షతో, పాతికేళ్ల పైబడి పనిచేస్తున్న సంస్థ అజో-విభో- కందాళం ఫౌండేషన్. ఇప్పటికీ పలు సాహిత్య విలువలతో కూడిన గ్రంథాలను సముచిత ధరలకే అందిస్తూ సాహితీ సేవ చేస్తోంది. ఇప్పుడు ఈ గ్రంధాన్ని వెలువరించింది. ఇందులో మొదటి భాగం నాటక రచయితలు... తొలి తెలుగు నాటక రచయిత కోరాడ రామచంద్ర శాస్త్రి గారితో మొదలుపెట్టి, గంధం నాగరాజు వరకు మొత్తం 116 మంది రచయితల గురించిన వ్యాసాలున్నాయి. రెండోభాగంలో నటులు దర్శకులు, శీర్షికన సురభి పాపా బారుతో మొదలుపెట్టి డిఎస్ దీక్షిత్ వరకు 13 మంది నట దర్శకుల గురించిన, సాంకేతిక నిపుణులు శీర్షికన పాపట్ల లక్ష్మీకాంతయ్య (సంగీతం) హెచ్డి శర్మ (దృశ్య బంధ నిర్మాణం) సాదినేని అంజిబాబు (ఆహార్యం), రామమూర్తి (రంగోద్దీపనం), అడబాల (ముఖసజ్జా నిపుణులు) మొత్తం ఐదుగురిని, నిర్వాహకులు శీర్షికన ఆంధ్ర నాటక రంగ కళోద్ధారకులు వనారస గోవిందరావుతో మొదలుకొని పంతం పద్మనాభం వరకు పది మంది, 'పరిశోధకులు' శీర్షికన తెలుగు నాటక విజ్ఞాన సర్వస్వం శ్రీనివాస చక్రవర్తి, తెలుగు నాటక పరిశోధనా పితామహుడు డాక్టర్ పిఎస్‌ఆర్ అప్పారావు గురించి, ఇతర ప్రక్రియలు శీర్షికన డాక్టర్ ఫన్ చంద్రశేఖరం (బహుకృతవేషం), డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి (నాట్యవధానం), డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ (ధ్వన్యనుకరణ) గురించిన విలువైన వ్యాసాలు ఉన్నాయి.
ఈ గ్రంథంలో ప్రకాశకుల 'మనవి మాటలు' శీర్షికన ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణ 'ఈ గ్రంథం 234 మంది తెలుగు రంగభూమి సేవా పరాయణులై, కీర్తిశేషులైన కళాకారుల సంక్షిప్త సమాచార సమాహారం. ఈ గ్రంథం భావితరాల్లో తెలుగు నాటక సాహిత్య చరిత్రలో, సముచిత స్థానాన్ని సంపాదించి, నాటక ప్రియులకు చరిత్రకారులకు పరిశోధకులకు కరదీపిక కాగలదని నా ప్రగాఢ విశ్వాసం. ఈ పుస్తకాన్ని ప్రచురించే అవకాశం కలగడం మా సుకృత విశేషం' అనడం వారి ఔన్నత్యం. 'జీవితమే రచనకు పునాది' అన్న ముందు మాటలో డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్ 'పౌరాణిక ఇతివృత్తాలు పాగా వేసినప్పుడు పద్యం రాజ్యమేలింది. అయితే సమకాలీన సమస్యల ఆవిష్కరణ, పరిష్కార మార్గాల అన్వేషణ ప్రధాన లక్ష్యం అయినప్పుడు- ఆధునిక నాటకం తెలుగు రంగస్థలంపై వేళ్ళూనుకొన్నది' అంటారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం ఫ్రాయిడ్ మనో విశ్లేషణ, కార్ల్ మార్క్స్ గతి తార్కిక భౌతిక వాదం, ఆధునిక ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. రచయిత తాననుభవించిన సంఘర్షణకు ప్రతిరూపమే అతను సృష్టించిన సాహిత్యం. స్థూలంగా విశ్వనాథ వారు .. మనుషులు, వారిలోని వికారము, వారి కామ క్రోధ మాత్సర్యాది దుర్గుణ జన్యుములైన కార్యములు- పాశ్చాత్యుల నాటకాల్లో ప్రతిబింబిస్తే, సంస్క ృత నాటక కవులు లోకమందలి అల్ప మానవ ప్రకృతుల చిత్రించుట వదిలిపెట్టి ఉదాత్త ప్రవృత్తులను, వారు మహాశిల్పులు గనక ఆ ఉదాత్తత యందు రమణీయ ప్రవృత్తులను చిత్రించారని స్పష్టపరిచారు
సాంస్క ృతిక పునరుజ్జీవన రథసారథులుగా గురజాడ కందుకూరి, పానుగంటి, చిలకమర్తి, కాళ్లకూరి లాంటి సంస్కరణ వాదులు తమ కలాలని ఝుళిపించారు. పౌరాణిక వ్యవస్థ లౌకిక జ్ఞానాన్ని గ్రహణం పట్టించడం వంటి దుర్గుణాలపై కీర్తిశేషులు త్రిపురనేని, నార్ల, చలం లాంటి కవుల కలాలు సమర శంఖారావం చేశాయి. జాతీయ ఉద్యమం సంస్కరణ ఉద్యమం రెండు పెనవేసుకుంటూ తెలుగు నాటక సాహిత్యంలో ముందుకు సాగాయి.
ఒక సమస్యను కవిత్వం ముందుగా ఆవిష్కరించినా, పరిష్కారాన్ని సూచించడంలో నాటకం ముందుంటుంది. మాభూమి వంటి నాటకాలతో ప్రారంభమైన నాటక ఇతివృత్త ప్రజాస్వామీకరణ జోరుగా ఊపందుకుంది. నాటకానికి సంఘ ర్షణ ప్రాణం. ఈ ఘర్షణ బహిరంగంగాను, అంతర్గతంగాను ఉంటుంది కనుక మనో విశ్లేషణ పేరుతో తెలుగు నాటక సాహిత్యంలో మానవ మనోలోకాల్లో జరిగే అంత: సంఘర్షణను ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఆత్రేయతో ప్రారంభమైన మధ్య తరగతి జీవన చిత్రం ముందుకు సాగుతోంది. ప్రపంచీకరణ సాంకేతిక సమాచార మాధ్యమాలు శరవేగంతో సామాన్య ప్రజల వినియోగంలోకి రావడం వల్ల విదేశీయమైన ప్రతి మార్పు భారతదేశంలో ప్రతిధ్వనిస్తోంది. నాటకానికి సరైన వేదికలు కరువైన తెలుగు రాష్ట్రాల్లో పరిషత్తులే వేదికలై నాటకాన్ని బతికిస్తూ, మెలో డ్రామాను కూడా పెంచి పోషిస్తున్నాయి. 20వ శతాబ్దం మధ్య నుంచి వచ్చిన ఆధునికోత్తర సాహిత్యం- వస్తుపరంగా ప్రయోగపరంగా డ్రాయింగ్ రూమ్ నుంచి బయటపడి దృశ్యాల్ని, ప్రదేశాల్ని, సంఘటనలను సింబాలిక్‌గా ప్రదర్శించడం, వ్యంగ్యంగాను అన్యాపదేశంగా విషయాల్ని ప్రస్తావించడం, జానపద కళారూపాల ద్వారా సోషియో ఫాంటసీ ద్వారా, నాటకాలు నడిపించడం, ఆధునిక సాంకేతిక సాధనాలైన లైటింగ్ ఎక్విప్మెంట్ మరింత ప్రతిభావంతంగా వినియోగించడంతో రంగస్థలం అత్యాధునిక నాటక లక్షణాలుగా సంతరించుకుంది.
ఏ రచయితను ఏ తాత్విక సిద్ధాంతాలు ప్రభావితం చేశాయో, ఏ సామాజిక స్థితిగతులు తనదైన శైలిని వస్తువును పరిష్కారాన్ని పంచుకునే దిశగా ప్రేరేపించాయో, తనలోని అంతశ్చేతనను ఏ దిశగా నిర్దేశనం చేశాయో, ఏ గడ్డు పరిస్థితిలో అతనిలో నిద్రాణమైన సృజనాత్మక శక్తుల్ని వెలికితీశాయో, సాధికారికంగా సోదాహరణంగా వివరంగా వెల్లడించారన్న సంతృప్తిని కనపరిచారు.
ఒక రచన చదివితే రచయిత ఏమి ఆశించాడో తెలుస్తుంది అతడి జీవితాన్ని చదివితే అతని ఏమి శ్వాసించాడో అర్థమవుతుంది. ఈ రెండూ సమన్వయం చేసుకుంటూ మన తెలుగు నాటక కవులు, రచయితలు ఏమి సాధించారో తెలియాలంటే ఈ గ్రంథం చదవాల్సిందేనన్న డాక్టర్ విజయభాస్కర్ అభిప్రాయంతో నూటికి నూరు శాతం ఏకీభవిస్తాం. 160 ఏళ్ల తెలుగు నాటక రంగ చరిత్రలో ఇలాంటి గ్రంథం ఒకటి రావడం ఇదే మొదటిది అని చెప్పుకోవచ్చు. ఇటువంటిది మరో వందేళ్ళకు కూడా రెఫరెన్స్ గ్రంథంగా పనికొస్తుందనడంలో సందేహం లేదు. ఇద్దరు వ్యాసకర్తలు దాదాపు 240 మందికి సంబంధించిన సమాచారం సేకరించాలని ఒక అవగాహన కొచ్చి తమ అనుకూలత, అభిరుచి, అందుబాటులో ఉండగల సమాచారాన్ని అంచనా వేసుకుని ఇష్టపూర్తిగా ఒక ఐదేళ్లపాటు శ్రమించి, అభిమానించి ఆత్రుత పడి ఆవేదన పొందడం లాంటి భావోద్వేగాల మధ్య.. అనుకున్న ఫోటోనో, పుస్తకాలో, వ్యక్తుల సమాచారమో దొరకని సందర్భంలో మధన పడి వేదనకు గురైన సందర్భాలు అనేకం ఉన్నట్లు పాఠకులకు అర్థమవుతుంది. సమాచార ప్రామాణికతకు పెద్దపీట వేస్తూ, రాష్ట్రంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లోని వ్యక్తులు, సంస్థలు, గ్రంథాలయాలను పట్టుదలతో శోధించి సేకరించిన సమాచార సముద్రం ఈ గ్రంథం.
'గాంధీ విజయం' వంటి నాటకం రాసినందుకు దామరాజు పుండరీకాక్షుడు జైలు శిక్షను అనుభవిస్తూ, అదే జైలులో అదే నాటకాన్ని ప్రదర్శిస్తే.. ఖైదీలు, జైలు సిబ్బంది కలిసి తెల్లవారులు చూసి, స్వాతంత్య్రం సాధించి తీరాలన్న సంకల్పం మరింతగా దృఢపడ్డ సందర్భాన్ని అక్షరబద్ధం చేస్తూ, వ్యాసకర్తలు అనుభవించిన ఆనందోద్వేగాలు పాఠకుల్ని చుట్టుముడతాయి. వేటపాలెంలోని సారస్వత నికేతనంతో పాటు భారత ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా లైబ్రరీ' వీరి కృషికి ఉపయోగపడిన సమాచార కల్పతరువు. పిఎస్‌ఆర్ అప్పారావు, మిక్కిలినేని తరువాత తెలుగు నాటక రంగ నటరత్నాలను కాల చరిత్ర నుంచి తవ్వి వెలికి తీసి దాని బృహదాకారాన్ని కళ్ళరా చూసుకున్న ధన్యులు ఈ వ్యాసకర్తలు. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటక రచయితలు, నటులు, దర్శకులు, సమాజాలు సాంకేతిక వర్గం ఇలా విభజించుకుని అహరహం తపించి పూర్తి చేసిన యజ్ఞసమ దీక్షా ఫలితంగా కనిపిస్తుంది ఈ గ్రంథం. గుంటూరు 'సంస్కృతి' బాలచందర్ గారి ఆమోదంతో రంగస్థల నటుల గురించి ఒక పుస్తకం రాయాలి, రాద్దామనుకుని ఆ పుస్తకం రాసి, అటుపై రచయితలు దర్శకులు, సంగీత కళాకారులు సాంకేతిక నిపుణులు, సమాజ నిర్వాహకులు, పరిశోధకులు' సమాచారంతో మరొక పుస్తకం తీసుకురావాలనుకున్నప్పుడు, అజోవిభోకందాళం ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి వ్యాసకర్తల కలల సాకార రూపంగా ఈ గ్రంథాన్ని ప్రచురించి, భౌతికంగా మన ముందు ఉంచడం ఎంతైనా అభినందనీయం.
- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655










