Jun 19,2023 07:35

నువ్వు వచ్చావు కదా
ఈ చిత్తడి సాయంత్రం
చలిలో పెనుగాలులహౌరు వలయంలో
సన్నని దారుల గుండా లోతైన లోయల దాటి
పాములా వంకరలు తిరుగుతూ ప్రవహిస్తున్న
వంకలు వాగులు నదుల మీదుగా ఈది
శిఖరాలపై ఎగిరి
నీదైన నీదాని కోసం నీకు నువ్వు ఓడిపోయి
నిన్ను నువ్వు త్యజించి
రాజమహాలు నుంచి రంగుల చక్రంలోంచి
ఈ ఇనుప చువ్వల చట్రం నుంచి
చుట్టుముట్టిన అలవికాని కాంక్షల నుంచి
అబద్ధపు జీవనంలోంచి
బయల్పడుతూ బయట పడుతూ
ఒకపెద్ద నిప్పుల కుంపటిని మోస్తూ
ఒక అపకీర్తి వాదనను భరిస్తూ
ఇన్ని కత్తుల వంతెనల్ని దాటుకుంటూ
ఇన్ని గొంతు మీది
అడకత్తెరల్ని పక్కకు తోసేసుకొంటూ
ఇక్కడి ఈ సమాధుల వనంలోకి
ఈ శ్మశాన ప్రశాంతతలోకి
గెలవ ప్రయత్నించి పోరాడి ఓడిపోయి
మరణించిన నీ ప్రియ చెలికాడిని
బతికించడానికై కదా
వో జీవన రవళివై వచ్చావు
ఈ క్రూర ఘోర మృగారణ్యంలో ఒక్కర్తివి నువ్వు
రక్తం వర్షిస్తున్న పాదాల్ని లెక్కచేయక
సాగిన ఒంటరి దారివి నువ్వు
దారంతా పరుచుకున్న నరికే కత్తుల్ని దూసే బాకుల్ని
లెక్కచేయక నడచిన పాదానివి నువ్వు
నిజంగా ఒక సాహసానివి
ఒక అద్భుత చరిత్రవి
నైతిక అనైతికాల మధ్య
మనసు మాత్రమే చూడగల సరళ రేఖవి
గొప్ప ముగింపునకు శ్రీకారానివి
ఎన్ని యోజనాల దూరమో
ఎన్ని యుగాల యుద్ధమో
ఇంకా సాగుతూనే ఉంది !
మసీదు గోడల మీదనో
మందిర గోపుర కలశాల పైనో
పావురాల కుత్తకలు తెగనిదెప్పుడు
నువ్వూ నేను ఒక్కరిమే కాదు ;
ప్రేమ ఎప్పుడూ
ఒక కళింగ యుద్ధానంతర శోక గీతం
రా ... నా ప్రియ నెచ్చెలీ ...
నన్ను అనునయిస్తూ
ఈ చలనరహిత శయన మందిరంలోకి
నిర్బయ ప్రపంచంలో రేపు
మనం తొలి పొద్దయి ఉదయిద్దాం!
 

- లోసారి సుధాకర్‌
99499 46991