Nov 14,2022 07:34

మానవత్వానికి, మనిషి తత్త్వానికి ఒక అనుసంధాన సూత్రం కవిత్వం. అసలు కవిత్వాన్ని కచ్చితంగా ఆవిష్కరించేవారెవరు? ఆంగ్ల కవి జేమ్స్‌ జాయిస్‌, కవిత్వం గురించి ఓ మాట చెప్పాడు. అది : Poetry, even when apparently most fantastic, is always a revolt against artifice, a revolt, in a sense, against actuality, Poetry is the one place where people can speak their original human mind. It is the outlet for people to say in public what is known in private . 

విత్వానికి ఏ వస్తువును వేళ్లాడదీసినా అది సందేశాత్మకంగా ఉండాలి.కవిత్వం ఎంత అద్భుతమైనదైనా వాస్తవానికి వ్యతిరేకంగా ఉండకూడదు. కవిత్వంలో వ్యక్తి ఆవిష్కరణ అవసరం లేదు. మరి అలాంటి కవిత్వం ఎలా ఉంటుంది? తెలుసుకోవాలంటే స్వచ్ఛమైన కవి వాకిట నిలబడాలి. ప్రఖ్యాత కవి డాక్టర్‌ పెరుగు రామకృష్ణ తాజా కవిత్వ సంపుటి 'వర్ణలిపి' చదివితే- పై మాటలకు మనకు అర్థం తెలుసొస్తుంది.
       'వర్ణలిపి' పేరులోనే కవిత్వం ఉంది. నాలుగు దశాబ్దాలుగా కవిత్వమే శ్వాసగా, ధ్యాసగా భావించిన ప్రముఖ కవీ, బహుభాషా ప్రవీణులు రామకృష్ణ. తెలుగు కవిత్వపు ఎల్లలను అంతర్జాతీయ స్థాయికి చేర్చి, పేరెన్నిక గన్న కవి. ఈ సంపుటిలో ఈ కవి భావాలను తరచి చూస్తే ..
     'అంటార్కిటాలో విరిసిన కుసుమమైనా/ దక్షిణాఫ్రికా ఎడారుల్లో కళ్ళు తెరచిన కాక్టస్‌ మొక్కైనా/ ప్రాణం ఖరీదు ఒక జీవితమే/ జీవితమంటే జనన మరణాల జోతిష్ఛ్కక్రం కాదు/ వాసంత సమీర వేణుగానం' అంటూ జీవితాన్ని గురించిన తాత్పర్యం వెల్లడిస్తారు. ఆయన తాత్విక పదావిష్కరణ గొప్ప ఆనందానుభూతిని కలిగించింది. 'దేశానికి రెపరెపలాడే జెండా / వీర జవాను../ ఆ జెండాకి గడకర్ర లాంటి/ వెన్నెముక రైతు' / రైతుకీ భూమికీ ఉన్న ఆత్మబంధం/ తూరుపు తీరపు వెలుతురు లాంటిది/ దేశం పడమటి తల దీపమయింది' అంటారు ఒక కవితలో. ఎంత గొప్ప భావన? కవిత్వంలో వివిధ పదచిత్రాల పరస్పర సంబంధం వల్ల కావ్యానికి అర్ధవత్వం లభిస్తుంది. దిగులును వర్ణించినా ఆ దిగులుకు దివ్వెల్ని వెలిగించి ఆ వెలుగులో తన భావాల్ని పండించే కవి ఈయన. కవిత్వాన్ని, జీవితాన్ని అనుసంధానం చేస్తూ ఎంతో అనుకూలంగా. అంతరాంతరాల్లో ఉన్న వేదనను సైతం వర్ణనాత్మకంగా మార్చగలిగే శక్తి ఈ కవి కలానికి ఉంది. 'శృతిలయలను సెలవంటూ/ హృదయం ఎక్కడుందో వెదుక్కుంటూ/ ఏమంత తొందర ముంచుకొచ్చిందని/ వెళ్ళిపోయావు మిత్రమా!' అని ఆవేదన చెందుతూనే 'ప్రపంచం కోల్పోయిన హృదయం అంటారు. నా మదిలో నీ స్మ ృతి విత్తనం నేడు నాటుకుంటున్నా' అంటారు. రచయిత సింగమనేని మరణం గురించి వ్యాకులపడుతూ ఇలా అంటారు : 'వర్ధమాన రచయితల్ని సాహిత్య పొలంలో/ తోడిబోసే బొక్కెన లాంటి పెద్ద మనిషి అతడు/ అక్షరాన్ని నఖశిఖ పర్యంతం కప్పుకుని / పఠితకు సెలవంటూ పయనమయిన/ మా సింగమనేనికి జోహార్లు' అర్పించారు.
     కార్పొరేట్‌ జీవితాలను ఉద్దేశించి రచించిన 'కార్పొరేట్‌ కార్ముకం', ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా రాసిన 'సజీవ స్పర్శ', నూతన సంవత్సరాన్ని ఉద్దేశించిన 'వెలుతురు పండగ', ఉగాదిని తలపించే 'ఓ కలల వేకువ' వంటి కవితలు చక్కని భావ వ్యక్తీకరణకు నిదర్శనాలు. 'ప్రియమైన చేతులు' కవిత్వంలో 'బంజరును తాకి బంగరు మాగాణిగా/ మలిచే పరుసవేది చేతులు/ విత్తును నాటి ప్రాణ ప్రతిష్ట చేసే చేతులు/ పచ్చని సంజీవని చేతులు/ ఆ చేతులంటే నాకెంతో ఇష్టం..' అంటూనే 'పొలం పార పట్టి పలుగు తీసే చేతులు/ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన చేతులు/ మట్టి పొరల్లా వృద్ధాప్యంలో ముడతలు పడ్డ చేతులు/ ఆకలిగొన్నవారికి అన్నంపెట్టే చేతులు/ జెండా మోసే చేతులు అంటే నాకెంతో ఇష్టం' అని వివరించారు. దేశ పౌరునిగా ప్రతి ఒక్కరికీ బాధ్యతను గుర్తు చేసేలా ఈ కవిత సాగింది.
      ఈ సంపుటి మరో మెరుపు హైకూలు. ఉదాహరణగా గమనించండి. 'చెట్టును కూడా/ అర్థవంతం చేస్తుంది/ పిచ్చుక పాట'. 'సముద్రానికి / నిద్రను దూరం చేసింది/ తుఫాను రాత్రి', 'పాట కొరకు/ వెదురును వేడుకుంది/ అడవి గాలి' వంటి ఆణిముత్యాలు ఈ సంపుటిలో ఉన్నాయి.
       ఈ కవి కవిత్వంలో గొప్ప విశేషం క్లుప్తత. బహుకొద్ది వాక్యాల్లోనే చక్కని ఆత్మను కుదర్చటం మనకు కనిపిస్తుంది. 'గోడమీద పిచ్చుక బొమ్మొకటి/ నోరు తెరచి నన్ను ప్రశ్నిస్తున్నట్టు/ మానవ జాతి అభివృద్ధికోసం/ జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్న విధ్వంసకారుడిలా/ ఆ బొమ్మ ముందు మోకరిల్లిన నేరస్తుడిని నేను' అంటారు తమ 'ఇనప చెట్లు' కవితలో. 'తీర్థయాత్ర' కవితలో- 'మిత్రమా/ వశిష్టుడు కమండలంలో / సముద్రాన్ని వొంపుకెళ్ళాడు/ మొత్తం పదకొండు కోట్ల కెరటాలు/ పదకొండు వందల లక్షల క్యూసెక్కులు/ చాచిన చేతులు చాచినట్లే/ అర్థిస్తున్నట్లే ఉన్నాయి' అనడంలో గొప్ప గూడార్థాన్ని స్ఫురింపచేశారు. ఇంకా కంచిమేక, దేహాలయం, మాల్‌, నిశ్శేష శేషం, అంతిమ సేవ, యుద్ధ చరిత్ర కవితల్లో లోతైన భావాలు పఠితలను వెంటాడతాయి.
          కొన్ని అనువాద కవితలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి. కొన్ని కంటతడిని తెప్పించాయి. పాకిస్తాన్‌ కవి మహమ్మద్‌ షానజర్‌ కవితలో... 'అమ్మా! ఎంత బాధగా ఉంది/ మనం చిలకల పంజరం విప్పలేదు/ ఇప్పటికీ అక్కడే ఉన్నాయి/ వాటికి ధాన్యం, నీరు ఎవరు ఇస్తారు?/ అమ్మా! మా నాన్న ఎక్కడీ/ మన వెనకాలే వస్తున్నాడన్నావ్‌/ వారంతా పడకలపై ఎందుకు పడుకోరు?/ విశ్రాంతి ఎందుకు తీసుకోరు?' అన్న ప్రశ్నలు మనల్ని కంటతడి పెట్టిస్తాయి. ఈ 'వర్ణలిపి' అనేక వర్ణాలకు భాష్యం చెప్పింది. అనేక సమస్యలకు సామరస్యత చూపింది. ఆలోచనల్ని రేకెత్తించింది. ఆవేశాలకు అర్థం చెప్పింది. కవికి హృదయపూర్వక అభినందనలు.
 

- శైలజామిత్ర