'నేను ఇక్కడి భూమిని.' ఇది సహజంగానే ఆకట్టుకునే కవిత్వ శీర్షిక. సీనియర్ కవయిత్రి శిలాలోలిత కవిత్వం తిరుగుబాటు తత్వం నేర్పుతుంది. వర్తమాన సమాజంలో తను వీక్షించిన, తన మనసుకు గాయమైన ఘటనలను అనుభవాలను కవిత్వంగా రాసే ప్రగతిశీల కవయిత్రి ఆమె. ఆమె కవితాక్షరాలు పాదరసంలా శిల్పవిన్యాసం చేస్తాయి. కవిత్వం నిండా వర్తమాన సమాజం కనబడుతుంది. దురాగతాలు, దుర్మార్గాలు, బాధలు, కన్నీళ్ళు, నిరసనలు.. అనేకానేక ప్రశ్నలు దర్శనమిస్తాయి. ఏ కవిత రాసినా ఎత్తుగడలోనే కవిత్వం గుర్తుండిపోయేలా పరిమళిస్తుంది. 'అప్పుడప్పుడూ ఇలా మనుషులంతా గడ్డ కట్టుకు పోతుంటారు..'... 'నేను ఇక్కడి భూమిని.'' కవిత్వ సంపుటిలోని తొలి కవిత 'అరికాళ్ళ మంటలు'లో ప్రారంభవాక్యాలవి.
'అమ్మ చేసిన యుద్దంలో గెలిచాక/ గర్భ సరస్సు నుంచి జీవన సముద్రంలోకి వచ్చిపడ్డాను/ స్త్రీ అంటే కేవలం ప్రశ్న కాదు/ జవాబై నిలబడి నిలదీసే హెచ్చరిక..' ... ఇలా తొలి కవిత్వ పంక్తులే మననం చేసుకునేలా ఉంటాయి. 'స్త్రీ అంటేనే మహాసముద్రం/ లైంగిక వేధింపుల, వివక్షల రెట్టాలెన్ని వేసినా/ ఆమె మనో నిగ్రహం ముందు/ అనంత ప్రవాహంలో కొట్టుకు పోవాల్సిందే..' ఇలాంటి పదునైన వాక్యాలు, నిప్పుకణికలు ఈ కవిత్వంలో కనబడతాయి.
బేటీ బచావ్, బేటీ పఢావ్ పథకాన్ని ప్రధాన మంత్రి 2015లో ప్రారంభించారు. బిడ్డ ఆడైనా, మగైనా సమానంగా గౌరవించాలనేది మన నినాదం కావాలని, బాలిక పుడితే మనం పండగ జరుపుకోవాలని, కూతురు పుట్టినందుకు మనం గర్వపడాలంటూ ప్రగల్భాల ప్రకటన చేశారు. 'కూతురితో సెల్ఫీ' అని హడావిడి చేశారు. కానీ, ఈ ప్రభుత్వం అభం శుభం తెలియని బేటీ అసీఫాను రక్షించలేకపోయింది. శిలాలోలిత 'బేటీ బాచావ్' కవితలో ఇలా చెప్పారు.
''ఆయేషా నుంచి ఆసిఫాదాకా/ గుర్తుంచుకోగలిగామా/ ఇప్పుడు మనమొక్కడున్నామని/ శరీరాలని, మెదళ్ళని, హదయాన్ని/ కోల్పోయిన వాళ్ళం కదా!/ ఆలోచన మాత్రం బతికున్నవాళ్ళం కదా!/ తెరిచిన కళ్ళల్లో చూపులని బంధించి/ ఘోరాన్ని తెలియనట్టుగా నటిస్తూ/ 'అంతాబానే వుంది' అనుకుంటూ/ బతుకుతున్న వాళ్ళం కదా!/ మన పాప/ మనింట్లోనే భద్రంగా వుంది కదా అదే చాలు/ అనుకునే సర్దుబాటు జీవితాలివి/ చలించం, ఉద్యమించం/ దు:ఖాలనీ, నిరాశలని, చెప్పలేని నిస్సహాయతలని/ కడుపులోనే దాచేసుకున్నాం./ 'ఆల్ ఈజ్ వెల్' అనేసుకుంటూ/ గొప్పగా బతుకును నటిస్తున్నవాళ్ళం కదా!'' అంటూ జనం ప్రేక్షకపాత్రను ఆవేదనతో తీవ్రంగా నిరసించారు.
అలాగే, గౌరి లంకేశ్ హత్యోదంతంపై రాసిన కవిత.. 'శిఖరం నేలరాలింది'లో ... ''నీకు తెలుసు/ నిజంగా నీకంతా తెలుసు/ ఎవడు దొంగో ఎవడు దొరో/ ఎవరు పీడితులో ఎవరు పీడకులో/ ప్రశ్నించే శిఖరమైనందుకు/ మాటేసి మట్టు పెట్టాడు/ ... నిన్ను భూమి పొరల్లో పాతరేసాననికుంటున్నారు/ రాజ్యమంటే ఇదేనని సవాలు విసురుతున్నాడు/ చిత్రం బహు విచిత్రం/ ధైర్యం ఒరలోంచి నువ్వు విసిరిన అక్షరాలు/ ఊరికే నేలరాలవు నీ నెత్తుటివిత్తనాలు/ మొలకెత్తుతూనే ఉన్నాయి. ఉంటాయి.'' అని నివాళ్లర్పించారు.
ఈ కవిత్వ సంపుటికి శీర్షికగా నిలిచిన ''నేను ఇక్కడి భూమిని'' ఇలా సాగింది... : ''ఈ భూమ్మీద మనుషులు జీవిస్తున్నారు/ పశుపక్ష్యాదులు, చెట్టూ చేమా/ కలగలిసిన ఒక పండుగ/ ఇప్పుడు మనుషులెవరని ప్రశ్న ఇప్పుడు ఉనికి ఏమిటని ప్రశ్న/ ఇప్పుడు నువ్వెవరని, నేనెవరని ప్రశ్న/ కాలి కింది నేల గురించి ఆరా/ నోటికాడి ముద్ద గురించి అనుమానం/ ... ఎటు చూసినా భయం/ ఎక్కడ నిలబడ్డా హద్దులు/ మనిషిని ప్రశ్నగా మిగిల్చి/ మనిషిని అతలాకుతలం చేసి/ కంచెలు కట్టి, ఆంక్షలు విధించి ఉచ్చులు బిగించి/ ఊపిరాడనీయని రాజకీయ వ్యూహం..'' దేశంలోని వర్తమానాన్ని కవిత్వానికెత్తి చూపారు. తరువాత, ''వందల ఏళ్ళ అనుబంధం నాది/ నా సంభాషణ ఈ నేలంత పాతది/ ఈ గాలి గుసగుసల్లో, ఈ చెట్టూ చేమా పచ్చదనంలో/ ఈ ఆకాశపు ఆత్మీయులతో నేనూ ఓ భాగం.'' అని స్పష్టంగా పేర్కొన్నారు. ''సరిహద్దులు నిర్మిస్తున్న ఈ మనుషుల/ అసలు అంతరంగ మేమిటి?'' అని ప్రశ్నించారు. ''ఇన్ని ప్రశ్నల మధ్య - అనుమానాల మధ్య/ ఒకే ఒక్క జవాబు- నేను మనిషిని/ నేను ఆకాశాన్ని/ నేను ఇక్కడ గలగల పారుతున్న సెలయేరును/ నేనే ఈ భూమిని, ఇక్కడి భూమిని.'' అని కుండ బద్దలు కొట్టినట్టు సమాధానమిచ్చారు. ఎంత గొప్ప స్ఫూర్తి నింపుతుందీ కవిత.
ఈ కవిత్వం స్త్రీ జీవితాన్ని, జీవన గమనాన్ని, సంఘర్షణని, స్త్రీ దు:ఖాన్ని, బాధల్ని ఎలుగెత్తి చాటింది. ఈ కవిత్వంలోని అనేక బలమైన వాక్యాలు నన్నాకర్షించాయి. అవి :
''బీడు బతుకులన్నీ సారవంతమయ్యే/ రోజుల కోసం ఎదురు చూస్తూ చూస్తూ- ఇలా'' (యాస్మిన్)
''కొత్త నీటికీ/ కొత్త బతుకులకీ/ కొత్త ప్రేమమయ లోకాలకీ/ మనం కాక ఇంకెవరు పూనుకుంటారు'' (నాచు పట్టిన చెరువులు)
''చల్లటి వెన్నెల దేహమంతా స్పర్శిస్తూ చెబుతుంది
కాలమెన్ని గారడీలు చేసినా చివరి గెలుపుమనదేనని'' (పాఠం)
''స్త్రీ అంటే మానం మాత్రమే కాదు; ఈలోకపు ఆత్మ కూడా'' (ఏదైనా చేయాలి)
''అప్పుడప్పుడూ కన్నీళ్ళు వెనక్కుజారి గుండెను నింపుతూ ఉంటాయి (అప్పుడప్పుడూ)
''బిగించిన పిడికిళ్ళను విత్తుతున్నారు అవి తప్పక మొలుస్తాయి'' (మీరెప్పుడైనా)
''పురుషాధిక్యం డిసీజ్ కాదు.. అదొక డిజార్డర్'' (స్తీ-8)
జీవితాన్ని ఉన్నతీకరించడమే సాహిత్యం యొక్క అత్యున్నత కార్యమన్న పాపినేని శివశంకర్ మాట ముమ్మాటికీ నిజమని ఈ కవిత్వం చదివాక మరింత స్పష్టమవుతోంది.
- కెంగార మోహన్
94933 75447










