- గ్రూప్ 8 ఏర్పాటుకు కేజ్రీవాల్ ప్రతిపాదన
- బిజెపియేతర, కాంగ్రెసేతర సిఎంలకు లేఖ
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) కలిసి బిజెపియేతర, కాంగ్రెస్సేతర కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. విశ్వసనీయ సమాచా రం ప్రకారం.. బిజెపియేతర, కాంగ్రెస్సేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సిఎంలతో భారత ప్రగతిశీల ముఖ్యమంత్రుల వేదిక (గ్రూప్ 8) ఏర్పాటుకు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, తెలంగాణ (కె చంద్రశేఖర రావు), తమిళనాడు (ఎంకె స్టాలిన్), కేరళ (పినరయి విజయన్), జార్ఖండ్ (హేమంత్ సోరేన్), పంజాబ్ (భగవంత్ సింగ్ మన్) తదితరులకు ఆయన ఇటీవల ఒక లేఖ రాసినట్లు తెలిసింది. 'మనమంతా కలిసి ప్రగతిశీల ముఖ్యమంత్రుల వేదిక (గ్రూప్ 8)గా కూటమి కడదాం' అని ఆయన లేఖలో ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇదే అంశంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీలో విందుకు రావాల్సిందిగా ఇదివరకే కేజ్రీవాల్ పలువురు సిఎంలను ఆహ్వానించారు. ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ గ్రూప్ 8 వేదికను ఆయన తెరపైకి తీసుకురావడం విశేషం. కాగా సిబిఐ, ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరుపై గ్రూప్ 8 తొలి చర్యగా ఒక ఉమ్మడి పిటిషన్ దాఖలు చేయాలని కూడా కేజ్రీవాల్ తాజా లేఖలో ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే కేజ్రీవాల్ తాజా ప్రతిపాదనలకు సంబంధిత పక్షాలన్నీ అంగీకరించాయా లేదా అన్నది స్పష్టత లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ఉమ్మడి ఫిర్యాదు ఇవ్వడానికి టిఎంసి, బిఆర్‌ఎస్, ఆప్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సుప్రీంకోర్టు లేదా ఢిల్లీ హైకోర్టులో ఈ ఉమ్మడి పిటిషన్ దాఖలు చేసే వీలుందని ఆప్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.