Feb 25,2023 12:01

కంచికచర్ల (ఎన్‌టిఆర్‌) : పలువురు దాడిచేయడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం వెలుగుచూసింది.

కంచికచర్ల పెద్ద బజారులో కుంచం రామారావు (45) అనే వ్యక్తి పై పలువురు దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నందిగామ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సేకరించిన సమాచారం మేరకు మృతుడు స్వగ్రామం వీరులపొడు మండలం జుజ్జూరు గ్రామం. జుజ్జూరులో రేషన్‌ డీలర్‌ గా పనిచేస్తూ కంచికచర్ల పెద్ద బజారులో పోస్టాఫీసు ఎదురుగా నివాసం ఉంటున్నాడు. 2014 లో వీరులపాడు మండలం నుంచి టిడిపి తరపున జడ్పీటీసీ గా పోటీ చేసి ఓడిపోయాడు. ఇతనికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏదైనా వివాహేతర సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.. అయితే మృతుడి భార్య కు జేసీబి డ్రైవర్‌ గా పనిచేస్తున్న వేరే యువకుడితో వివాహేతర సంబంధం ఉందని, ప్రియుడితో కలిసి భర్త రామారావును అడ్డు తొలగించుకోవాలని పధకం వేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి రామారావు భార్య, ప్రియుడు, మరో ఇద్దరు వ్యక్తులు జుజ్జూరు నుండి వచ్చి రామారావు తో గొడవపడ్డట్లు సమాచారం. మాటామాటా పెరిగి భార్యతో కలిసి నలుగురు రామారావు పై దాడి చేసినట్లు తెలుస్తుంది. మృతుడి తల్లి మాట్లాడుతూ ... వివాహేతర సంబంధం చూశాడని.. తన కొడుకును చితకబాదారని, దెబ్బల దాటికి తాళలేక తన కొడుకు మృతి చెందాడని తెలిపారు. మృతుడి భార్య కంచికచర్ల మండలంలోని మొగులూరు సచివాలయంలో విధులు నిర్వహిస్తుంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.