Mar 06,2023 08:00

ఆకలికి అవస్థలే కాటికీ అవస్థలే
కన్ను తెరిచి మూసే వరకు
కాలనికి ఎంత ఎదురీదినా
మన సమయానికి గొళ్ళెం పెడుతూ
నల్లని మసిగుడ్డతో నిద్రపూయిస్తుంది..!

ఎన్నో ఏడ్పులు పెడపెబ్బలు
ఊపిరి నిలుపుకోడం కోసం
కడుపు నింపుకోడం కోసం...
కాలానికి చికిత్స చేసిన వైద్యులెవరో నేడు లేరు
కాబోలు
విచ్చలవిడిగా విరుచుకుపడుతూ
ఎందర్నో విధి వంచితులను చేస్తూ
విధ్వంసకర విధానాలను అమలు చేస్తుంది...!
కాలం చాలా విర్రవీగుతుంది
నాకంటే తోపు ఎవడూ లేడని
నిత్య యంత్రమై కదులుతూ ...
జీవితాలను కదిలిస్తూ కబళిస్తోంది..!

కాలానికి కొన్ని రోజులు స్క్రూ బిగించాలి
లేకపోతే ఈ నట తాంత్రిక కాల ప్రవాహం
ఇంకెంతటి ప్రమాదాల్ని సృష్టిస్తుందో...!

అన్యాయాలకు అండగా నిలుస్తూ
అక్రమాలకు నేనే మొదటి పాదమంటూ
మనిషి ప్రాణాన్ని మూత్రం వదిలినంత సులువుగా
మట్టిలోకి కలిపేసుకుంటుంది...
ఎందరో ఆర్తనాద ఘోషలు వింటూ
హాయిగా నిద్రిస్తుందేమో!
కాలం గుండెకు ఎన్ని స్టంట్లు వేశారో
మళ్ళీ మళ్ళీ బతుకుతూ ఎన్నో దీపాలను ఆర్పేస్తుంది
చితిమంటలను
తను ప్రమిదగా ఆరాధించుకుంటుంది..!

కాలం ఎవర్ని ఎపుడు ఎలా మారుస్తుందో
ఎవరికీ తెలీదు
కాలానికి వయస్సుతో పని లేదు
తనతో మజిలీ చేసినందర్ని ధరణికి ఆలింగనాలుగా అందిస్తూ ఆనందిస్తుంది..!
- చేగువేరా హరి
995131071