Oct 31,2022 07:59

అనాదిగా
తగిలిన గాయాల తాలూకు
వ్రణాలు ఇంకా సలుపుతూనే ఉన్నాయి
రణాల నుంచే స్వేచ్ఛా గొంతుకలు
మారు మ్రోగుతాయి సుమా !

తగిలిన దేహాలకే మళ్లీ మళ్లీ
దెబ్బలు తగులుతున్న చందం
అనేకానేక అస్ప ృశ్యతా జాడల ఆనవాళ్లు ...

వర్ణం ఓ మాటే అనుకున్నం
మనిషినీ మానవత్వాన్నీ
నఖ శిఖం చీల్చే ఓ రాక్షస పంజా అది
ఏళ్లు గడిచినా ఇప్పటికీ మన మధ్యే
దర్జాగా కాలు మీద కాలేసుకు కూర్చున్న
అసమాన వికృత చిత్రం
కొత్త రంగుల్ని పులుముకుంటూనే ఉంది

కొన్ని విత్తనాలు విత్తుకున్న పెత్తనాలు
డెబ్బైఐదు మెట్లెక్కిన వికటట్టహాసం
ఎంత వెగటుగా హృదయాలను
ఛిద్రం చేస్తుందో
ఆ సంఘటన దొర్లిన క్షణం
మనిషితనం చిల్లు పడ్డ కుండయి పోయింది
కుండలో నీళ్లు సల్లగుంటయనుకున్నా
సవర్ణులకే అనుకోలేదు ...

ఇలా వెలవెలా వేరు పడిపోయాక
ఆపద్ధర్మ అలారు బలారులు
ఎదనెంతగా గుచ్చుకుంటున్నాయో..
ఇంతటి ముసుగు మొఖంతో
ఇంతగా వెక్కిరించబడుతున్న
నా నేల ముఖ చిత్రాన్ని
నేనెప్పటికీ ఆవిష్కరించుకోలేను

నా పాదముద్రలు మలినం కాక ముందే
ఈ నేలమీద ఈ గాలిమీద
ఈ నీరుమీద ఈ ఆకాశం మీద
భగభగ మండే
నా హృదయాక్షరాల అగ్నిశిఖ మీద
కొత్త చరిత్ర లిఖించుకోవాలి..!
 

- డా.కటుకోఝ్వల రమేష్‌
99490 83327