Dec 05,2022 08:08

ఒకటి రెండు అబద్ధాలు చెప్పు
పీచు మిఠాయిల్లా బాగుంటాయి
గొర్రెలా ఎవడైనా తలూపుతాడు
మరీ అబద్ధాల కొండను నిర్మిస్తే
నవ్వుతారు
రాజ్యాంగం నీ ఇంటి గుమ్మంలో వేలాడే
దిష్టిబొమ్మ కాదు

రక్షక దళాలనూ న్యాయస్థానాలనూ
నీ ఇలాకాలో గుంజకు కట్టేసుకుని
తూతూ అబద్ధాలను జపిస్తే మాత్రం
తప్పు ఒప్పైపోదు

నిజం నిజమే అబద్ధం అబద్ధమే
నువ్వు పారించిన రక్తపుటేరులు
నువ్వు చేసిన గాయపు మరకలు
దేశం మరిచిపోలేదు

ఛిద్రమైన శరీరాల చుట్టూ కమ్ముకున్న
పచ్చినెత్తుటి వాసన
ఇంకా చెరిగిపోలేదు
చెదిరిన అనాథ గర్భాల కల
తెగిన పేగులతో హాహాకారాలు పెట్టడమే
ఇప్పటి కొత్తద్ణుఖం

గాయం రసి కారుతూనే వుండటం
వాస్తవ దుర్ఘటన

నటించడంలో నీకు పోటీ ఎవరూ
లేరులే
నటించి నటించి నటించి
నీ అసలు రంగుని నువ్వే బయటపెట్టుకుని
నీ ముగింపు వాక్యాన్ని
నువ్వే రాసుకుంటావు

నీ అబద్ధాల పుట్టని పగలగొట్టడమే
ఇప్పుడు సరికొత్త ప్రారంభం!

- చంపావతి
96764 93680