ఆకలిబాధ అన్ని బాధలకీ
మూలకారణం అనే సూత్రాన్ని సూత్రీకరిస్తూ
ఖాళీ కడుపు చేత పట్టుకుని
ఖండంతరాలు దాటుకుంటూ
మారుతున్న కాలం ఛాయల్లోంచి
కొత్త అతిధి వస్తుంటుంది
నేలని సారవంతం చేస్తుంది
గాలిని ఆహ్లాద పరుస్తుంది
ప్రకృతిని రమణీయం చేస్తుంది
వాతావరణాన్ని పులకింపచేస్తుంది
తనంటే ఇష్టపడందెవరు
తనకోసం ఎదురు చూడందెవరు
తన వలన నేలకు మేలా
ఈ నేల వలన తనకి మేలా అనే తత్వాలను పాతరేసి
చూసినదంతా దోచుకుపోదామన్న
పరాయి బుద్ధినొదిలి
కనుచూపు మేరంతా నాదేనన్న ఆశనొదిలి
స్వచ్ఛమైన చిటికెడు స్నేహం కోసం
వెచ్చనైన బుక్కెడు బువ్వ కోసం
అరమరికలు లేని
ఆత్మీయతల్ని ఇచ్చిపుచ్చుకోవడం కోసమేనని
ఎప్పటికప్పుడు నిరూపిస్తుంటుంది
ఆమె.. ఒక వలస ప్రియురాలు !
పేరు ఫ్లెమింగో జవరాలు !
వస్తూ వస్తూ రెండుచేతులు చాచి
ఆత్మీయ ఆలింగనం కోసం వస్తుందా
పోతూ పోతూ రెండు రెక్కలల్లారుస్తూ
ఏమీ తీసుకుపోవట్లేదు
తన శరీరాన్ని చీల్చుకొచ్చిన పిల్లల్ని మినహా
అంటూ ఒక బహిరంగ ప్రకటన చేస్తుంది
అనుకోటానికి తను ఒక వలసపక్షే
వచ్చీపోతున్న ప్రతిసారీ
బతుకంటే ఎడతెగని పోరాటమని
గొప్ప పాఠాన్ని చెప్పిపోతుంటుంది
మనిషిచ్చే కాలుష్యమనే బహుమానం
బతుక్కద్దుకుంటూ..!
(ఇంటన్నేషనల్ ఫ్లెమింగో డే ఏప్రిల్ 26ను పురస్కరించుకుని)
- బంగార్రాజు కంఠ
8500350464










