- కోవిడ్ వైరస్ వేరియంట్‌ను ట్రాక్ చేయండి..
- జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇంకా వెంటాడుతోంది. జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికాల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నాలుగో వేవ్ ముప్పు పొంచివుందని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంగళవారం లేఖ రాసింది. రోజువారీ పాజిటివ్ కేసుల నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని సూచించింది. దీనివల్ల కొత్త వేరియంట్‌లు ఏవైనా ఉంటే త్వరగా గుర్తించవచ్చని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో భారత్‌లో నాలుగో వేవ్ ముప్పు ఏర్పడవచ్చునని లేఖలో ప్రస్తావించింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్.. వ్యాక్సినేషన్.. కట్టడి.. అనే ఐదంచెల వ్యూహంతో భారత్ కరనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించగలదని తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో వారానికి 1200 కేసులు నమోదవుతుండగా, ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయని భూషన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు ఏడాది జూన్‌లో కరోనా కట్టడికి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను లేఖలో ప్రస్తావించారు. కోవిడ్ కొత్త వేరియంట్‌ల వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలుగా అనుమానితులకు ముందస్తు గుర్తించి, ఐసోలేట్ చేయడం అత్యంత ఆవశ్యకమని సూచించారు.
పలు దేశాల్లో కరోనా విజృంభణ దృష్ట్యా భారత్‌లోనూ అప్రమత్తత అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. జపాన్, దక్షిణకొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయని రాష్ట్రాలను హెచ్చరించింది.
ఇప్పటికీ వందకు పైబడే కేసులు
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటికీ రోజువారీ కేసులు వందల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. మంగళవారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో 112 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం క్రీయాశీల కేసుల సంఖ్య 3,490కి చేరుకుందని కేంద్ర ఆర్యోగ మంత్రిత్వ శాఖ తెలిపింది.










