పట్టుమని పదేళ్లు కూడా లేని ఆ పిల్ల.. అక్షరాల తోటలో పుస్తకాల పువ్వులను పెంచుతోంది. గొప్ప సృజన, భావోద్వేగం, ఆలోచనా సరళితో రచనలు వెలువరిస్తోంది. జూన్ 19న జాతీయ పఠనా దినోత్సవం రోజున 'అప్పూప్పంథదికల్' అనే పేరుతో తన రెండో పుస్తకాన్ని వెలువరించింది. ఇంత చిన్న వయసులో గొప్ప గొప్ప సాహిత్యవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసే రచనా సరళిని సొంతం చేసుకున్న ఆ బాలిక పేరు భద్ర.
కేరళకు చెందిన భద్ర లాక్‌డౌన్ సమయంలో దొరికిన విరామ సమయంలో చిన్న చిన్న కథలతో తొలి పుస్తకాన్ని వెలువరించింది. సాహిత్యలోకంలో ఆ పుస్తకం ఓ సంచలనం సృష్టించింది. 'కుంజుమేఘం' పేరుతో వెలువరించిన ఆ పుస్తకానికి దొరికిన ప్రోత్సాహం ఆమెను మరిన్ని సంకలనాలు చేసే దిశగా ప్రేరేపించింది.
చిన్న పిల్ల ఏం రాస్తుంది? అంతలా ఆ పుస్తకంలో అబ్బురపరిచే సంగతులేమి ఉంటాయి అన్న అనుమానం చాలామందికి రావొచ్చు.. 'భద్రకు చదవడం, రాయడం చాలా ఇష్టం. వాటితో గడుపుతూ తనను తాను ఆ ప్రపంచంలోకి తీసుకుపోతుంది. అక్కడ తనకు ఎదురైన అనుభవాలు, భావోద్వేగాలతోనే రాయడం మొదలుపెడుతుంది' అని చెబుతున్నారు భద్ర తల్లిదండ్రులు సుమేష్, సుభ. 'మాకు పుస్తకాలు చదవడం ఇష్టం. ఆ అభిరుచితో తరచూ లైబ్రరీకి వెళ్లేవాళ్లం. మాతో పాటు భద్రను కూడా తీసుకెళ్లేవాళ్లం. అక్కడే ఆమె పుస్తకాలు చదవడం ప్రారంభించింది. వాక్యాలు చదవడం, చాలా శ్రద్దగా వాటి అర్థాలు తెలుసుకుంటూ ఎప్పుడూ పుస్తకాలతోనే గడిపేది. అప్పుడే ఆమెలో రచయిత దాగుందని కనిపెట్టాను' అంటోంది తల్లి సుభ.
తొలి అడుగు..
కోవిడ్ సమయంలో భద్ర ఉంటున్న అవనీర్ ప్రాంతంలో గల 'ప్రతిభా లైబ్రరీ' పుస్తకపఠనంపై ఓ ఛాలెంజ్ ప్రవేశపెట్టింది. అయితే అందులో భద్ర చుట్టుపక్కల ఉన్న ఏ పిల్లలూ పాల్గొనలేదు. భద్ర ఒక్కత్తే ఆ ఛాలెంజ్‌ను తీసుకుంది. ఆరు నెలల్లో 75 పుస్తకాలు చదవడమే కాక, వాటిని ప్రశంసిస్తూ లేఖలు కూడా రాసింది.
'నేను ఆమెకు ఓ పాత డైరీని ఇచ్చాను. రోజువారీ పనులు రాసుకుంటుందనుకున్నాను. కానీ భద్ర దాన్ని తన ఊహలు, ఆలోచనలతో నింపేసింది. తన అనుభవాలు రాయడం మొదలుపెట్టింది. ఉదాహరణకు తను చూసిన పిల్లి లేదా పిల్లలు ఏదైనా కావొచ్చు.. తన దృష్టిలో పడిన దేని గురించైనా రాస్తూ ఉండేది. ఇప్పుడు తన రెండో పుస్తకంలో చివరి కవితలో కొన్ని రోజుల క్రితం మా ఇంటి ఆవరణలో కదలకుండా పడి ఉన్న కాకి గురించి రాసింది. ఇలా ఆమె రచనలన్నీ పిల్లల ఆలోచనల నుండే పుట్టుకొస్తాయి' అని చెబుతున్నారు తండ్రి సుమేశ్.
'భద్ర మా స్కూల్లో చదవడం మాకు చాలా గర్వ కారణంగా ఉంది' అంటూ వరదియమ్ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న భద్ర గురించి స్కూలు యాజమాన్యం చెబుతోంది. ఆ చిన్నారి రాసిన రెండో పుస్తకాన్ని ఇటీవలె స్కూలు ఆవరణలో స్థానిక ప్రజా ప్రతినిధితో ఆవిష్కరింపజేశారు. తన తోటి పిల్లలందరి మధ్య నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటుతున్న వేళ భద్ర ఆ పుస్తకాన్ని పైకెత్తి చూపుతూ.. 'ఇది మనందరి ఆలోచనలు, అనుభవాలతో రాసిందే.. మీలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక శక్తి దాగుంది. దాన్ని బయటికి తీయండి. బాల్యం మనకు లభించిన గొప్ప వరం. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి' అంటూ ఎంతో స్ఫూర్తివంతంగా మాట్లాడింది. అందుకే పిల్ల కొంచెం.. రాత ఘనం.. అన్నది.










