
- ఐఐఎస్‌సి ప్రతిష్టను దెబ్బతీయొద్దు
న్యూఢిల్లీ : క్రూరమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఎపిఎ- ఉపా)పై చర్చను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సి) ప్రతిష్టను మసకబార్చేలా ఉందని శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 500మందికి పైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు ఈ మేరకు ఐఐఎస్‌సి డైరక్టర్ గోవిందన్ రంగరాజన్‌కు సోమవారం ఒక లేఖ రాశారు. '' యుఎపిఏ చట్టం, జైళ్లు, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ'' అన్న శీర్షికతో జూన్ 28న నటాషా నర్వాల్, దేవాంగన కలితల నేతృత్వంలో చర్చ జరగాల్సి వుంది. నర్వాల్, కలితలు విద్యార్ధి కార్యకర్తలు, ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో వారిని నిందితులుగా పేర్కొన్న ఢిల్లీ పోలీసులు యుఎపిఎ కింద వారిపై కేసు బనాయించారు. సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (సిసిఇ)లో జూన్ 27న జరగాల్సిన ఆ చర్చా కార్యక్రమాన్ని ఐఐఎస్‌సి రిజిస్ట్రార్ అర్ధంతరంగా రద్దు చేశారు. దాంతో సర్వామ్ కాంప్లెక్స్ వెలుపల ఇష్టాగోష్టి నిర్వహించాలని విద్యార్థులైన ఆ నిర్వాహకులు నిర్ణయించారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బృందాలు వచ్చాయి. చివరకు ఫ్యాకల్టీ సభ్యులు జోక్యం చేసుకోవడంతో భద్రతా బృందాలు వెనక్కి మళ్లాయి. నర్వాల్, కలితలకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ, అసమ్మతిని అణచి వేసే ఆతృతలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా సంక్ర మించిన నిరసనల హక్కుకు, తీవ్రవాద కార్యకలాపాలకు మధ్య గల రేఖను చెరిపేసిందని వ్యాఖ్యానించింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్యానించిన విషయాన్ని వారు ఆ లేఖలో గుర్తు చేశారు. నర్వాల్, కలితల అనుభవం వినడం ఐఐఎస్‌సి సభ్యులకు ముఖ్యమైనదని తాము విశ్వసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పేర్కొన్నారు. ఇతరుల దృక్పథంతో సంబంధం లేకుండా దీనిపై చర్చ జరగడం ప్రజాస్వామ్యంలో చాలా కీలకమని వారు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ధమైన ప్రశ్నలపై శాంతియుతంగా జరిగే చర్చలనే అనుమతించడానికి సంస్థ విముఖంగా వున్నట్లైతే ఇక శాస్త్రీయ దృక్పథానికి అవసరమైన కీలక విచారణా స్ఫూర్తిని ఎలా అమలు చేయగలరని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన అంశాలపై శాంతియుత చర్చను అనుమతించడానికి కూడా ఐఐఎస్‌సి సుముఖత చూపకపోతే శాస్త్రీయ దృక్పథంతో పనిచేసేందుకు అవసరమైన విమర్శనాత్మక పరిశీలన స్పూర్తిని ఎలా పెంపొందిస్తారని వారు ఆ లేఖలో సూటిగా ప్రశ్నించారు. చర్చను రద్దు చేయడం ద్వారా ఐఐఎస్‌సి పేరు ప్రతిష్టలను పాలనా విభాగం దెబ్బతీసిందన్నారు. ఈ లేఖపై సంతకం చేసిన ప్రముఖుల్లో ఐఐఎస్‌సి ఫ్యాకల్టీ సభ్యులే గాక వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. వారిలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియోరీటికల్ సైన్సెస్ ఫ్యాకల్టీకి చెందిన సువ్రత రాజు, సమృద్ధి శంకర్ రే, చెన్పైలోని మేథమేటికల్ ఇనిస్టిట్యూట్ ఫ్యాకల్టీకి చెందిన అలోక్ లద్దా, ఐఐటి కాన్పూర్ ఫ్యాకల్టీకి చెందిన రాహుల్ వర్మన్, మొహాలిలోని ఐఐఎస్‌సి ఫ్యాకల్టీకి చెందిన వైభవ్ వేష్, జెఎన్‌యు ఫ్యాకల్టీకి చెందిన మహాలక్ష్మి రామకృష్ణన్, ఐఐటి మద్రాస్ ఫ్యాకల్టీకి చెందిన చెల్లా రాజన్, ఐఐటి ఢిల్లీ ప్యాకల్టీకి చెందిన సిమోనా సాహ్నీ తదితరులున్నారు.