సోలిపేటలో సోమేశ్ అనే తుంటరి పిల్లాడు ఉండేవాడు. తన చుట్టూ ఉన్న పిల్లల బొమ్మలు పాడు చేస్తూ వాళ్ళను బాగా ఏడిపించే వాడు. అందరూ తనకు దూరంగా ఉండేవారు. ఒక రోజు సుందర్ అనే పిల్లవాడు ఓ బొమ్మతో ఆడుకుంటుం డగా వాడినెలాగైనా ఏడిపించాలని ఆ బొమ్మను తీసి దూరంగా విసిరేశాడు సోమేశ్. బొమ్మ పోయిందని ఏడుస్తూ సుందర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇలా సోమేశ్ అల్లరి రోజురోజుకూ పెరిగిపోతూ ఉండేది.
ఒకరోజు సోమేశ్ వాళ్ల నాన్న తనకు రిమోట్ కారును కొని ఇచ్చాడు. సోమేశ్ తన దగ్గర ఉన్న కారు బొమ్మను అందరికీ చూపిస్తూ సంతోషపడేవాడు. ఒకసారి ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మ పిలిచిందని లోపలికి వెళ్లాడు. ఇదే అదనుగా సుందర్ ఆ బొమ్మను తీసి పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి విసిరేశాడు. బయటికి వచ్చిన సోమేశ్‌కి తన బొమ్మ కనిపించకపోయే సరికి విపరీతంగా కోపం, ఏడుపు తన్నుకొచ్చాయి. వెళ్లి సుందర్‌ని అడిగితే, తనకు తెలియదని చెప్పాడు. దీంతో సోమేశ్ చుట్టూ ఉన్న పిల్లలందరిని పిలిచి తన బొమ్మను వెతకమని వేడుకున్నాడు. కానీ, వాళ్లు సోమేశ్‌కి జరగాల్సిందే జరిగిందని అనుకొని ఎవరూ వెతకలేదు. కొంతసేపటికి సుందర్ వెక్కివెక్కి ఏడుస్తున్న సోమేశ్‌ను చూడలేక ఆ కారు బొమ్మను తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు సోమేశ్ చాలా సంతోషంతో తీసుకున్నాడు. అప్పుడు పిల్లలందరూ 'మేము ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బొమ్మల్ని నువ్వు ఎన్నో సార్లు పాడుచేసావు. ఆ బాధ నీకు కూడా తెలియాలనే ఇలా చేశాం' అన్నారు.
'నిజమే.. ఇంకెప్పుడూ ఎవరి బొమ్మలను తీసుకోను. గతంలో చేసిన వాటికి క్షమించండి' అన్నాడు సోమేశ్. స్నేహితుడిలో వచ్చిన మార్పుకు అందరూ సంతోషపడ్డారు.
-ఎన్.మనస్విని
ఆరవ తరగతి, సిద్ధిపేట










