Jun 16,2023 07:54

తల్లిదండ్రులు నేరం చేస్తే సమాజంలో వారి పిల్లలు వివక్షకు గురవుతున్నారు. చుట్టూ ఉన్నవారు, తోటి పిల్లలు ఎందుకు దూరం పెడుతున్నారో తెలియదు. అటువంటి నేరస్తుల కుటుంబాల పిల్లలను అక్కున చేర్చుకుంటున్నాడు రాజా. వారికి చదువు చెప్పించి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఓ వైపు పోలియోతో ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొంటూ వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ ఆకలి బాధ తీర్చుతున్నారు.

           తమిళనాడులో మధురైకి చెందిన రాజాకు మూడేళ్ల వయసులోనే పోలియో వచ్చింది. దాంతో రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. కానీ, చురుకుగా ఉండేవాడు. చదువులో ముందుండేవాడు. వికలాంగుడిగా ఎన్నో సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అవమానాలూ భరించాడు. ఆ స్థితి నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నాడు. పుట్టింది పేద కుటుంబంలోనైనా దాతల సహాయంతో చదువుకున్నాడు. మానసిక సలహాదారుగా, క్రిమినాలజిస్ట్‌గా, వైద్య సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా డిగ్రీలు పుచ్చుకున్నాడు. సామాజిక కార్యకర్తగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పుదుచ్చేరిలో చదువుతున్నప్పుడు 'ఖైదీల మానసిక సంఘర్షణ- ఆలోచనలు' అనే అంశంపై థీసిస్‌ కోసం జైలుకు వెళ్లారు. అక్కడ వారితో మాట్లాడుతున్నప్పుడు రాజాకు లోతైన మానసిక గాయాలతో బాధపడుతున్న వ్యక్తులు తారసపడ్డారు. జీవితంలో సరిద్దుకోలేని తప్పులు చేసి పశ్చాతాపడుతున్న వారు, సరిదిద్దుకోవాలనుకుంటున్న వారు, కుటుంబ సభ్యులతో గడపలేక పోతున్నందుకు కుంగిపోయిన వారూ ఉన్నారు. వారు చేసినవి ఎక్కువగా మద్యం మత్తులో జరిగిన నేరాలే అని రాజాకు అర్థమైంది. భార్యలను చంపిన భర్తల కేసులే అధికం. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలే వారిని జైలుపాలు చేశాయి. అయితే వారి పిల్లలు అనాథలుగా బతుకు ఈడుస్తున్న పరిస్థితులు వారిని మరింత బాధ పెడుతోందని తెలుసుకున్నారు. వారి మాటలు రాజాను ఆలోజింపజేశాయి. వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఖైదీలతో సత్సంబంధాలను ఏర్పరచుకుని వారి కుటుంబాలకు సహాయం చేసే మార్గాలను అన్వేషించారు.
 

                                                                             సంస్థ ద్వారా ...

2012లో 'గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఈక్వాలిటీ' సంస్థను స్థాపించారు. రాష్ట్రంలో వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దాని ద్వారా కౌన్సెలింగ్‌ చేశారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఎంతో మందికి వైద్యం అందించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు సమాజంలో తాము పడుతున్న వేదనను రాజాకు చెప్పుకుని బాధపడ్డారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాధలుగా శరణాయాల్లో, పనివాళ్లుగా జీవిస్తున్నారు. కొంతమంది ఖైదీల పిల్లలను బడిలో చేర్చుకోవడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పిల్లలతోనూ రాజా మాట్లాడారు. తల్లి, తండ్రే నేరం చేయడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యి మానసికంగా దెబ్బతిన్న వారికీ కౌన్సిలింగ్‌ చేశారు. సమాజంలో వారి పట్ల చిన్నచూపు, ఎదుర్కొన్న అవమానాలను చెప్పారు. ఇవన్నీ రాజాను ఎంతో ప్రభావితం చేశాయి. అప్పటికే వికలాంగ హక్కుల కార్యకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు రాజా. బృందంలో కొంతమంది వ్యక్తులు కలిసి- ఖైదీల జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి పిల్లలకు విద్య చెప్పాలనుకున్నారు. సుమారు 1200 మంది పిల్లలను చేరదీసి తమ సంస్థ ద్వారా చదువు చెప్పిస్తున్నారు. వారి మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ కౌన్సిలింగ్‌ ఉంటుంది. వ్యక్తిగత దాతల సహాయంతో మెరుగైన విద్యను అందిస్తున్నాడు.
          కన్యాకుమారిలోని మారుమూల గ్రామానికి చెందిన మహాలి (12), దీపలి (13) ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తండ్రి జైలుకెళ్లడంతో అనాథలయ్యారు. హోటళ్లలో పనిచేస్తూ ఆకలి తీర్చుకున్నారు. రాజా వారిని చేరదీసి, చదివించాడు. వారిప్పుడు లా కంప్లీట్‌ చేసి లాయర్స్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తిరునెల్వేలికి చెందిన మయిల్‌లి 14 ఏళ్ల వయస్సులో కలిశాడు రాజా. నిరాశతో కుంగిపోయిన మయిల్‌కి ధైర్యం చెప్పి మార్గదర్శిగా నిలిచాడు. బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌లో కోర్సు కంప్లీట్‌ చేయించాడు. ఇప్పుడు వైద్య పరికరాల కంపెనీలో నాణ్యతా విశ్లేషకుడిగా మయిల్‌లి స్థిరపడ్డాడు. ఇలా ఖైదీల పిల్లలకు స్కాలర్‌షిప్‌ పథకాలు, ఉచిత విద్య, హాస్టల్‌ వసతిని కల్పిస్తూ పూర్తి సంరక్షకుడుగా మారి వారి అభ్యున్నతకి కృషి చేస్తున్నాడు రాజా.