పర్యాటకం అంటే- ప్రాంతాల సందర్శనే కాదు.. సంస్క ృతి, సాంప్రదాయాల పరామర్శ కూడా.. పర్యాటకానికి కొత్త అర్థం చెబుతున్నారు అసోం వాసి జూలీ కగ్టి. కొండలు, గుట్టలు, లోయలు, జలపాతాల సందర్శనతోనే ప్రకృతి అందాలన్నీ చూసినట్లు కాదంటారు ఆమె. ఆయా ప్రాంతాల ప్రజల జీవనశైలి, వారి మనుగడ, భాష, ఆహార నియమాలు, సాంప్రదాయాలన్నింటినీ తెలుసుకోవాలంటారు. ఆ దిశగా పర్యాటకులకు విశేష అనుభూతులను పంచేందుకు 'కర్టైన్ కాల్ అడ్వెంచర్స్' పేరుతో ఓ పర్యాటక సంస్థను ప్రారంభించి ప్రాంతీయ సంస్క ృతి, సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నారు.
అసోం మజులిలోని సాల్మోర్ గ్రామం.. భారత దేశ మొట్టమొదటి ద్వీప జిల్లాలో ఒకటి. ఆ కుగ్రామంలో బిను భొరాలి మట్టితో కళాఖండాలు చేయడంలో నిమగమై ఉన్నాడు. అతని చుట్టూ కూర్చొన్న కొంతమంది ఆ కళా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అతనితో కలిసి ఆ మట్టి ముద్దలపై చేతులు ఆడిస్తున్నారు. మరికొంతమంది ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న బిను ఒకింత ఆనందంతో అలవోకగా ఆ మట్టి ముద్దలను అందమైన కళాకృతులుగా చేస్తున్నాడు. 'వాళ్లంతా అలా చూస్తుంటే నాకు భలే సంతోషమేస్తుంది. పనిలో నాకు ఉత్సాహంగా కూడా ఉంటుంది. మా ప్రాంతానికే పరిమితమైన కళ వాళ్ల ద్వారా బయటి ప్రపంచానికి తెలుస్తుందని ఒకింత గర్వంగా కూడా ఉంటుంది' అంటూ బిను చెబుతున్నాడు.
బిను నివసిస్తున్న ఆ ప్రాంతానికి చేరుకున్న పర్యాటక బృందానికి నాయకత్వం వహించిన జూలీ 'ఈ గ్రామ సందర్శన ఉత్తర భారత యాత్రలో ఒక భాగం. మరుగున పడిపోతున్న హస్తకళలను పరిచయం చేయాలన్న సంకల్పంతో యాత్రలో వీటిని భాగం చేస్తాను. ప్రత్యేకంగా ప్యాకేజీలో వీటి గురించి ప్రస్తావిస్తాను. ఈ కళలు వారి మనుగడ కోసమే కాదు.. ఇవి వారి జీవనవిధానమని ప్రతి ఒక్కరికీ తెలియాలి. అదే నా లక్ష్యం' అంటున్న 52 ఏళ్ల జూలీకి డిజైనర్‌గా రెండు దశాబ్దాల అనుభవం ఉంది.
'అసోం దిగ్బోయ్. మా పూర్వీకుల ప్రాంతం. బాల్యంలో సెలవులు వచ్చినప్పుడల్లా నేను అక్కడికి వెళ్లిపోయేదాన్ని. ఆ పరిసరాలు నాకు బాగా నచ్చేవి. గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలు బాగా ఆకర్షించేవి. మా ఇంట్లో మహిళలు కూడా హస్తకళలు చేయడం చాలా సార్లు చూశాను. వాటినే చూస్తూ పెరిగిన నేను డిజైనింగ్‌పై ఇష్టం పెంచుకున్నాను. బెంగళూరు, ముంబయి టెక్స్ట్‌టైల్ ఇండిస్టీలలో 25 ఏళ్లు పనిచేశాను. 2015 నాటికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కలిగారు. నా పిల్లలకు కూడా నా చిన్ననాటి అనుభూతులను పరిచయం చేయాలని తీరిక చేసుకుని ఆ ప్రదేశాలకు తీసుకెళ్లేదాన్ని. అయితే ఆ గ్రామాలు ఇప్పుడు చాలా మారిపోయాయి. బతుకుదెరువు కోసం గ్రామస్తులు వలసలు వెళ్లిపోయారు. ఊళ్లో ఉన్న కొద్దోగొప్పో జనం కూడా నిస్తారంగా బతుకుతున్నట్లు అనిపించింది. హస్తకళాకారులు ఒకరో ఇద్దరో మిగిలారు. వారి తరువాత అక్కడంతా శూన్యమైపోతుందని అర్థమై తట్టుకోలేకపోయాను. ఈ పరిస్థితి పోవాలంటే.. కనుమరుగైపోతున్న సంస్కృతి, సాంప్రదాయాలను బతికించుకోవాలంటే నా వంతుగా ఏదైనా చేయాలనుకుని 'కర్టైన్ కాల్ అడ్వెంచర్స్'ను స్థాపించాను అంటూ తన ప్రయాణం గురించి చెబుతున్నారు.
'పర్యాటకం అంటే బీచ్‌లు, సముద్రాలు, కొండలు, లోయల సందర్శన ఒక్కటే కాదు. ఆయా ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలను కూడా పరిచయం చేయాల'ని గట్టిగా చెబుతున్న ఆమె.. ఎవరో చేయాలని కూర్చోవడం కంటే నేనే మొదటి అడుగు వేయాలనుకున్నాను. అలా నా ప్రయాణం మొదలుపెట్టాను. గ్రామాల్లో నివసించడం, చేనేత ప్రదర్శనలు ఇప్పించడం, స్థానికుల భాషా తరగతులను పరిచయం చేయడం, పడవ ప్రయాణాలు వంటి గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రతి అంశాన్ని ఇక్కడ భాగం చేస్తున్నాను. గ్రామస్తుల కళను ఆరాధిస్తున్న పర్యాటకులను చూసి కళాకారులు కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. హస్తకళలను కొనుగోలు చేయడం ద్వారా వారికి ప్రోత్సాహంగా కూడా ఉంటోంది. వారితో కలసి కొన్ని రోజులు అక్కడే గడపడం వల్ల మళ్లీ మళ్లీ ఆ ప్రాంతాలకు రావాలని పర్యాటకులు కోరుకుంటున్నారు. ఇటువంటి వాతావరణం ఏర్పడినప్పుడే ఎంతకాలమైనా ఆ కళ, కళాకారులు మనుగడలో ఉంటారు' అని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అసోం ప్రాంతంలోనే కాదు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర కేరళ, ఈశాన్య భారత్‌లో కూడా జూలీ ఇటువంటి యాత్రలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు ముందుగా వెళ్లి రోడ్డు రవాణా మార్గాల గుండా స్వయంగా ప్రయాణించి ఆ మార్గంలోనే పర్యాటకులను తీసుకెళ్తుంటారు. ఆ ప్రయాణంలో ఎదురయ్యే గ్రామాలను సందర్శిస్తూ వారి యాత్ర సాగుతుంటుంది.










