వాషింగ్టన్ : అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా 1963లో డాక్టర్ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్ వద్ద నిర్వహించిన బ్రహ్మాండమైన మార్చ్‌కు 60 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం నాడు మరో భారీ మార్చ్ నిర్వహించారు. 'జాబ్స్, జస్టిస్' నినాదంతో లూధర్ కింగ్ వారసులకు చెందిన డ్రమ్ మేజర్ ఇనిస్టిట్యూట్, నేషనల్ యాక్షన్ నెట్‌వర్కు ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది కార్మికులు, హక్కుల కార్యకర్తలు, ప్రజాతంత్రవాదులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అమెరికన్ కమ్యూనిస్టు పార్టీ కూడా ఇందులో పాలుపంచుకుంది. ఓటింగ్ హక్కును కాలరాయడం, జాత్యహంకార పోలీసుల దురాగతాలు పెరిగిపోతుండడం, బ్యాంకులు రెడ్‌లైన్స్‌ను యథేచ్ఛగా ఉల్లంఘించడం, మెడికల్ కేర్‌లో అసమాతలు, సంపద సృష్టిలో, ఆర్థిక సుస్థిరతలో అమెరికన్ నల్లజాతీయులకు పూర్తి భాగస్వామ్యం లేకుండా పరిమితులు విధించడం ఇప్పటికీ కొనసాగుతున్నం దున 'జాబ్స్, జస్టిస్' నినాదాన్ని తీసుకోవాల్సి వచ్చిందని కమ్యూనిస్టు పార్టీ నేత జోరు సిమ్స్ వివరించారు. 2008లో ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు, కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన బెయిలవుట్లు, ప్యాకేజీల్లో చాలా వరకు వ్యాపారవర్గాలకు, బడా కార్పొరేట్ బ్యాంకులకే వెళ్లాయన్నారు.