సమాజంలోని అవకతవకలను, హెచ్చుతగ్గులను సరి చేయటానికి మనుషుల మధ్య ఉన్న సామాజిక అంతరాలను తొలగించి సమానత్వం నెలకొల్పటానికి అక్షరాన్ని ఆయుధంగా మలుచుకున్న కలం వీరుడు గుర్రం జాషువా. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి నేటి వరకు తెలుగు కవిత్వం అనేక విధాలైన మార్పులు చెందింది. 1930 నుంచి 70 దాకా ఈ మార్పుల్లో ఈ వేగం పంచుకోవడమే కాకుండా సాహిత్య గమనాన్ని మార్చేసింది. అంతవరకు కవితా వస్తువుగా ఉన్న దేవుళ్ళు, దేవతలు, మునులు, మహర్షులకు బదులుగా శ్రమజీవి (ఊరి వెలుపల జీవిస్తున్న) మనిషిని కవితా వస్తువుగా మలిచేటటువంటి అద్భుతమైన ప్రక్రియ మొదలైంది. మనిషి తనతోటి మనిషి గురించి ఆలోచించే అరుదైన ప్రక్రియ మొదలైంది. మనుషులందరూ సమానమైన సాంఘిక హౌదా కలిగి ఉండాలని సమానత్వానికి అవరోధమైనటువంటి ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కతిక దోపిడీల నుంచి సమాజం విముక్తి కావాలని దేవుళ్లపైనే ప్రశ్నలు సంధించాడు జాషువా.
''ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు
నలుగురు కుమారులనుట విన్నాము గానీ
పసరము కన్న హీనుడ భాగ్యుడైన
ఐదవ కులస్తుడు ఎవడమ్మా సవత్రీ'' అంటూ ప్రశ్నించాడు. ఈ దేశంలో పుట్టిన ప్రతి శిశువు ఏదో ఒక కుల గుంపులో భాగమైపోతున్నాడే తప్ప మనిషిగా వికసించలేక పోవడాన్ని ఆయన ఏవగించుకున్నాడు. వ్యక్తి వికాసానికి సమాజ పురోగమనానికి తమ వంతు పాత్ర నిర్వహించాల్సిన కవులు, కళాకారులు, రచయితలు కూడా మతపరమైన మత్తులో మునిగిపోవడాన్ని ఆయన ఖండించాడు.
''ఏనాడు మా కావ్య సృష్టికర్తల జిహ్వ
విశ్వసంత్యమును నాలపింపగలదో
ఏనాడు మా జాతి దృష్టి మాధ్యమువాసి
చుట్టుప్రక్కల తేరి చూడగలదో
ఏనాడు మా బుర్ర లీజుట్టు
తల లేని పుక్కిట కధలలో జిక్కువడవో
ఏనాడు మా విధ్యలినుప సంఘంబు నందు
చిలుము పట్టక ప్రకాశింపగలవో'' అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
మత మూఢత్వం సష్టించిన మూఢ నమ్మకాలు తనను, తన జాతి ప్రజలను సమాజానికి దూరం చేసినా తనలో ఏ మాత్రం దేశభక్తి తగ్గలేదు అనటానికి నిదర్శనం భరతమాత ఖండకావ్యం. సాంప్రదాయ భావ దారిద్య్ర లోపంతో తనపై అసూయ ద్వేషాలతో రగిలిపోతూ తనను తక్కువ చేసి చూస్తున్నటువంటి పండిత సమాజానికి తన కవితా జరితో దీటుగా ఎదుర్కొన్నాడు జాషువా.
''గవ్వకు చాటి రాని పలుగాకుల మూకలు నెవ్విద్దిన్ దూరినన్ నన్ వలచిన శారదలేచిపోవునే'' అంటూ సమాధానమిచ్చాడు. అంతకు ముందు సాంప్రదాయ సాహిత్యంలో దూరమైన పల్లెపదాలు సామాజిక చైతన్యాన్ని, వస్తువును, శిల్పాన్ని తన కవిత్వంలోకి ఒంపుకుని నిరక్షరాశులకు కూడా సాహిత్యాన్ని దగ్గర చేశాడు. ఉదాహరణకు శ్మశానవాటిక (సత్య హరిచంద్ర) పద్యాలు ...
''వాకొనరాని గొప్ప ధనవంతుని నిర్దపు పాలరాతి
గోరీకడ పారవేయబడి పేలికలన్ పొరలాడు ప్రేతమే
ఆకటి చిచ్చునన్ కుమిలి యార్చి గతించిన పేదవాని దౌ
నోకద వానికై వగవడొక్కడు దాచడు కాటినేలయున్'' అంటూ తన కావ్య నాయకుడైన పేదవాడి జీవితాన్ని వర్ణించాడు.
జాషువా స్త్రీవాద సాహిత్యాన్ని కూడా అద్భుతంగా రాశాడు. 'వంచిత' అనే కండకావ్యంలో స్త్రీల దుర్భర స్థితిని ఎలుగెత్తి చాటాడు. పురుషులు స్త్రీని వంటింటి కుందేలుగా మార్చి సంతానోత్పత్తి కలిగించే యంత్రాలుగా పూజగదులకు, పడకగదులకు మాత్రమే పరిమితం చేయడాన్ని ఆయన వ్యతిరేకించాడు. తన ఇంట్లోని స్త్రీలను పరదాల ముసుగుల్లో దాచిపెట్టి వీధుల్లో స్త్రీలకు స్వేచ్ఛ కావాలంటూ రోడ్లు ఎక్కుతున్న సమాజం ఇది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు
''అబలయన్న బిరుదమంటించి కాంతల
స్వీయశక్తులదిమి చిదిమినారు
సబలయన్న బిరుదు సాధించి హక్కులు
గడన చేసుకొమ్ము కష్ట చరిత్ర'' అని రాశాడు.
''బిరుదు అంటించడం'' అనడం లోకం తీరుకు నిదర్శనం. స్త్రీ అందానికి నిర్వచనమైన చోట స్త్రీలోని అమ్మతనాన్ని 'అనాధ' ఖండకావ్యంలో అద్భుతంగా వర్ణించాడు జాషువా. పాలకవర్గాల ఆశ్రయించి వారిచ్చే బహుమానాలుతో పబ్బం గడుపుకునే వారిని పొగుడుతూ, కీర్తిస్తూ కావ్యాలు రాసే కవులు గురించే కాక పాలకవర్గం చేత దోపిడీకి గురికాబడిన కవి గురించి 'పిరదౌసి' ఖండకావ్యం రచించాడు.
జాషువా గొప్ప దేశభక్తుడు, జాతీయవాది, భారతదేశ చరిత్ర సంస్కతుల మీద అపారమైన గౌరవం కలవాడు. బుద్ధుడు, భరతమాత, వివేకానంద, అఖండ గౌతమి వంటి రచనలు ఆయన దేశభక్తికి నిదర్శనాలు. గిజిగాడు, సాలీడు వంటి ఖండకావ్యాలు ఆయన గొప్ప ప్రకతి ప్రేమికుడు అనడానికి నిదర్శనం. సఖి, జేబున్నిసా వంటి ప్రణయ కవితలు, పంచముడు, ధర్మ కిరీటం, గుసగుసలు, ఇంటిగుట్టు వంటి సంఘ సంస్కరణ కావ్యాలు ఆయన కలం నుంచి జాలువారినవి. ఆయన సష్టించిన గబ్బిలం ఖండకావ్యం ఖండాతరాల కీర్తిగాంచింది.
సాధారణంగా కవులు తమ వంశాల గురించి తమ సామాజిక వర్గాల గురించి గొప్పగా చిత్రించుకుంటారు కానీ, జాషువా తన ప్రజల్లో ఉన్నటువంటి బలహీనతలను కూడా బహిరంగంగా ఒప్పుకున్నాడు. తన జాతి మధ్య ఉన్నటువంటి అసమానతలు విస్పష్టంగా ఖండించాడు.
''కలదమ్మ అంటరానితన మాకరుణింపుమీ యిండియా
పొలమందు గల మాల మాదిగలకున్ బూతేశుడే కాదు
కృష్ణులు కృష్ణున్నిరసించు దైవములు క్రీస్తుల్ మస్తుగా బుట్టినన్
కలుపన్నేరరు రెండుజాతులను వక్కాణింప సిగ్గయ్యెడిన్''
కవులు రచయితలు ఊహా జగత్తులో ఎక్కువగా విహరిస్తూ ఊహలు అతిశయోక్తులతో కూడిన కల్పన ఎక్కువగా సష్టిస్తుంటారు కానీ ఆ ఊహాజనిత ప్రపంచం నుంచి బయటకు వచ్చిన తర్వాత నిజ జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించక తప్పదు కదా? అందుకే జాషువా నిజ జీవిత అనుభవాలతో సహజ వర్ణనలు మాత్రమే చేశాడు. కవి లోకాన్ని పట్టి చూసినప్పుడు ఏ అంశాలు తన అనుభూతులకు గురిచేస్తాయో వాటిని తన కవిత్వంలో వ్యక్తపరిచాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణం జరగాలని కోరుకున్నాడు. ఈ సమాజంలో ఉన్న మౌలికమైన సమస్య కులం. ఆ కుల నిర్మూలన జరగాలని ఆయన ఆశించాడు. కుల నిరంకుశత్వాన్ని గబ్బిలంలో అద్భుతంగా ఆవిష్కరించాడు. కులమే ఈ సమాజంలో ఉన్న సకల జనులకు బతుకు నిర్మిస్తుందని, కులమే వాళ్లకు అవకాశాలను భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని చెప్పాడు. వ్యక్తి చైతన్యాన్ని కులము, వర్గము, ఆర్థిక పరిస్థితులు నిర్ణయిస్తాయి అన్నాడు. అట్టడుగు వర్గాల అభివద్ధికి ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని పథకాలు పెట్టినా ఆశించిన ఫలితాలు దక్కక పోవడానికి కారణం వాటిని అమలు చేసే నాయకులు, అధికారులు కులానికి అతీతులు కాకపోవడమే అనే భావన వ్యక్తపరిచాడు. చివరకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాలు కూడా కులానికి అతీతంగా లేకపోవడం వల్ల చట్టాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. మన ప్రజాస్వామ్య రాజకీయం పూర్తిగా కులం ఆధారంగానే నడుస్తోంది. ఈ కులతత్వ సమాజం కులతత్వం ప్రభుత్వాలను, కులతత్వ అధికారులను సృష్టిస్తున్న వేళ మానవ హక్కుల కాపాడబడాలంటే కవులు, రచయితలు, కళాకారులు, బుద్ధి జీవులు సామాజిక చైతన్యం కలిగి ఉండాలి.
''బోగులహరించు భుక్తి కన్నుల జూచి
పరమ పేదలు దుఃఖపడి నీ చోటు
సాంఘిక చార పంచాస్య గర్జనమున
బెదరక జ్ఞానము పెరుగు చోటు
జాతి వైశ్యన్య రాక్షస పదాహుతి చేసి
కందక కళలు పెంపొందు చోటు
పరిపాలకక్రూర తర రాక్షసికి లొంగిపోక
స్వేచ్ఛా లక్ష్మి పొదలు చోటు''
కావాలని గబ్బిలాన్ని అర్థించాడు జాషువా. సమాజపు అంతర్చేతనంలో పాతుకుపోయిన ఈ కుల తత్వాన్ని బట్టే సమానత్వ సూత్రంపైగాక అసమానత్వం వారసత్వం పైనే ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. ఈ వైఖరి మారనంతకాలం అట్టడుగు వర్గాల అభివద్ధి జరగదు. అసమానత్వం చిరకాలం వర్ధిల్లుతుంది. అందుకే ఈ సమాజాన్ని చైతన్య పరచడానికి జాషువా సాహిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించి కుల మత వివక్షలపై, విద్వేషాలపై పదునైన అక్షరాప్రస్తాలు సంధించి, విశ్వాంతరాలకు ఎదిగిన జాషువా ఇప్పుడు మరింత అవసరం, అవశ్యకం.
- గోనె లూధర్ పాల్
75691 16080










