Jul 11,2023 12:18

నేపాల్‌ : నేపాల్‌లో టేకాఫ్‌ అయిన కాసేపటికే అదశ్యమైన హెలికాప్టర్‌ కుప్పకూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఐదుగురు మెక్సికన్‌లతో సహా మొత్తం ఆరుగురు ఉన్నారని తెలిపారు. వీరంతా మతి చెందినట్లు తెలిపారు. సోలుకుంభు నుంచి కాఠ్‌మాండూకు ప్రయాణిస్తుండగా ఎవరెస్టు శిఖరం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం హెలికాప్టర్‌ 9ఎన్‌-ఏఎంవీ (ఏఎస్‌ 50) సోలుకుంబు నుంచి కఠ్మాండుకు బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్‌ అదృశ్యం కాగానే రంగంలోకి దిగిన అధికారులు దానిని వెతికేందుకు ఓ హెలికాప్టర్‌ను పంపారు. అదే సమయంలో లిఖుపికే రూరల్‌ మున్సిపాలిటీ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. హెలికాప్టర్‌ కుప్పకూలినట్లు గుర్తించారు. పైలట్‌ చెట్‌ గురుంగ్‌తో పాటు మరో ఐదుగురు మెక్సికన్‌ల మృతదేహాలనూ ఘటనా ప్రాంతంలో కనుగొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.