వనపర్తి ఊరికి దగ్గరలో పెద్ద అడవి ఉంది. ఆ ఊరి ప్రజలు వంట కోసం కట్టెలు తేవడానికి, పశువులను మేపడానికి, అడవిలో దొరికే పండ్లు తెచ్చుకోవడానికి రోజూ అడవికి వెళ్లేవారు. ఒక రోజు ఒక బాటసారి ఆ అడవిగుండా వస్తున్నప్పుడు అడవిలో గణగణమంటూ శబ్దం వినిపించింది. అది దెయ్యం పనే అనుకొని, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయాన్ని ఊర్లో అందరికీ చెప్పాడు.
నిజమా, కాదా అని కొంతమంది అడవికి దగ్గరగా వెళ్లారు. వారికి కూడా గణగణ శబ్దం వినబడింది. దాంతో వారు అడవిలో నిజంగానే దెయ్యం ఉందని నమ్మారు. అప్పటి నుంచి ఆ ఊరివాళ్లు అడవిలోకి వెళ్ళటం మానేశారు. వంటకు కట్టెలు లేక, పనులు లేక అనేక బాధలు పడ్డారు. దీంతో గ్ర్రామస్తులందరూ ఆ ఊరి పెద్ద వద్దకు వెళ్లి, తమ సమస్యను చెప్పుకున్నారు.
అడవిలో దెయ్యం ఉండడం ఏమిటి? గ్రామస్తులు ఊరకే ఎందుకు భయపడుతున్నారు? దీనికి పరిష్కారం ఏమిటి? అని ఆలోచించాడు. ''ఎవరైనా అడవిలోకి వెళ్లి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోండి. అలా చేసిన వారికి మంచి బహుమతి ఇస్తాం.'' అని చాటింపు వేయించాడు.
దెయ్యం ఉందని భయపడి అడవిలోకి వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు. ఒక బాలిక మాత్రం దయ్యాలు అనేవి ఉండవని నమ్మి, ధైర్యంగా అడవిలోకి వెళ్లింది. అక్కడ తనకు గణగణమనే శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏ వైపు నుంచి వస్తుందో గమనించి అటువైపు వెళ్లింది. అక్కడ ఒక కోతుల గుంపు గుడిలో కొట్టే గంటతో ఆడుతూ ఉన్నాయి. ఆ కోతులు అడవికి దగ్గరలో ఉన్న గుడి నుంచి ఆ గంటను తీసుకువచ్చాయని బాలిక గ్రహించింది.
తన వద్ద ఉన్న రొట్టెలను కోతులకు కనిపించేలా దూరంగా విసిరింది. వాటిని తినటానికి కోతులన్నీ గంటను వదిలి పెట్టి, రొట్టెల వద్దకు చేరిపోయాయి. వెంటనే ఆ బాలిక గంటను తీసుకొని, ఊళ్లోకి వచ్చింది. తాను గ్రహించిన విషయాన్ని ఊరి పెద్దకు, గ్రామస్తులకు చెప్పింది. దెయ్యం ఉందని తాము నమ్మినందుకు గ్రామస్తులు సిగ్గుపడ్డారు. గ్రామ పెద్ద బాలిక ధైర్యానికి మెచ్చుకొని, మంచి బహుమతులు అందజేశాడు.
- దారవేణి రిచిత,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
నర్సింహుల పల్లి.










