Aug 31,2023 06:45
  • ఖరీఫ్‌ను దెబ్బతీయనున్న వర్షాభావం

న్యూఢిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాల్లో రుతుపవన వర్షాల సుదీర్ఘ విరామం ఖరీఫ్‌ పంట దిగుబడిని దెబ్బతీసే ప్రమాదముంది. ఆలాగే రాబోయే రబీ నాట్లు ఆలస్యం కావచ్చు. మహరాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, ఆంధ్ర ప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ వంటి ప్రధాన వ్యవసాయక రాష్ట్రాల్లో ఆగస్టులో దీర్ఘకాల సగటుతో పోల్చితే నైరుతి రుతుపవనాల వర్షపాతం 30 నుంచి 80 శాతం లోటు కనిపిస్తుంది. సెప్టెంబరు5-6 తేదీల్లో బంగాళాఖాతంలో కొన్ని కదలికలు వచ్చే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నప్పటికీ ఈ లోటును పూడ్చే స్థాయిలో నైరుతి వర్షాలు ఉండే సూచనలు కానరావడం లేదు. 'ఎల్‌నినో సంవత్సరాల్లో 70 శాతం దాకా సెప్టెంబరులో వర్షపాతం లోటు కనీసం 10 శాతం ఉందని గుర్తుంచుకోవాలి', అని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి , ప్రసిద్ధ రుతుపవన నిపుణుడు మాధవన్‌ రాజీవన్‌ తెలిపారు.
ఈ ఏడాది రుతుపవనాలు దాదాపు 8 శాతం లోటుతో ముగిసే అవకాశం ఉంది. ఇది గడచిని ఎనిమిదేళ్లలో అత్యంత దారుణంగా ఉండబోతున్నదని పేరు తెలపడానికి ఇష్టపడని వాతావరణ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇటీవల తెలియజేసింది. అయితే సెప్టెంబరు మొదటి వారం తరువాత అసలు సీజనల్‌ లోటు ఎంత అనేదానిపై స్పష్టత వస్తుందని రాజీవన్‌ చెప్పారు. సుదీర్ఘ పొడి వాతావరణం చాలా రాష్ట్రాల్లో ఖరీఫ్‌ పంటపై ఇప్పటికే ప్రభావం చూపనారంభించింది. ఖరీఫ్‌ పంటల విత్తనం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు అందరి దృష్టి రుతుపవనాలు ఎప్పుడు పుంజుకుంటాయన్నదానిపైనే ఉంది.
రాబోయే 10-15 రోజుల్లో వర్షాలు సరిగా పడకపోతే నీటి పారుదల సౌకర్యాలు అంతగా లేని ప్రాంతాల్లో దిగుబడి తగ్గుతుంది. నీటి పారుదల అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సాగు వ్యయం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇండోర్‌కు చెందిన భారతీయ సోయాబీన్‌ ప్రాసెసర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన పంట ఆరోగ్య సర్వేలో ఆగస్టు వర్షపాతంలో అసాధారణమైన లోటు ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు సోయా పంట ఉన్న తేమను ఉపయోగించుకుని ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు గనుక వెంటనే వర్షాలు పడకపోతే పంట దెబ్బతింటుంది. రాబోయే 45 రోజుల్లో రుతుపవనాలు ఏ మేరకు పుంజుకుంటాయనే దానిపై అంతా ఆధారపడి ఉంటుంది అని అసోసియేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.
సోపా విశ్లేషణ ప్రకారం సోయాబీన్‌ను ఎక్కువగా పండించే మూడు ప్రధాన రాష్ట్రాలైన మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ పంట నష్టం ముప్పును ఎదుర్కొనబోతున్నాయి. రాజస్థాన్‌లో ప్రధాన ఖరీఫ్‌ పంటలైన వరి, సోయాబీన్‌, పత్తి , బజ్రా వంటి పంటలకు ఇప్పుడు వర్షాలు చాలా అవసరమని సరుకుల విశ్లేషణ సంస్థ ఇగ్రెయిన్‌ ఇండియా పేర్కొంది.
గుజరాత్‌లో సోయాబీన్‌, బజ్రా, వరి, వేరుశనగ వంటి ప్రధాన పంటలకు తక్షణమే నీరందించాల్సిన అవసరముంది. వచ్చే 10-15 రోజుల్లో సరిగ్గా వర్షాలు పడని పక్షంలో దిగుబడి పడిపోతుందని ఆ సంస్థ పేర్కొంది. అలాగే వర్షాలు సెప్టెంబరులో బలహీనంగాఉంటే, రాబోయే రోజుల్లో రబీ పంటకు కూడా ముప్పు తప్పకపోవచ్చని హెచ్చరించింది.
భారత దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 40 శాతం రుతుపవనాల వర్షాల మీదే ఆధారపడి ఉంది. క్రెసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ సంస్థ డైరక్టర్‌ (పరిశోధన) పుషాణ్‌ శర్మ మాట్లాడుతూ, రుతుపవనాల లోటుతోపాటు రిజర్వాయర్ల లెవెల్స్‌ బాగా తక్కువగా ఉండడం, వంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. వర్షపాతం లోటు వల్ల చీడ పీడల బెడద పెరిగి, పువ్వు, కాయల దశలో తొలిచేసి పంట నాశనమయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. కేర్‌ ఎడ్జ్‌ ఇండియా అనే మరో పరిశోధనా సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం మహారాష్ట్ర, జార్ఖండ్‌, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలు అస్థిరమైన రుతుపవనాల వల్ల పంట నష్టం భారత దేశ జివిఎ( స్థూల విలువ జోడింపు) లో దాదాపు మూడింట ఒక వంతు దాకా ఉంటుందని తెలిపింది.
'క్రైసిల్‌' పంటలవారీగా చేసిన విశ్లేషణలో తెల్ల దోమ వంటి చీడపీడులు రాజస్థాన్‌లో పత్తి పంటకు ఎక్కువగా సోకినట్లు తెలిపింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆలస్యంగా నాటడం వల్ల పంట దిగుబడి తగ్గుతుందని పేర్కొంది.
దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే 15-20 రోజుల్లో పొడి పరిస్థితులు ఇలాగే కొనసాగితే రైతులు పత్తి పంటను తొలగించి మొక్కజొన్న వైపు మళ్లాల్సి వుంటుందని, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిస్థితి వస్తుందని శర్మ బిజినెస్‌ స్టాండర్డ్‌కు తెలిపారు.

table