సాధారణంగా ఒక పేరు వినగానే ఆ పేరు వెనుక ఉన్న వ్యక్తుల కృషి మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ పేరును ధరించిన వ్యక్తి చేసిన శ్రమ, ఆ వ్యక్తి నుంచి పొందిన స్ఫూర్తి అన్ని వరసకట్టి మనసును చుట్టుముడతాయి. అలాంటి విలక్షణమైన పేరు డాక్టర్ రాధేయ. తెలుగు కవితా లోకంలో అందరికీ చిరపరిచితమైన వారు ఆయన.
70వ దశకం నుంచి సీరియస్‌గా కవిత్వం రాస్తున్న కవి అని రాస్తే అది ఆయన్ని సంపూర్ణంగా ఆవిష్కరించినట్టు కాదు. అది ఒక ముఖం మాత్రమే! ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు నెలకొల్పి విసుగూ విరామం లేకుండా 35 ఏళ్ల నుంచి ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న కవితా ప్రేమికుడు అందామా అంటే అది కూడా సంపూర్ణంగా ఆవిష్కరించదు. అది రెండో ముఖం మాత్రమే. వేలాది పుస్తకాలను చదివి కవిత్వాన్ని తనలో జీర్ణించుకుని, వాటన్నింటినీ విశ్లేషించి ఆధునిక కవిత్వ చరిత్రలో గణనీయమైన కృషి చేసిన విమర్శకుడందామా అంటే అది కూడా ఆయన మరో ముఖం మాత్రమే! వీటన్నింటికీ మించి కవులన్నా కవిత్వం అన్నా పిచ్చి ప్రేమను వ్యక్తం చేస్తూ ఎంతోమంది యువకులను ఉత్తమ కవులుగా తీర్చిదిద్దే గురువు ఆయన. ఇది నాలుగో ముఖం. ఆధునిక కవిబ్రహ్మ అనడానికి, అనిపించుకోవడానికి రాధేయకు తగిన అర్హత ఉంది.
డా.ఉమ్మడిశెట్టి రాధేయ 1.5.1955న కడప జిల్లా ముద్దనూరు మండలంలోని యామవరం గ్రామంలో ఒక సామాన్య దిగువ మధ్య తరగతి చేనేత కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఉమ్మడిశెట్టి గంగిశెట్టి, నాగమ్మ గార్లు. వీరికి బాల్యం నుంచే ప్రకృతి పట్ల, తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ. 1972లో అభ్యుదయ భావాలతో రాసిన తొలి కవిత అచ్చయింది. 1978లో మరో ప్రపంచం కోసం కవితా సంపుటితో తెలుగు కవితా ప్రపంచంలో తనదైన ఉనికిని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణాల వల్ల యూనివర్సిటీలో చేరి చదువుకోలేక పోయారు. 1982లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత స్వయంకృషితో తెలుగులో ఎం.ఏ., పిహెచ్‌డి చేశారు. ఉపాధ్యాయుని గా, జూనియర్ లెక్చరర్‌గా, డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకునిగా, తెలుగు శాఖాధిపతిగా తెలుగు భాషకు సేవలందించి 2013లో ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం అనంతపురంలో స్థిరపడ్డారు.
ఒకటో ముఖం
''కవిత్వం నాకు కన్ను మూత పడని జ్వరం
కవిత్వం నా కనురెప్పల మీద వాలిన ఒక నమ్మకమైన కల
ఒక్క వాక్యం నా గుండె లోతుల్లోంచి పెల్లుబికి రావాలంటే
నేనెన్ని రాత్రుల నిద్రనో తాకట్టు పెడతాను'' అంటూ కవిత్వానికి తన అనుభూతిలోంచి నిర్వచనాన్నిచ్చిన రాధేయ కవిగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు. జీవితంలో తనేం చూసాడో అదే కవిత్వంగా రాశాడు తను ఏం చేశాడో అదే కవిత్వం చేశాడు. రాయలసీమలో పద్య కవిత్వం రాజ్యమేలుతున్న సమయంలో వచన కవిగా ప్రారంభమై నిలదొక్కుకొని తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన పుట్టి పెరిగిన రాయలసీమ దైన్యాన్ని 'క్షతగాత్రం' వచన కవితా సంపుటిలో అక్షరీకరించారు. ఇప్పటివరకు 7 వచన కవితా సంపుటాలను ప్రచురించారు. ఎనిమిదో సంపుటి త్వరలో వెలువడబోతోంది.
ఆధునిక తెలుగు సాహిత్యంలో బాగా గమనించినట్లయితే కవులకు వాళ్లు రాసిన దీర్ఘ కవితలు చెరగని కీర్తిని సంపాదించి పెట్టాయి. రాధేయకు మగ్గం బతుకు దీర్ఘ కవిత ఎక్కువ పేరు సంపాదించింది. రాధేయ బతుకు మూలాల్లోంచి, తను చూసిన జీవిత పార్శ్వాల్లోంచి, తాను ఎదుర్కొన్న సమస్యల సుడిగుండాలు నేర్పిన గుణపాఠాల్లోంచి, ప్రపంచీకరణ మూలంగా కనుమరుగైపోతున్న నేతన్నల కన్నీళ్ళ మంటలలోంచి మగ్గం బతుకు పురుడు పోసుకొంది. మరో వందేళ్ల తర్వాత అయినా సరే రాధేయను మగ్గం బతుకు కవిగా తెలుగు సాహిత్య లోకం గుర్తించుకుంటుంది.
''ఇది మా యథార్థ కథ
చేనేత చిత్ర పటంలో విరిగిన మగ్గం వ్యధ
చెమట చుక్కలన్నీ రాశీభూతమై
కన్నీటి మడుగులైన కథ
సగం దేహం గుంటలోనూ
సగం ప్రాణం కళ్ళలోనూ నిలుపుకొని
ఆర్తిగా చేయిసాచే అన్నార్తుల కథ''
రాధేయ మరో దీర్ఘ కవిత సత్యారాధేయం. ఇది స్మ ృతి కావ్యం. భార్య సత్యాదేవి దూరం అవ్వడం రాధేయ జీవితంలో ఎవరూ పూరించలేని ఖాళీ. ఆయన జీవితమంతా పరుచుకున్న పరమ సత్యం సత్యాదేవి. రాధేయ పుస్తకాలు చదివితే మనల్ని ఆయనకు దగ్గర చేస్తాయి. కానీ మీరు ఒక్కసారైనా రాధేయ గారి ఇంట్లో అడుగుపెడితే సత్య గారిని మర్చిపోరు. ఆమె చూపించే ఆప్యాయత, కల్మషం లేని వ్యక్తిత్వం కట్టిపడేస్తుంది. లోపల బయట ఒకేలా ఉన్న వ్యక్తులు చాలా తక్కువ. అటువంటి ఆమె లేని లోటు, వేదనలో నుంచి పుట్టినదే సత్యారాధేయం. జీవితంలో అనేక సందర్భాల్లో ఆయన వెన్నంటి ఆత్మలా ఆమె ఉన్న తీరు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. కవిత్వాన్ని కూతురుగా భావించి ఒక పెళ్లి చేశామనుకుందామనే ఆమె వ్యక్తిత్వం మనల్ని కదలనివ్వదు. స్మ ృతి కవిత్వంలో సత్యారాధేయంది ఒక విశిష్ట స్థానం.
''ఇది క్షతగాత్రుని శ్వేతపత్రం
ఒక వియోగి అంతర్మధనం
తోడు కోల్పోయిన ఓ క్రౌంచ పక్షి దీనాలాపం
చెలరేగిన పెను తుఫానులో
చిక్కుబడిన ఓ బతుకు ఓడ అంతర్యుద్ధం
ఎగిరిపోయిన ప్రాణహంసతో
ఒంటరి నెలవంక సంభాషణం''
రెండో ముఖం
విమర్శక సంఘంలోకి కాస్త ఆలస్యంగానే అడుగు పెట్టారు రాధేయ. అయినప్పటికీ భావితరాలకు పనికివచ్చే విలువైన వ్యాసాలను ఎన్నింటినో రాశారు. వచన కవిత్వంలో ఉన్న వస్తు వైవిధ్యాన్ని సమీకరించి సంగ్రహపరచి మన ముందు ఉంచారు. ఒకే వస్తువును వివిధ కవులు ఏ దృక్కోణంలోంచి పరిశీలించారో, ఎలా కవిత్వంగా మలిచారో, వారి శిల్ప రీతులు ఎలా ఉన్నాయో పరిచయం చేశారు. అమ్మ, నాన్న, చెట్టు లాంటి సాధారణ వస్తువుల దగ్గర నుంచి కుర్చీ, చెప్పులు, పెట్టె ఇలాంటి అరుదైన వస్తువుల మీద వచ్చిన కవిత్వాన్నాంతా ఒకచోట పోగేసి విశ్లేషించారు. ఆధునిక కవిత్వాన్ని అధ్యయనం చేసేవారు, వివిధ విధానాలను తెలుసుకోవాలనుకునేవారు ఈ వ్యాసాలను చదవడం ద్వారా ఎనలేని జ్ఞానాన్ని పొందగలరు. వివిధ పత్రికల్లో అచ్చయిన ఈ వ్యాసాలను నాలుగు సంపుటాలుగా మన ముందుకు తెచ్చారు. సంస్థలు, సమూహాలు చేయాల్సిన పనిని ఒక్కడే ఒంటి చేత్తో పూర్తి చేశారు. ఆ పుస్తకాలు : 1. కవిత్వం ఓ సామాజిక స్వప్నం - 2010, 2. కవిత్వం ఓ సామాజిక సంస్కారం -2011, 3. కవిత్వం ఓ సామాజిక సత్యం- 2013. 4. కవిత్వం ఓ సామాజిక చైతన్యం-2015.
ఒక వస్తువుని తీసుకొని దాని గురించి వచ్చిన కవిత్వాన్ని అంతా వ్యాఖ్యానించడం మొదటి రకమైతే, ఒక కవి యొక్క మొత్తం రచనల మీద సమగ్ర వ్యాసాలు రాయడం రెండో రకం. ఈ క్రమంలో తెలుగునాట సుప్రసిద్ధులుగా ఉన్న కవులను ఎంతోమందిని గురించి వ్యాసాలు రాసి, పత్రికలలో వేయించి, పుస్తకం గాను రూపొందించారు. ఒక కవి గురించి మొత్తం పుస్తకాలు చదివే తీరిక లేనప్పుడు కవి తత్వాన్ని సారభూతంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. అలా మూడు పుస్తకాలు వచ్చాయి. అవి : 1. అవగాహన 2017 2. వివేచన 2021 3. విశ్లేషణ 2022
రాధేయ నిర్వహిస్తున్న ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు 30 సంవత్సరాల ఉత్సవ సందర్భంగా అవార్డు పొందిన పుస్తకాల మీద ఆయనే వ్యాసాలు రాసి 'మూడు పదులు ముప్పై కావ్యాలు (2018)' అనే గ్రంథాన్ని ప్రచురించారు. సత్యారాధేయం అనే స్మ ృతి కావ్యం మీద మిత్రులు, ఆత్మీయులు అందించిన అభిప్రాయాలు సంకలించిన 'సాంత్వనమ్' అనే పుస్తకం త్వరలో రాబోతోంది.
మూడో ముఖం
చాలీచాలని జీతం, ముగ్గురు పిల్లలతో కూడిన కుటుంబం- ఇదీ రాధేయ ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు స్థాపించే నాటికి వారి పరిస్థితి. కానీ ఇవేమీ వారికి అడ్డంకులుగా భావించక, ఆర్థిక భారాన్ని సైతం ఆనందంగా ఆహ్వానించారు. ఎవరినీ ఒక్క పైసా అడగకుండా తన కష్టార్జితంలోంచి పొదుపు చేసి అవార్డును 1988 నుంచి నడుపుతూనే ఉన్నారు. అవార్డుకు నోటిఫికేషన్ ఇవ్వడం దగ్గర నుంచి, పుస్తకాలను తీసుకోవడం నుంచి, న్యాయ నిర్ణయాలకు పంపడం, వారి నిర్ణయాన్ని అనుసరించి పారదర్శకంగా విజేతను ప్రకటించడం, సభను విజయవంతంగా నిర్వహించడం, కవికి వారి కుటుంబానికి ప్రేమ పూర్వక ఆతిథ్యమిచ్చి గౌరవించడం వరకు చాలా పద్ధతిగా ఎటువంటి ప్రలోభాలకు చోటు లేకుండా నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ కవులుగా గుర్తింపు పొందిన వారంతా తొలి రోజుల్లో ఉమ్మడిశెట్టి అవార్డును పొందినవారేనని చెప్పవచ్చు. ఈ అవార్డును తెలుగు కవులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.
నాలుగో ముఖం
రాధేయ ఎంతోమంది యువకులను చేరదీసి, వారి చేత ఎన్నో పుస్తకాలను చదివించి, కవిత్వం లోతుపాతులు నేర్పించి తనంతటివారిగా తీర్చిదిద్దారు. అధ్యాపక వృత్తి కావడం చేత ప్రత్యక్ష విద్యార్థులు, పరోక్ష విద్యార్థులు వారి వద్ద కవిత్వ మెలకువలు తెలుసుకునేవారు. రాధేయ శిష్యుల్లో ప్రముఖంగా చెప్పుకోదగిన వారు డాక్టర్ పెళ్లూరు సునీల్, డాక్టర్ సుంకర గోపాలయ్య, దోర్నాదుల సిద్ధార్థ. గురువు గారి స్ఫూర్తితో 'డాక్టర్ రాధేయ కవితా పురస్కారం' నెలకొల్పి గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు.
తన కవిత్వానికి, విమర్శకు రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలో అనేక సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. 2003లో జరిగిన జాతీయ కవి సమ్మేళనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు భాషా కవిగా ఎంపికై, గుజరాత్‌లోని రాజ్ కోటలో జరిగిన సర్వభాషా కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన మగ్గంబతుకు ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా అనువాదమైంది. ఈ పుస్తకంపై రెండు ఎంఫిల్స్ వచ్చాయి. 'రాధేయ కవిత్వం సమగ్ర పరిశీలన' అంశం మీద పరిశోధన చేసి 2008లో డా.తన్నీరు నాగేంద్ర పిహెచ్‌డి పొందారు.
''అక్షరాలు వెంట రాకుంటే
అడుగు ముందుకెయ్యలేను
అక్షర సైన్యం నా వెంట నడిస్తే
నా సర్వస్వం కోల్పోయినా లెక్కచేయను
నా శ్వాస ఆగిపోయి
ఈ తెప్ప నన్ను ఏ రేవులోకి చేరవేసినా
అక్కడ పచ్చని మొక్కై మళ్లీ ప్రాణం పోసుకుంటాను
కడదాకా రాస్తాను
నా కన్నీటి తడి ఇంకిపోయే దాకా రాస్తాను''
ఇదీ, డాక్టర్ రాధేయ సారస్వత చింతన.
(డాక్టర్ రాధేయకు ఈనెల 5వ తేదీన అమృతలత జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా)
- డా. పెళ్ళూరు సునీల్
94402 55647










