Jun 05,2023 08:32

''కులం ఒక మానసిక రోగం. 'మేము కులతత్వాన్ని పాటిస్తాం, అంటరానితనాన్ని ఒక సంప్రదాయంగా అనుసరిస్తాం, ఎందుకంటే మా మతం మాకు అలా చేయమని చెప్పింది' అంటారు ఆ మతస్తులు. కానీ చేదు ఎప్పటికీ తీపి కానేరదు. కాలకూట విషం ఎప్పటికీ తేనెలా మారదు.''
- డా. అంబేద్కర్‌.

అవి, కులవివక్ష జడలు విప్పుకుని నర్తిస్తున్న రోజులు. దేశ నాయకులని పేరు పడ్డ పెద్ద పెద్ద నేతలంతా దేశ స్వాతంత్య్రం కోసం గట్టిగా పోరాడుతున్న సాంస్క ృతిక చైతన్య ఘడియలవి. ఒక పక్క అంటరానితనాన్ని, దైవాజ్ఞగా కొన్ని పేద సమూహలకు ఆపాదించి, వారిని ఊరికి దూరంగా పారదోలి, జంతువులకన్నా హీనంగా పరిగణిస్తూ, మళ్ళీ వారితో ఇంటా బయటా చెప్పరాని రీతిన ఉచిత చాకిరీలు చేయించుకుంటూ కూడా కడుపునకు ఇంత తిండిపెట్టకుండా, బ్రాహ్మణ ఆధిపత్యం షెడ్యూల్డ్‌ కులాలను కట్టుబానిసలుగా చేసి హింసిస్తూ, మనుస్మ ృతిని అమలు చేస్తున్న బాధాకరమైన పరిస్థితులవి.
          దళితేతర స్త్రీ విద్య కూడా నిషేధంగా ఉన్న రోజులు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆధునిక ఆలోచనా విధానం దళితుల్లో ఆశను, మనువాద పెద్దల్లో భయాన్ని కలిగిస్తున్న, ఒక ట్రాన్సషన్‌ పీరియడ్‌. ఆ సమయంలో 1938లో మహారాష్ట్ర, నాగపూర్‌లో ఒక అంటరాని మహర్‌ కుటుంబంలో జన్మించింది కుముద్‌ సోంకువార్‌. కటిక పేదరికం లేకున్నా, అంటరాని ఆడపిల్లగా ప్రతిచోటా అవమానాలు చవిచూసింది. బడికి వెళ్లి చదువుకోవాలనే బలీయ కాంక్ష, తరగతిలోని బ్రాహ్మణ, ఇతర అధిపత్య విద్యార్థుల హేళనాపూరిత వ్యాఖ్యల్ని అధిగమించేలా చేసింది. కుముద్‌ తండ్రి వకీలు, తల్లి కూడా జ్ఞానవంతురాలు. సామాజికంగా కాస్త బావున్న కుటుంబం అయ్యేసరికి కుముద్‌ చక్కటి బట్టలు వేసుకొని, శుభ్రంగా ఉండేది. తోటి విద్యార్థుల ఇళ్లకు ఆడుకోవడానికి వెళ్ళిన ప్రతిసారీ కుముద్‌కు అవమానాలే ఎదురయ్యాయి.
చూడ్డానికి ఎంతో ఉన్నతస్థాయిలో కనిపించే పెద్ద కులాల స్త్రీలు, కుముద్‌తో తమ కూతుళ్ళని ఆడనిచ్చేవారు కారు. ''ఆ అమ్మాయి అంటరానిది, తనను తాకకూడదు, తాకావంటే ఇక ఇంటికి రానివ్వను'' అంటూ ఆ పసి మనసులను తల్లులే
         విషపూరితం చేయడం చూసిన కుముద్‌ మనసు వికలమయ్యేది. ''నేను ఇంత శుభ్రంగా ఉంటే కూడా నేను అంటరానిదాన్నేనా? నిజానికి వాళ్ళ ఇళ్ళే అశుభ్రంగా ఉంటాయి. ఐనా వాళ్ళు మనల్నే మైల అంటున్నారు.'' అని ఆలోచించేది.
         ఒకసారి సహధ్యాయి సోదరుడి ఉపనయన కార్యక్రమాన్ని కిటికీగుండా చాటుగా చూస్తున్న చిన్నారి కుముద్‌ను, ఆ ఇంటి యజమానురాలు కోపంగా అదిలించిందట. ''నీకేమైనా అర్థమవుతుందా, సంస్క ృతం? మీ మహర్లకు ఈమధ్య కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. ప్రభుత్వాలు మిమ్మల్ని అలా అందలాలు ఎక్కించి చెడగొడుతున్నాయి.'' అంటూ చిన్నారి కుముద్‌ను వెళ్లగొట్టిందట. ''నేను చూడడం వల్ల ఇక్కడ ఎవరికైనా గాయాలయ్యాయా? ఎందుకు తిడతారు'' అంటూ ఇంటిదారి పట్టిన కుముద్‌ ఆ వెంటనే బడిలో సంస్క ృతం ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని చదవడం ప్రారంభించింది.
         కుముద్‌తో క్లాసులో మిగతా పిల్లలు మాట్లాడకపోయినా, అకుంఠిత దీక్షతో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసింది. క్లాసులోని బ్రాహ్మణ్య టీచర్లు ఎగతాళి చేసినా పట్టించుకోలేదు. ఆపై సంస్క ృతంలో బియ్యే, ఎమ్మే కూడా చదవాలనుకొని కళాశాలలో చేరింది. ఆసక్తికరంగా కొందరు సొంత కులాల మేధావులు తనను తేలిగ్గా మాట్లాడారని, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే మంచిదని ఉచిత సలహాలు ఇచ్చేవారని, అలాగే హటేకర్‌ అనే ఉపాధ్యాయుడు, తనకు సంస్క ృతం బోధించిన గోఖలే అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు తనను ఎంతో ప్రోత్సహించారని, గోఖలే గారైతే ఇంటికి పిలిచి మరీ కష్టంగా ఉన్న పాఠాలను బోధించి, తాను మంచి మార్కులు తెచ్చుకునేలా దోహదపడ్డారనీ, 'అంత్ణస్ఫోట్‌' అనే తన స్వీయకథలో వివరిస్తారు కుముద్‌.
          ఆపై సంస్కృత భాషలో బియ్యే, ఎమ్మే కూడా డిస్టింక్షన్‌లో పూర్తి చేసిన కుముద్‌కు, ఉద్యోగం మాత్రం దొరకడం కష్టం అయింది. ''చదవడం ఐతే చదివావు గానీ, ఒక అంటరాని మహిళ దగ్గర సంస్క ృతం నేర్చుకోవడానికి ఎవరు వస్తారు? సంస్కృతం దేవుళ్ళ భాష. అది అంటరానివారు నేర్చుకోవడం విడ్డూరం'' అంటూ ముఖమ్మీదే ద్వేషం చిమ్మే ఎందరినో కుముద్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. నాగపూర్‌ యూనివర్సిటీలో ఎంతో మోడర్న్‌గా కనిపించే ఒక బ్రాహ్మణ ప్రొఫెసర్‌, తనను చూసినపుడల్లా పైకి తీయగా మాట్లాడుతూనే లోలోపల అయిష్టత ప్రదర్శించేవారనీ, విశ్వ మానవత్వాన్ని పాఠాల్లో గొప్పగా చెప్పినా, ఆచరణలో ఎంతో కులవిద్వేషం ఆయనలో కనిపించేదనీ తన ఆటోబయోగ్రఫీలో చెప్పారు కుముద్‌.
ఐతే, తాను డిస్టింక్షన్‌లో పాసైనందుకు నాగపూర్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సెలర్‌ డా.కొట్లే, పూలబొకేతో అభినందనలు పంపారనీ, కానీ, ఆపై తాను ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైనా, తనను ఉద్యోగంలో పెట్టుకోవడానికి ఎవ్వరూ ఇష్టం చూపలేదనీ, కొందరు షెడ్యూల్డ్‌ కులాల మేధావులు కూడా తనను కించపరుస్తూ మాట్లాడారనీ వివరించారు కుముద్‌. చదువు పూర్తయి రెండేళ్లయినా ఉద్యోగం రాకపోయేసరికి, ఏకంగా కేంద్రమంత్రి గారికే ఉత్తరం రాశారు కుముద్‌. స్వతహాగా ధైర్యవంతురాలైన ఆమె, అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ కాబినెట్లో మంత్రిగా ఉన్న బాబూ జగ్జీవన్‌ రామ్‌ గారికి తన పరిస్థితి వివరిస్తూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వమూ, పాలనా వ్యవస్థా కలిసి రాజ్యాంగ విరుద్ధంగా తన విషయంలో వ్యవహరిస్తున్నాయో వేదనాభరితంగా వివరించారు ఆ లేఖలో.
           జగ్జీవన్‌ రామ్‌ ఆ లేఖను ప్రధాని పండిట్‌ నెహ్రూ ముందు పెట్టగా, ఒక షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన యువతికి గల పట్టుదల చూసి ఆశ్చర్యానికి లోనై, ఆమెకు రూ.250ల నగదు బహుమతిగా పంపడంతో పాటూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవమని ఉత్తరం రాశారు. అప్పటి మహారాష్ట్ర సీఎం యశ్వంత రావు చవాన్‌ కుముద్‌కు టెలిగ్రామ్‌ ఇచ్చి పిలిపించుకుని, ''త్వరలోనే మీకు ఉద్యోగం ఏర్పాటు చేస్తాను. ఐతే నిముషాల్లో ఏదీ జరగదు కదా. కాస్త సమయం పడుతుంది. ఈలోపు పరిశోధక విద్యార్థిగా చేరండి'' అంటూ ఆమెను నిలబెట్టి ఉపన్యాసం ఇచ్చినపుడు, ''సాబ్‌, మీరు ఇవ్వలేనపుడు ఇవ్వలేను అని చెప్పండి. శుష్క వాగ్దానాలు నాకు అవసరం లేదు. బతుకుదెరువు లేని నేను, పరిశోధన ఎలా చేయగలను?'' అని చెప్పి, నిరాశతో తిరుగు ప్రయాణమౌతుంది.
           ఒక దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఒక అంటరాని యువతికి అన్ని అర్హతలూ ఉన్నా, ఉద్యోగం ఇవ్వలేకపోయారూ అంటే మనం అర్ధం చేసుకోవచ్చు... కులవివక్ష ఏ స్థాయిలో మన భారతదేశాన్ని ఆరోజుల్లో ఆవహించి ఉందో! ఐతే, కుముద్‌ ఎలా నాగపూర్‌ యూనివర్సిటీలో సంస్క ృత విభాగాధిపతిగా రిటైరయ్యారు? ఎలా ఆమె ఆమె ఎంతో ప్రేమించిన సంస్క ృత భాషను కాలేజీల్లో బోధించారు అనే అనుమానం రాక మానదు కదా? కుముద్‌ ఆపై ఖాళీగా ఉండలేక ఎమ్మే ఇంగ్లీష్‌ చదవడానికి పూనుకున్నారు. ఆ ఏడాది ఆమె వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం. వివాహమైన రెండు నెలలకే నాగపూర్‌ ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న డైరెక్టర్‌ సహస్రబుద్ధే ఆమెను చూడగానే ఉద్యోగానికి సెలెక్ట్‌ చేశారు. ఆపై నాగపూర్‌ యూనివర్సిటీలో అనతికాలంలోనే కుముద్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం తెచ్చుకున్నారు.
         ఐతే కుముద్‌ అంటారూ, ''నేను కుముద్‌ సోంకువార్‌గా ఉన్నంతసేపూ నాకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. కుముద్‌ పావడే అయ్యాక, ఉద్యోగాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. పెద్ద కులపు భర్త ఇంటిపేరు తనపేరును మాత్రమే కాక, కులాన్ని కూడా మార్చేసిందని, తాను ఎంత శ్రమించి డిగ్రీలు తెచ్చుకున్నా, తాను అంటరాని స్త్రీగానే లెక్కించబడ్డాననీ, కాబట్టే బ్రాహ్మణ్య ఆధిపత్య విద్యారంగంలో తనకు చోటు విస్మరించబడ్డదనీ, తన భర్త యొక్క ఆధిపత్య కులపు పరపతి వల్ల తన అంటరానితనం దాచబడి తనకు ఏమాత్రం కష్టం లేకుండా ఉద్యోగం వచ్చిందనీ, భారతదేశంలో ప్రతిభకు కూడా కులం ఉందని, అంటరాని కులస్తులలో ఎంత ప్రతిభ ఉన్నా, వారిని కుట్రపూరితంగా ఆధిపత్య శక్తులు తొక్కిపెడుతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు తన స్వీయ చరిత్రలో.
           విద్యావేత్త, అలనాటి ఆధిపత్య పీఠాధిపత్యాన్ని తన జ్ఞానంతో సవాలు చేసిన భారతదేశవు మొట్టమొదటి దళిత సంస్కృత పండితురాలు కుముద్‌ పావడే ఈనెల (జూన్‌) ఒకటో భౌతికంగా మరణించారు. విద్యావేత్తగానే కాక, సామాజిక వేత్తగా కూడా కుముద్‌ ప్రభావవంతమైన జీవితం జీవించారు. దళిత స్త్రీల అభ్యున్నతి కోసం చీఖీణఔ అనే సంస్థను స్థాపించి, సేవలందించారు. నిచ్చెనమెట్ల భారత సామాజిక వ్యవస్థలో, స్త్రీలకు ఏ మాత్రం స్థానం లేని కులవ్యవస్థ పాలనలో, ఒక దళిత మహిళయయ్యుండీ బ్రాహ్మణుల భాషగా చెప్పబడ్డ సంస్కృతాన్ని కష్టపడి చదివి, పట్టుదల, దీక్ష ముందు కులం, మతం నిలబడలేవని నిరూపించిన ధీర వనిత పండిత కుముద్‌ పావ్డే. వీరినుంచి యావత్‌ స్త్రీ జాతి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా రకరకాల పితృస్వామ్యాల పీడన కారణంగా చదువులో ఇంకా వెనుకబడి ఉన్న దళితవాడల ఆడపిల్లలు, ధీరవనిత కుముద్‌ను ఉదాహరణగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ద్వారా కులపు కోటను బద్దలు కొట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
 

- అరుణ గోగులమండ
సామాజిక విశ్లేషకురాలు, 88971 07984