
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్యారేజీలో మంటలు చెలరేగడంతో 22 బస్సులు దగ్ధమయ్యాయి. వీరభద్రగనగర్‌లోని గ్యారేజ్‌లో బస్సులకు వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ దుర్ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. పార్కింగ్ చేసిన బస్సులకు వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు చెలరేగి.. అవి మిగతా వాహనాలకు వ్యాపించడం వల్లే భారీ నష్టానికి దారితీసిందని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాప్తి చెందాయి.ా్యరేజీలో మొత్తం 35 బస్సులు ఉండగా.. ఈ ప్రమాదంలో 22 బస్సులకు మంటలు అంటుకున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. వీటిలో 18 బస్సులు పూర్తిగా కాలి బూడిదైనట్లు చెప్పారు. మరో నాలుగు బస్సులు మాత్రం మంటలు అంటుకొని పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు. గ్యారేజీ బహిరంగ ప్రదేశంలో ఉండటంతో మంటలను గమనించిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలు తెలుసుకొనేందుకు సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.