Feb 27,2023 07:51

          ఆశ.. దోశ... అప్పడం... వడ అన్న మారుపేరుగల చంద్ర ప్రతాప్‌ కంతేటి ళిషజూరి గారు రాసిన, పుస్తకరూపంలో తెచ్చిన 'నవ్వుల పువ్వుల వెన్నెల హాసం'లో రచయిత పూర్వపు హాస్య బ్రహ్మలందరికీ వందనాలు చెప్పుకున్నారు త్యాగయ రీతిల, అంత వినయంగానూ. బ్రహ్మలు వెళ్లిపోయారు. చంద్రప్రతాప్‌ గారిని నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా హాస్య విష్ణు (విష్ణు బ్రహ్మకు బాబు) అనేసుకోవచ్చు. వాళ్ళందరి సరసన సమాన ఫాయిదాలో పీట వేసి అరిటాకులో శాకాహార భోజనం వడ్డించవచ్చు. ఆయనకు అన్ని అర్హతలూ వున్నాయి తెలుగు హాస్య పీఠం అధిరోహించడానికి. రెండు వందలకు పైగా హాస్య ఖండికలు రాశారు. అవిరామంగా ఇంకా ఇంకా రాసి మనం సోలిపోయ్యేవరకు నవ్విస్తారు ఆ పనికి ఎవరో నియోగించినట్లు. చంద్రుడి మొహంలోలా వీరి మొహములోనూ ఆరని చిద్విలాసం ఉంటుంటుంది.
       ఈ ఆల్చిప్పలో ఇరవై నాలుగు ఆణిముత్యాలలాంటి హాస్య ఖండికలున్నాయి. చదివి నవ్వనివాడిదే నేరం, పాపం. ట్రెంచిలో దాక్కున్న హిట్లరైనా నవ్వి తీరాల్సిందే! కేవలం హాస్యానికే పట్టం కట్టారా? అలా కట్టుంటే 'సామాజిక స్పృహ మాటేమిటి' అని దాడి చెయ్యచ్చు. సామాజిక స్పృహేకాక, అక్కడా అక్కడా నిస్పృహా వుంది.
        ఈ వృత్తి రీత్యా పాత్రికేయుడు, రెండు మంచి పత్రికలకు సంపాదకుడిగా తరచూ సింహం గుహలోకి వెళ్లి వచ్చిన సాహసి, పద్యోన్మాద కవి, అనువాదకుడు, రచయిత ఇంతవరకు మనకు తెలియని న్యూస్‌ రూంలలో జరిగే వైపరీత్యాలను చెప్పి మన ముక్కుల మీద మనం చూపుడు వేళ్ళు వేసుకునేట్టు చేసి, గిలిగింతలు పెట్టారు. ఏ ఖండికలోనూ ఏమీ దాచుకోకుండా నగంగా చూపారు. నగం సత్యానికి ప్రతీక.
        సౌందర్యానికి నగానట్రాలా 'బాచీ' రేఖ చిత్రాలు తోడై కనువిందు చేస్తాయి. వ్యాసాలకు లేక కథనాలకు పెట్టిన ఇరవై నాలుగు పేర్లు అసలు విషయం జోలికి వెళ్లకుండా కూడా నవ్వింపచేస్తాయి. వాటిలో కొన్ని : గాడిదలు ఏనుగులైతే! వీళ్లకు కరోనా రాను! కురుక్షేత్రంలో విసుగు శర్మ (రావి శాస్త్రి గారి వేతన శర్మలా), వశ్యవాక్కు, నేను వచ్చిందాకా ఆగదా పాము?
        ఈ హాస్య నలభీమపాకం నిండా జీడిపప్పులు, కిస్మిసులలా ఫన్లు, పన్లు fun-lu, pun-lu. చురకలకు కొదవే లేదు. హాస్యం, అపహాస్యం మధ్యనుండే విభజనరేఖకు ఏ ముప్పూ వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తన మీదే తాను జోకులు వగైరాలు నిర్దయగా వేనుకున్నారు. కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. కరోనా వల్ల వచ్చిన కీడుమూతికి గుడ్డకట్టి, మేలును ఎన్నారు. మరొక ఖండికలో తెలుగు అక్షరాల కన్నా, ఆంగ్ల అక్షరాలు అక్షరాలా సంఖ్యాపరంగా ఎక్కువ కదా [104] అని అమాయకులను నమ్మించే హాస్యానికి పాల్పడ్డారు. మనం తప్పనిసరిగా తప్పులు రాసే కొన్ని పదాలను ఎత్తి చూపి ఎగతాళి చేశారు. విలేకరులు 'విలేఖరులు' కావద్దని మందలించారు. టీవీ యాంకర్లతో విసిగి పోయి 'వీళ్లకు కరోనా రానూ' అని ముద్దుగా శపించారు. 'మ.త్రా. గారి మహాపురాణం' కాస్త కృతకంగా వుంది - ఏ మూడ్లో రాశారో. ఒక ఖండికలో ఒక పాత్ర అన్న ఈ పదాలు ''పంతులు గారూ అప్పుడే హస్తప్రయోగం మొదలెట్టారా'' డైలాగు నన్ను నవ్వించి చంపింది. వారి పెదన్నాన్న గారి కథలో హాస్యం మోతాదు మించి వెగటు కలిగిస్తుందేమోనన్నట్లు పాఠకుల కళ్ళు చమరింప చేశారు. ఈ పుస్తకం కేవలం చదివి, నవ్వి వదిలేసేది కాదు. దాచుకుని - కోపంగానో, విచారంగానో ఉన్న ప్రతిసారి పఠనీయం. (నవ్వుల పువ్వుల వెన్నెల హాసం - చంద్ర ప్రతాప్‌, పేజీలు 104, వెల రూ. 125. ప్రతులకు : 80081 43507)

- నవులూరి వెంకటేశ్వరరావు
99663 40014