నా ప్రియమైన సోదరి సోదరులారా
నేను భారతీయ జంతువుని
అన్ని పశువులు నా తోబుట్టువులు
నేను కూడా కసువు తినే పశువుని
నారంగేంటో నాకు తెలియదు
నా జాతి నా వర్ణంతో
నా తోటి పశువుల్లోంచి విడదీసి
నన్ను అంటరానిది చేస్తున్నారు
తిని తాగిన అన్ని పశువులు
మలమూత్రాలు విసర్జించినట్టే
నేనూ వ్యర్ధ మలినాల్ని వదుల్తున్నాను
లేకపోతే అనారోగ్యంతో చచ్చి పోతాను కదా !
నా శ్వాస క్రియలో ఆక్సిజన్ ఉందని
నా పేడతో పెంటగాన్ గోడలు అలికారని
పిడకలు తలకింద పెట్టుకుంటే పీడకలలు రావని
నా చుట్టూ అల్లిన కధల్లో
నన్నో బలి పశువుని చేశారు !
అయ్యలారా, అమ్మలారా ...
నా పేరుతో చేస్తున్న రక్తపాతానికి
కారణం నేను కాదు.. నేను మూగని
ఏ చావులకూ నన్ను నిందించొద్దు
రాజకీయ ఆటలో నన్నో అట్ట బొమ్మను చేసి
పార్లమెంట్లో మంట కాగుతున్నారు !
గోసేవ పేరుతో జరిగే అన్ని హింసలకు
తల్లిగా తల్లడిల్లిపోతున్నాను
నా పేరిట జరిపే కోట్లాది వ్యాపారానికి
పవిత్రతను అంటగట్టిన వేషగాళ్లను
నా గిట్టల కింద తొక్కి పడేయాలనుంది
కానీ, నేను నిస్సహాయురాలిని...
నేను అందరి మధ్య తిరిగే
మామూలు పెంపుడు జంతువుని
జనం రక్తాన్ని తాగేది నేను కాదు
ధనాన్ని హరించేదీ నేను కాదు
నాకు సీమంతాలు చేస్తూ
బారసాలలేసి ఊపుతూ
నా పాలల్లో బంగారపు గనులున్నాయని
నా పేడలో విటమిన్లు పుష్కలమని
మూత్రం తాగితే పుణ్యమని
కౌగిలించుకుంటే రోగాలు మాయమని
చెప్పేదంతా తంత్రగొండితనం!
ఓ గోసేవకులారా..
నేను బతికుండగా.. భారతీయ సనాతనం
అమాయకపు అఖ్లాక్ ను,
అమలాపురం ఏసోబును హత్య చేస్తుంది
ఈ రక్తపాతానికి కారణం కానేకాను నేను
నన్నో పశువుల్లో పశువుగా తలచండి
మీ ప్రేమను ఎప్పట్లా పంచండి !
ఇట్లు
ఒక అమాయక ఆవు
నేలపూడి రత్నాజీ










