ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖ) : రాత్రి అనక, పగలు అనక కష్టించి పనిచేసే ముఠా కార్మికుల ప్రయోజనం కోసం సమగ్ర చట్టాన్ని తేవాలని విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బారావు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో గురువారం విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఠా కార్మికులు పనిగంటలను లెక్కచేయకుండా రోజంతా కష్టపడి పని చేస్తూ, నిత్యవసర వస్తువులు, టైల్స్, ఐరన్, సిమెంట్, ఎలక్ట్రికల్ గూడ్స్ వగైరా వాటిని ఒక ప్రాంతం నుంచి మరో చోటికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వీరు అందిస్తున్న సేవలు ద్వారా ప్రభుత్వ ఆదాయంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వాలు వీరిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు వై.రాజు మాట్లాడుతూ.. ముఠా కార్మికులకు కేరళ తరహాలో సమగ్ర చట్టాన్ని రూపొందించాలని కోరారు. పిఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్, బీమా, పెన్షన్ సదుపాయాలు వీరికి కల్పించాలన్నారు. పని ప్రదేశంలో ప్రమాదానికి గురైతే యాజమాన్యాలు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పని భద్రత కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఠా కార్మికుల నాయకులు టి. పైడిరాజు, రెడ్డి, శ్రీనివాసు, వెంకట్రావుతో పాటు సిఐటియు జగదాంబ జోన్ ప్రధాన కార్యదర్శి కెవిపి చంద్రమౌళి, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు కె.నర్సింగరావు, హౌటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎర్రి బాబు తదితరులు పాల్గొన్నారు.










