తెలుగు సాహితీవనం నాలుగో కవితా సంకలనంగా శాంతికృష్ణ సంపాదకత్వంలో వెలువడ్డ పుస్తకం 'ఎన్నో వర్ణాలు.' ఎన్నో భావాల హృదయ స్పందనలుగా ఇందులోని కవితలు ఉన్నాయి. పండుగలు, ప్రేమ, స్వాతంత్య్ర సమర యోధులు, గురువు, కల, మాతృభాష తదితర అంశాలపై జరిగిన పోటీల్లో గెలుపొందిన కవితల మాలిక ఇది.
ఉగాది అంశంపై మచ్చ రాజమౌళి 'కొత్త వెలుగుల పునాది', ఆర్. రెడ్డి ఈశ్వర్ ఆదిత్య 'శుభాల పల్లకి' పేరిట కవితలు రాశారు. బాధలు అన్నిటిని చిరునవ్వు సముద్రంలో కలిపేసి మన గొంతు ఎప్పుడు తీయదనాన్ని ప్రేమించినట్టు, గతాన్ని వదిలి మన సంతోష కలశంతో స్వాగతం పలుకుదాం అంటూ ఆదిత్య ఆశాభావం ప్రకటించారు. ఏ యుద్ధభీతికి తల్లడిల్లకుండా, ఏ రైతన్నా చెట్టు కొమ్మకు వేలాడకుండా హాయిగా నిద్రపోవాలి అంటూ, ''నిజమైన యుగాది''ని ఆకాంక్షించారు అప్సర్ వలీసా.
''రెప్పకు ఆవల రంగులహేల'' అంటూ సత్య చాగంటి ఆనందపు అంచుల్ని, అనుభూతుల సౌధాలను ప్రస్తావించారు. 'కల వరమా? కలవరమా?' అంటూ బంధకవి శ్రీనివాస రామారావు జీవితం గురించి అమూల్యమైన వాక్యాలను అందించారు. 'స్వప్న సుందరి' పేరిట వారణాసి భానుమూర్తి అందించిన కవితలో 'ఆమె ఒకసారి నవ్వితే శిశిరంలో రాలిన పువ్వులన్ని కొమ్మల వైపు వెళ్లి మళ్లీ చిగురుస్తాయి అని, ఆమె ఉన్నచోట వసంతమని చక్కటి పదచిత్రాలు దృశ్యమానం చేశారు. ''మనగలనా'' కవితలో లీలాకృష్ణ తాత్విక చింతన కనబరిచారు.
''నన్ను మరిచిపోకండి'' అంటూ అచంట సుధా కళ్యాణి - మాతృభాష విన్నవించిన వేదనను తన కవితలో పలికించారు. ''స్వాతంత్ర సమరయోధులు'' అంశంపై లాక్కొండ కుళ్లాయప్ప, జె. వి.కుమార్ చేవూరి, అమర వీరులను శ్లాఘించారు. 'గురువు' అంశంపై రాస్తూ గొడుగు యాదగిరి రావు, ప్రకృతిని గురువుతో పోల్చారు. ''జ్ఞాన బోధకుడు'' కవితలో షేక్ రహీం సాహెబ్, విజ్ఞాన విషయ బోధనల మహర్షి, విద్యా దిక్సూచి, సవ్యసాచి, బాధ్యతల వారధి, అక్షర హాలికుడు అంటూ గురువు ఉన్నతమైన స్వభావాలను కళ్లకు కట్టారు. 'ఋషి' కవితలో మల్లాడి శ్రీనివాస్ తాను నాటిన విత్తు వటవృక్షమై పదిమందికి నీడనిచ్చినప్పుడు, గురువు గర్వంతో మళ్ళీ శిల్పాలు చెక్కే పనిలో నిమగమవుతాడని పేర్కొన్నారు. ''గురుదేవోభవ'' అంటూ ఎం.ఎస్ చారి రాశారు.
'మానవుడే నా మొక్క' అంటూ రాయపురెడ్డి సత్యనారాయణ నేడు విచ్చు కత్తుల మధ్య జీవిస్తున్న మానవుడిని మొక్కగా నాటాలంటూ రాశారు. 'అతను ఆమె' కవిత పాఠకుల హృదయాలను హత్తుకుంటుంది. 'సేద్యం' కవితలో ఇంద్రగంటి మధుసూదనరావు - రైతు ఆవేదన వినిపించారు. తన కవితలో గాయత్రీ దేవి 'పనిమనిషి' గురించి ప్రశంసాపూర్వకంగా రాశారు.
పండుగ అంశంలో భాగంగా, మహేష్ ఊటుకూరి, వనిత నోముల, మంథా అనురాధ, అరుణ దూళిపాల ... సంక్రాంతి శోభను, మనుషుల ఆనంద సందడిని కళ్లకు కట్టించారు.
'మాతృభాష' అనే అంశం పురస్కరించుకొని- అఖండ ప్రస్థానం నా తెలుగు భాష అంటూ కొత్త భానుప్రియ మంచి కవిత అందించారు. 'అమ్మ అనే పిలుపు' కవితలో పానుగంటి శ్రీనివాస్ రెడ్డి గద్య, పద్య, వ్యాకరణ, ఛందస్సులకున్న విశిష్టతను వివరించారు. 'మాట్లాడాలనుంది' అంటూ కొత్తపల్లి మణి త్రినాథ రాజు చక్కని కవిత అందించారు. 'అమ్మ భాష' అంటూ డాక్టర్ హనీఫ్చంద్ర తెలుగును కీర్తించారు. ఈ అంశంపై ఇంకా ముక్క శ్రీనివాస్, రమేష్ గాదె, డాక్టర్ కొమురవెల్లి అంజయ్య, డా. చదలవాడ ఉదయశ్రీ, పిళ్ళా కుమారస్వామి రాసిన కవితలు ఇందులో ఉన్నాయి.
ప్రేమాంశంగా వచ్చిన కవితల్లో డా. పాతూరి అన్నపూర్ణ -
ఆ ప్రతిమను చూస్తూ ఎన్నో సూర్యోదయాలు చంద్రోదయాలు తరలిపోతాయని, హదయంలో గుడి కట్టి ప్రతిష్టించిన శిల్పం తానంటూ భావాత్మకంగా వివరించారు. 'ఆమె ప్రేమ' అంటూ శాస్త్రి జి.ఎల్.ఎస్. ప్రేమ జీవన నావకు దారి చూపే దిక్సూచిగా పేర్కొన్నారు. 'ప్రేమామతం'లో వసుధాదేవి తిరుమల, 'నీ ప్రేమలో'లో సాగి అనిల్ కుమార్ వర్మ, 'ప్రేమ! వింటున్నావా!'లో శశికిరణ్ కొమాండూర్, 'ప్రేమతో'లో రామగోపాల్ కొమ్ముల, 'ప్రేమను గూర్చి నిజం' కవితలో ఎన్ బసవయ్య- ప్రేమభావనల సంస్పందనలను వివిధ కోణాల్లో వివరించారు.
తెలుగు సాహితీ వనం కార్యనిర్వాహక సభ్యులు రాసిన కవితలూ ఈ సంకలనంలో పొందుపరిచారు. 'అత్యున్నత శిఖరం' అంటూ శాంతికృష్ణ - అక్షరాలు నీ మదిలో కవితలుగా మారేవేళ/ నీ మాటలు కొన్ని హృదయాల వాకిళ్లలో అయినా తొలకరి చినుకులు కావాలీ' అని రాశారు. 'సర్వేంద్రియా నయనం ప్రధానం' అంటూ డాక్టర్ కృష్ణారావు రెడ్నం నేత్రాల ప్రాముఖ్యతపై కవిత అందించారు. 'యాచించను' అనే కవితతో తాటి మేటి సూర్యప్రకాశ రావు - ఆవేశాన్ని పెదవితోనే అదిమిపట్టి, ఎవరి ముందు చేయి చాచరాదని చక్కగా తెలిపారు. 'నీటి కుండ' కవితలో శ్రీధర్ రెడ్డి బిల్లా - 'తొణకని బెనకని నీటికుండ ఎన్నో అడ్డంకులు, అవమానాలు జరిగినా పగలని నీటికుండ' అంటూ హృద్యంగా రాశారు. 'అ'సంపూర్ణ కావ్యమంటూ నవీన్ చంద్ర హౌతా, జీవితం గురించి వ్యాఖ్యానించారు. 'కాలం గురించి సుమన ప్రణవ్ చక్కటి కవిత్వం అందించారు. సందడి అరుణ తన 'మహిళా' కవితలో మగువ గొప్పతనాన్ని వివరించారు. 'ఓ యువత మేలుకో' అంటూ కెవిఎస్ మూర్తి యువశక్తిని ప్రేరేపించారు. 'అమ్మ కొంగు' కవితలో శ్రీనివాస్ తొడుపునూరి - మాతృమూర్తి ప్రేమపాశాన్ని వర్ణించారు.
ఇలా అనేక భావాలను, ఉద్వేగాలను ఆవిష్కరించిన 'ఎన్నో వర్ణాలు' పేరుకు తగ్గట్టుగానే వైవిధ్యభరితంగా ఉంది. చదివి స్పందించాల్సిన కవిత్వం ఇది.
- అరుణ సందడి
99498 05100