- ఎస్‌సి కులధ్రువీకరణ పత్రాలపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ జిల్లా) : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసు తుది దశకు చేరింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో దళితులకు శిరోముండనం చేసిన కేసు విశాఖలోని ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక కోర్టులో 1996 డిసెంబర్ 29 నుంచి సుమారు 27 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే సమయంలో బాధితులు ఎస్‌సిలు కాదని, క్రైస్తవులని హైకోర్టులో నిందితులు పిటిషన్ వేయడంతో మరింత జాప్యం జరిగింది. తాజాగా ఈ కేసులో కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుపై నిందితుల తరుఫున చిదంబరం, బాధితుల తరుఫున ఎ.సత్యప్రసాద్ బుధవారం వాదనలను వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు తీర్పును రిజర్వు చేశారు. కులధ్రువీకరణ పత్రాల సమస్య పరిష్కారమైతే విశాఖపట్నంలోని ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక న్యాయస్థానంలో త్వరగా తీర్పు వచ్చే అవకాశం ఉందని దళిత నాయకులు గుబ్బల శ్రీనివాసరావు, ఎం.రామకష్ణ తెలిపారు. ఈ కేసులో అప్పటి టిడిపి ఎమ్మెల్యే, ప్రస్తుత వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే బాధితుల్లో ఒకరైన పువ్వుల వెంకటరమణ వారం రోజుల క్రితం మృతి చెందారు. మిగిలిన నలుగురు బాధితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.










