Jan 11,2023 09:57
  • నేతన్నలు వ్యక్తిగత గ్యారంటీలివ్వాల్సిందే
  • రూ.50 వేలు దాటితే సహకరించని పోర్టల్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పేద చేనేత కార్మికులను ఆదుకునేందుకు కేంద్రం అమలు చేస్తున్న రుణ పథకానికి నిబంధనల పేరుతో అడ్డంకులు నెలకొంటున్నాయి. అటు అధికారులు, ఇటు బ్యాంకర్లు కూడా పథకం అమలులో అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానానికి నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యారంటీలు, మార్జిన్‌ మనీ అంటూ పెరుగుతున్న వేధింపులతో రుణాలు కూడా పొందలేకపోతున్నారు. దీనిపై పలు దఫాలు బ్యాంకర్లతో, అధికారుతో భేటీలు పెడుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.నేత కార్మికులకు రుణాలు ఇవ్వడం, కొన్ని రుణాలను మాఫీ చేయడం కోసం ముద్ర పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ నిబంధనల పేరిట ఇబ్బందులను తొలగించడం లేదు. రుణాలు ఇచ్చేరదుకు లబ్ధిదారుల నుంచి గ్యారంటీ కోరుతున్నారు. చేనేత కార్మికుల సొసైటీ నుంచి కూడా రుణాలకు గ్యారంటీపై వత్తిడి చేస్తున్నారు. అలా గ్యారంటీలు ఇస్తేనే రుణాలిస్తామని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. ఇదే సమయంలో తీసుకునే రుణాలకు 20 శాతం వరకు మార్జిన్‌ మనీ లబ్ధిదారులు చెల్లించాలన్నది మరో నిబంధనగా అమలు చేస్తుండడంతో నేతన్నలపై వత్తిడి మరింత పెరుగుతోంది.ఇదే సమయంలో రుణాలకు నిర్ధిష్ట పరిమితి లేకపోయినప్పటికీ... 50వేల కన్నా ఎక్కువ రుణం తీసుకునేందుకు సాంకేతిక సమస్యలు నెలకొంటున్నట్లు తెలుస్తోంది. జన సమర్త్‌ పోర్టల్‌ దీనికి స్పందించడం లేదని, అందుకే 50 వేల లోపే రుణాలు దక్కుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇదే అంశంపై రాష్ట్ర చేనేత శాఖ అధికారులు కూడా బ్యాంకర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. రుణాలు ఇవ్వడంలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు బ్యాంకర్లను కోరుతున్నారు.