బళ్లారి (చిత్రదుర్గం-కర్నాటక) : లారీని కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటన చిత్రదుర్గం జిల్లాలో ఆదివారం జరిగింది.
పోలీసుల కథనం మేరకు ... విజయపుర (బీజాపూర్) జిల్లాకు చెందిన సంగన బసప్ప (36) బీజాపుర్‌లోని ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నారు. నిన్న సంగన బసప్ప, అతని భార్య రేఖ (29), వీరి కుమారుడు బసప్ప (8), బంధువులు భీమంకర్ (26) మధుసూదన్ (24) అనే ఐదుగురు సరదాగా చిక్కమగళూరు టూర్ కోసం కారులో బయలుదేరారు. చిత్రదుర్గం సమీపంలోని మల్లాపూర్ వంతెన వద్ద ప్రయాణిస్తుండగా ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన అనితా (6) ఆదర్శ (4) అనే చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా ఎస్పీ పరుశురాం, స్థానిక పోలీసులు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










