Aug 19,2023 10:08

వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక ఫొటో చెబుతుంది. వర్తమాన అంశాలని భవిష్యత్తు తరాలకు అందిస్తుంది. మధుర జ్ఞాపకాలను తరతరాలకు భద్రపరుస్తుంది. ప్రతి ఫొటో వెనుక ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి ఉంటుంది. అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగురుతులు ఫొటోలు మాత్రమే ! అందుకనే నేటి దైనందిన జీవితంలో ఫొటోగ్రఫీ ఒక భాగంగా మారింది. ఏటేటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

                 ఫొటోగ్రఫీ ఓ అందమైన అభిరుచి. ఫొటో అనేది ఒక కాలాన్ని, సందర్భాన్ని శాశ్వతంగా బంధించే సాంకేతిక చమత్క ృతి! అందుకనే ఫొటోగ్రఫీ కొందరికి వృత్తి అయితే, ఎందరికో ప్రవృత్తి ! అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో జన్మించిన అశోక్‌ బీరా స్పెయిన్‌ పౌరసత్వం కలిగి ఉన్నారు. అనేక రుగ్మతలపై ఫొటోగ్రఫీ డాక్యుమెంటేషన్‌ చేస్తూ సమస్యలను ఎత్తిచూపుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కుర్లపాటి సరస్వతిరావు విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. ఆర్ట్‌ ఫొటోగ్రాఫర్‌గా మంచి ఇతివృత్తం ఉన్న ఫొటోలను సేకరిస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన కె.భాస్కరరావు ఐదు దశాబ్దాలపాటు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని దీక్షతో తను నమ్మిన వృత్తికి న్యాయం చేస్తున్నారు. ప్రజాశక్తి ఫొటో జర్నలిస్టు టి.వి.రమణ తన కెమెరా కన్నుతో ప్రజా సమస్యలను చూస్తున్నారు. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వాల నిర్బంధాలను రికార్డు చేస్తున్నారు. ఇలా చూసినప్పుడు కెమెరా ఒకటే! చూసే దృష్టినిబట్టి దాని ప్రయోజనం ఉంటుంది. ఫొటోగ్రఫీ గురించి ఈ నలుగురూ ఏం చెబుతున్నారో విందాం !

11

                                                                     ఐదు దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ...

22

ఫొటోగ్రాఫర్‌గా వృత్తిలో రాణించటం ఏమాత్రం ఆషామాషీ వ్యవహారం కాదు. చేసే పనిపై గౌరవం, వృత్తి పట్ల అంకితభావం ఉంటేనే అది సాధ్యమవుతుంది. నేను 70 ఏళ్ల వయసులో కూడా ఫొటోగ్రాఫర్‌గా కొనసాగుతున్నానంటే దానిపై నాకున్న అభిమానం. సమాజం, ప్రభుత్వం, వ్యక్తులు, బాధ్యతలు, హక్కులు, అవహేళనలు, దూషణలు, దుర్మార్గాలు, అభివృద్ధి నిరోధక అంశాలు ఏవైనా దృశ్యరూపంగా నిలిచేలా ఫొటోలు తీసి వెలుగులోకి తేవటానికి శక్తివంచన లేకుండా కృషిచేశాను. ఈ ఐదు దశాబ్దాల కాలంలో అనేక అవార్డులు పొందాను. మరెన్నో బహుమతులు, కితాబులు, రివార్డులు సైతం అందుకున్నాను. నా బాటలోనే తనయుడు కె.ఆర్‌.దీపక్‌ ది హిందూ చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్నందుకు సంతోషిస్తున్నా.
                 - కె.భాస్కరరావు, సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్‌, విశాఖపట్నం

08

                                                                 దయనీయ జీవితాలపై డాక్యుమెంటేషన్‌

ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించా. నాకు ట్రావెల్‌ ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. ఆసియా, యురోపియన్‌, యుఎస్‌ఎ, ఇంగ్లాండ్‌, జపాన్‌, స్పెయిన్‌, నార్వే మొదలైన దేశాల్లో పర్యటించాను. ఆయా దేశాల్లోని ప్రజానీకం స్థితిగతులు, ఆర్థిక, చారిత్రక, రాజకీయ, భౌతికపరమైన పలు అంశాలపై ఫొటోగ్రఫీలో డాక్యుమెంటేషన్‌ చేశాను. స్పెయిన్‌ పౌరసత్వంతో అక్కడి పత్రికలకు ఫొటోగ్రాఫర్‌గా, పాత్రికేయుడిగా విధులు నిర్వహిస్తున్నా. ఐక్యరాజ్యసమితి పరిధిలోని యునిసెఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే వయోజన విద్య కార్యక్రమాల్లో నన్ను భాగస్వామిని చేశారు.

33

పలు దేశాల్లో పర్యటించి వివిధ తరగతుల ప్రజల జీవన విధానాలపై డాక్యుమెంటేషన్లు తయారుచేసి ఇస్తున్నాను. యుగోస్లేవియాలో అంతర్యుద్ధం జరిగిన తర్వాత ఆ దేశంలో పర్యటించా. అక్కడి భీతావహ దృశ్యాలు, మారణహోమం జరిగిన తీరు, అక్కడి ప్రాంతాల్లో శవాల గుట్టలు ఇలాంటి అనేక సన్నివేశాలను కెమెరాలో బంధించాను. నిరక్షరాస్యత, పేదరికం, ఆర్థిక అసమానతలు, వర్ణ వివక్ష, ఆధిపత్య ధోరణులపై ప్రభావవంత ఫొటోగ్రఫీ చేయడం నాకిష్టం.
                -  అశోక్‌ బీరా, స్పెయిన్‌ (ప్రవాస భారతీయులు, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా)

55

                                                                            ఫొటోగ్రఫీ నా హాబీ

ఫొటోగ్రఫీ నా హాబీ. చదువు, ఉద్యోగం, విశ్రాంత జీవితంలో కూడా నచ్చిన ఫొటోలను బంధిస్తూ కాలక్షేపం చేస్తున్నా. మైడ్రీమ్‌ 02, బ్లాక్‌ అండ్‌ వైట్‌లో హోమ్‌లెస్‌ సబ్‌ డాగ్‌, నేచర్‌లో కొన్ని బొమ్మలు వంటివి తీస్తున్నా. కలర్‌ సెక్షన్‌, మోనోక్రోమ్‌, నేచర్‌, ఫొటో ట్రావెల్‌, పీపుల్‌, స్వీట్‌ ఫొటోగ్రఫీ, ఫొటో జర్నలిజంలో నేను తీసిన పలు ఫొటోలకు బంగారు పతకాలు వచ్చాయి. ఆర్ట్‌ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్నా.

77

వివిధ ప్రాంతాల్లోని ఫొటోలు తీయటం, సేకరించటం ద్వారా వాటిని భద్రపరుస్తున్నా. దశాబ్దాలుగా ఫొటోలు తీయడం ఎన్నో దశలు దాటుతూ వస్తోంది. ఫొటోగ్రఫీకి ప్రధానంగా కావాల్సింది సృజనాత్మకత. దానిని పెంపొందించుకుంటే ఫొటోగ్రఫీ వృత్తిగా ఎంచుకున్న వారు కూడా రాణించగలరు.
                                                                                                                     - కొర్లపాటి సరస్వతిరావు
                                                                                     ఎస్‌బిఐ విశ్రాంత ఉద్యోగి, ఫొటో,గఫీలో బంగారు పతకాల విజేత, కాకినాడ.

88

                                                                     సాహసోపేతమైన వృత్తిగా భావిస్తున్నా

నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ వెళ్లి అధునాతన కెమేరా కొనుక్కున్నాను. ఆ తర్వాత ప్రజాశక్తిలో ఫొటోగ్రాఫర్‌గా అవకాశం వచ్చింది. అప్పట్లో హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ మల్లేపల్లెలో మతకలహాలు జరిగేవి. అది కవర్‌ చేస్తున్న సందర్భంలో కొందరు వ్యక్తులు నామీద దాడి చేశారు. కొంతమంది మీడియా మిత్రులు వచ్చి నన్ను కాపాడారు. అల్లరి మూకలు నా కెమెరాను సైతం ధ్వంసం చేశాయి. పరిటాల రవి హత్య సమయంలో వరంగల్‌లో కొంతమంది అల్లరి మూకలు బస్సులు ధ్వంసం చేస్తుండగా ఫొటోలు తీస్తున్న నాపై దాడిచేశాయి. అక్కడే ఉన్న ఎస్పీ స్టీఫెన్‌ రవీంద్ర బృందంతో వచ్చి నన్ను కాపాడారు. హైదరాబాద్‌లో గోకుల్‌ చాట్‌ లుంబిని పార్క్‌లో బాంబు బ్లాస్ట్‌ జరిగితే సంఘటనా ప్రదేశానికి వెళ్లి అక్కడ చిమ్మ చీకట్లో భీతావహ దృశ్యాలను కవర్‌చేశా. ప్రజాఉద్యమాల సమయంలో నిర్బంధాలు, అరెస్టులు, దమనకాండలపై సాహసోపేతంగా వ్యవహరించి ఫొటోలు తీశా.

99
                                                                 - టి.వి.రమణ
                                                ప్రజాశక్తి ఫోటో జర్నలిస్టు, విజయవాడ