తిరిగి వేదాంత గూటికి..
న్యూఢిల్లీ : కరోనా కాలంలో ఓ వెలుగు వెలిగిన ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ఎకౌంట్ కష్టాల్లో ఉన్న బైజూస్‌కు అత్యంత కీలకమైన అధికారి చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ) అజయ్ గోయల్ రాజీనామా చేశారు. కష్టాల్లోంచి సంస్థను గట్టెక్కిస్తారని ఆశించిన బైజూస్‌కు ఇది భారీ షాక్. మైనింగ్ దిగ్గజం వేదాంత గ్రూపు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన అజయ్ తిరిగి ఆ సంస్థ గూటికే చేరారు. వేదాంతలోనూ సిఎఫ్‌ఒగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రణాళిక కీలక దశలో ఉన్న తరుణంలో ఆయన పునరాగమనం చేయడం వేదాంత వృద్థికి దోహదం చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 30 నుంచి అజరు విధుల్లో చేరనున్నట్లు వేదాంత వెల్లడించింది.
దేశంలోనే ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీగా గుర్తింపు పొందిన అజరు గోయల్ అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో పని చేశారు. జనరల్ ఎలక్ట్రిక్, నెస్ట్లే, కోకా కోలా, వేదాంత డిజియో తదితర దిగ్గజ కంపెనీల్లో పని చేసిన అనుభవం ఉంది. 2021లో వేదాంతలో చేరి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆ సంస్థలో పని చేసి.. అనంతరం బైజూస్‌లో చేరి.. తాజాగా వేదాంతకు తిరిగి వెళ్తున్నారు. వేదాంత గ్రూపును లోహ, విద్యుత్తు, అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలను ఆరు లిస్టెడ్ కంపెనీలుగా విభజించాలని ఇటీవలే నిర్ణయించింది. ఈ క్రమంలో అజరు గోయల్ పునరాగమనం ఆ సంస్థకు కలిసి రానుంది.
''సంస్థ పునర్జీవ ప్రక్రియలో అజరు గోయల్ చాలా సహకరించారు. వ్యాపారం, ఫైనాన్స్‌పై వారి అనుభవం, అవగాహన సంస్థ భవిష్యత్తు ప్రగతి ప్రయత్నాలలో మాకు సహాయపడతాయి. తక్కువ వ్యవధిలో అజరు చేసిన ప్రయత్నాలను, విజయాలను మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు.'' అని బైజూస్ వ్యవస్థాపకులు బైజు రవీంద్రన్, దివ్య గోకుల్‌నాథ్‌లు పేర్కొన్నారు.
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం ఆర్థిక ఫలితాలను బైజూస్ విడుదల చేయాల్సి ఉంది. రుణాల చెల్లింపులో కంపెనీ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. కార్యకలాపాల నిర్వహణకు కావాల్సిన నిధుల సమీకరణలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అప్పులు చెల్లించడానికి తమ విదేశీ సంస్థలను అమ్మకానికి పెడుతోంది. ఇందులో అమెరికాలో కిడ్స్ లెర్నింగ్ సంస్థ అయిన ఎపిక్, అప్‌స్కిల్లింగ్ ప్లాట్‌ఫామ్ అయిన గ్రేట్ లెర్నింగ్‌ను విక్రయించాలని యోచిస్తోంది. దీంతో దాదాపు రూ.8వేల కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా వేసింది. దీంతో పాటు ఈక్విటీల సేల్స్ ద్వారా నిధులు సమీకరించడం, కీలక ఆస్తులను వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు విక్రయించడం కోసం బ్యాంకర్లతోనూ చర్చలు జరుపుతుంది. నిధుల సమీకరణ, రుణాల చెల్లింపులో బైజూస్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ గోయల్ సంస్థను వీడడంతో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అన్ని స్థాయిల్లో రాజీనామాలను ఎదుర్కొంటున్న బైజూస్ కొత్త చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ)గా ఆ సంస్థ సీనియర్ అడ్వైజర్ ప్రదీప్ కనకియాను నియమించుకుంది.