May 29,2023 09:51

నా పేరు ఎల్‌ కౌశిక్‌ బాబు. ఎం.తిమ్మాపురం ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా. లక్కాకుల మాధవి, చిన్న కాశయ్య మా అమ్మానాన్నలు. నాకు చిన్నప్పటి నుంచి చెస్‌ ఆడటమంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా చెస్‌ బోర్డ్‌ ముందరేసుకొని ఒక్కన్నే ఆడుకునేవాన్ని. మా స్కూల్లో పీఈటి పీరియడ్‌లో స్నేహితులతో పోటీ పడేవాన్ని. ఎప్పుడూ నేనే గెలిచేవాన్ని. నాలోని ప్రతిభను గుర్తించిన మా పెదనాన్న పెద్దకాశయ్య నంద్యాలలో జరుగుతున్న రాయలసీమ జోన్‌ లెవెల్‌ చెస్‌ పోటీలో పాల్గొన మని ప్రోత్సహించారు. అంత పెద్ద పొటీలో పాల్గొనా లంటే నాకు భయమేసింది. మా పెదనాన్న ధైర్యం చెప్పి, స్వయంగా ఆయనే తీసుకెళ్ళి పోటీలో పాల్గొనేలా చేశాడు. ఆ చెస్‌ పోటీలో పాల్గొని అండర్‌ -13 విభాగంలో రాయలసీమ స్థాయిలో 5వ స్థానం సాధించి మెడల్‌ అందుకున్నాను. తర్వాత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన నంద్యాల, కర్నూలు జిల్లా ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆడాను. 4వ స్థానంలో నిలిచి మెడల్‌ అందుకోవటం చాలా సంతోషాన్ని కల్గించింది. ఈ పోటీల ద్వారా చెస్‌ పోటీల్లో నిలబడగలననే నమ్మకం కల్గింది. భవిష్యత్తులో చెస్‌లో మంచి శిక్షణ తీసుకొని గ్రాండ్‌ మాష్టర్‌గా నిలవటమే నా లక్ష్యం. పిల్లలూ చూశారూగా ! ఒక ప్రోత్సాహం నాలోని ప్రతిభను ఎలా బయటకు తీసిందో. మరి మీలోని ప్రతిభను రాసి వేసవి విడిదిలో పంచుకోండి.
 

- ఎల్‌ కౌశిక్‌ బాబు
8వ తరగతి,
ఎం.తిమ్మాపురం ఆదర్శ పాఠశాల,
మహానంది (మం), నంద్యాల జిల్లా.