ఆటోలో ప్రయాణిస్తున్న పాసింజర్లు ఒక్కోసారి తమ బ్యాగులు, విలువైన వస్తువులు, నగలు, డబ్బు వంటివి మర్చిపోయి ఆటో దిగినప్పుడు.. ఆ ఆటోడ్రైవరు వాటిని తిరిగి వాళ్లకి అప్పగించిన ఘటనలు అనేకం వెలుగుచూస్తుంటాయి. అలా అనేకమంది డ్రైవర్ల ఉదార స్వభావం గురించి వార్తలు రావడం మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అటువంటి డ్రైవరు గురించే.. కానీ ఇతను అందరిలా వస్తువులు అప్పగించలేదు. అర్ధరాత్రి సమయంలో తన ఆటోలో ఓ ప్రయాణికుడిని ఉచితంగా గమ్య స్థానానికి చేర్చాడు. అది అతను అప్పుడే మర్చిపోయినా ఆ సాయం పొందిన వ్యక్తి మాత్రం 30 ఏళ్లుగా ఆ డ్రైవరును వెతికి మరీ అతను ఊహించని ప్రతిఫలం అందించాడు. కేరళలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
అజిత్ బిఇడి పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. నిరుద్యోగిగా రోజు వారీ ఖర్చులు కూడా భరించలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఒకసారి తన స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి తన రూమ్‌కి బయల్దేరాడు. రెండు బస్సులు మారినా అతను చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరలేదు. చివరిగా తన కాలనీకీ వెళ్లే బస్సు ఎక్కేందుకు ప్రయత్నించినప్పటికీ బస్ స్టాండ్‌కి చేరుకునేసరికి అదీ వెళ్లిపోయింది. అతని దగ్గర బస్సు చార్జీలే ఉన్నాయి. బస్సు వెళ్లిపోయింది. 'నడుచుకుంటూ వెళ్దామంటే 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. బాగా పొద్దుపోయింది. ఆ సమయంలో అంత దూరం వెళ్లడం ఎలా? ఇదే ఆలోచిస్తూ బస్ స్టాండ్‌లో కూర్చొండిపోయాను. ఆటో వాళ్లు చాలామంది వచ్చి అడిగారు. నా దగ్గర బస్సుకు సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయి. దీంతో వాళ్లకి రానని చెప్పాను. కానీ ఎంతసేపు అలా.. ఆటోలన్నీ వెళ్లిపోతే నేనొక్కడినే ఆ చీకటిలో అక్కడే ఉండిపోవాలి. అప్పుడు నా మెదడులో ఎన్నో ప్రశ్నలు.. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాను. నా దగ్గర డబ్బులు లేవని చెప్పి సాయం అడుగుదామనుకున్నాను. ఈలోపు నా దగ్గరికి ఒక ఆటో వచ్చి ఆగింది. అతనితో నా పరిస్థితి గురించి చెప్పాను. అతను క్షణం కూడా ఆలోచించకుండా.. 'రా వచ్చి కూర్చో.. నేను నీ గది దగ్గర దింపుతాను. డబ్బులు ఏమీ వద్దులే' అన్నాడు. నాకు చాలా సంతోషమేసింది. సాధారణంగా ఆ రాత్రి వేళ మాములు కంటే ఎక్కువ డబ్బులు అడుగుతారు. కానీ ఆ ఆటో డ్రైవరు ఉచితంగా నన్ను తీసుకెళ్తానన్నాడు. మాటల్లో అతని పేరు బాబు అని తెలుసుకున్నాను. ఆ రోజు జరిగిన సంఘటన నా మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ డ్రైవరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోకూడదనుకున్నాను. ఆ రాత్రి ఆటో దిగుతూ మళ్లీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు రూ.100 ఇస్తానని చెప్పాను. ఇప్పుడు అతని రుణం తీర్చుకున్నాను' అంటూ 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి చెబుతున్నప్పుడు అజిత్ కళ్లల్లో నీళ్లు కనిపించాయి.
ప్రస్తుతం అజిత్ కొచ్చి కేంద్రీయ విద్యాలయం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కేరళ కొలంచెరిలో ఇల్లు కట్టుకుని భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. ఉద్యోగబాధ్యతల్లో తలమునకలైనా.. కుటుంబంతో సంతోషంతో గడుపుతున్నా బాబు గురించే ఆలోచించేవాడు. 30 ఏళ్లుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఒక రోజు ఉదయం పూట అతని ఇంటి ముందు ఒక ఆటో ఆగింది. 'ఎవరినో పాసింజర్‌ని దింపడానికి ఆ ఆటో వచ్చింది. ఆ ఆటో డ్రైవరు చూడడానికి బాబులా ఉన్నాడు. అతన్ని చూడడంతోనే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆటో దగ్గరికి పరుగుపెట్టాను. చాలా దగ్గరగా బాబును చూశాను. అతనే.. ఆ రోజు నాకు సాయం చేసిన మానవతావాది. నన్ను గుర్తుపట్టారా అని ఎంతో ఉత్సాహంగా అడిగాను. అతను లేదని తల అడ్డంగా తిప్పాడు. అప్పుడు నా జేబులో ఉన్న పర్సు తీసి అందులో ఉన్న నా పాత ఫొటో చూపించాను. అది చూడగానే అతను కూడా నన్ను గుర్తుపట్టాడు' అంటూ ఇటీవల జరిగిన సంఘటన గురించి చెబుతున్న అజిత్, బాబును తన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి తన కుటుంబసభ్యులను పరిచయం చేశాడు. ఇన్నేళ్లుగా అజిత్ వెతుకున్న వ్యక్తి తమ కళ్లముందు కనపడేసరికి కుటుంబమంతా ఎంతో సంతోషపడింది. అప్పుడే అజిత్ ఓ మూసి వుంచిన కవరు తెచ్చి బాబు చేతిలో పెట్టాడు. దాన్ని ఇంటికి వెళ్లేవరకు తెరవవద్దని చెప్పాడు. తన పట్ల అజిత్ చూపిస్తున్న ఆప్యాయతకు ఉక్కిరిబిక్కిరవుతున్న బాబు 'నేను ఆ రోజు మీకు చేసింది చాలా చిన్న సాయం. కానీ మీరు ఇన్ని సంవత్సరాలు అది గుర్తుపెట్టుకున్నారు. అదే చాలు.. ఇవన్నీ వద్ద'ని వారించాడు. అయినా అజిత్ ఆ కవరును బాబుకు ఇచ్చాడు.
- ఆ కవరులో ఏముందంటే..
బాబు చేతికి ఇచ్చిన ఆ కవరులో రూ.10 వేలు ఉన్నాయి. ఆ రోజు అజిత్ చెప్పిన వంద రూపాయల సాయం కంటే అది వంద రెట్లు. అయితే అజిత్ దృష్టిలో బాబు చేసిన సాయం వెలకట్టలేనిది. అందుకే త్వరలో కూతురు పెళ్లి చేస్తున్న బాబుకు ఈ సాయం ఎంతో కొంత ఊరటనిస్తుందని సంతోషపడుతున్నాడు. ఈ మొత్తం వృత్తాంతంలో అర్ధరాత్రి ఓ నిస్సహాయుడికి సాయం చేసిన బాబు, మూడు దశాబ్దాలు గడిచినా ఆ సాయం గుర్తుంచుకుని అతను ఊహించని బహుమతి ఇచ్చిన అజిత్ ఇద్దరూ మానవతా హృదయులే..










