స్కూట్‌తో మరో 44 ఫ్లైట్ సేవలు
సింగపూర్ ఎయిర్‌లైన్స్ వెల్లడి
హైదరాబాద్ : సింగపూర్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 29 నుంచి భారత్ నుంచి వారానికి 96 విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నరు, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబయి నుంచి విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది. అమృత్‌సర్‌్, చెన్నరు, కోయంబత్తూర్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, విశాఖపట్నం నుంచి తమ అనుబంధ సంస్థ స్కూట్ వారానికి 44 విమానాలను నడుపుతుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఇండియా జనరల్ మేనేజర్ సై యెన్ చెన్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ప్రయాణ సేవలు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నామన్నారు. హైదరాబాద్-సింగపూర్ మధ్య సేవలను వారానికి ఏడు సార్ల నుంచి 12 సార్లకు పెంచుతున్నామన్నారు. దీనితో రెండు నగరాల మధ్య రోజువారీ ప్రయాణ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ సేవలను బోయింగ్ 737-8ల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తుండగా, వీటిలో 154 సీట్లు, బిజినెస్ క్లాస్‌లో 10, ఎకానమీ క్లాస్‌లో 144 మంది ప్రయాణించవచ్చన్నారు.