Sep 23,2022 09:24
  • వైసిపి నేతలపై 6 సిబిఐ, 3 ఇడి కేసులు
  • టిడిపి నేతలపై 5 సిబిఐ, 5 ఇడి కేసులు
  • బిజెపిలో చేరితేనో, మద్దతిస్తేనో విచారణ నిలిపివేత !

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో స్వతంత్ర సంస్థలుగా ఉన్న సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజకీయ ఆయుధాలుగా మారిపోయాయి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రప్రభుత్వాలను పడగొట్టేందుకు, ఆ పార్టీల నేతలను బిజెపిలో చేర్చుకునేందుకు, ఆయా పార్టీలను అస్థిరపరిచేందుకు సిబిఐ, ఇడిలను ఉపయోగించుకుంటున్నారని ఆ రెండు సంస్థలు దాఖలు చేసిన కేసులే స్పష్టం చేస్తున్నాయి. ఆ రెండు సంస్థలు 95 శాతం కేసులు ప్రతిపక్ష నేతలపైనే నమోదు చేశాయి. సిబిఐ, ఇడి కేసులు ఉన్నవారు, ఆయా పార్టీలు బిజెపిలో చేరితే, లేకపోతే బిజెపికి మద్దతు ఇస్తే ఎటువంటి విచారణ ఉండడం లేదు.
       2014లో కేంద్రంలోని మోడీ సర్కార్‌ గద్దెనెక్కిన తరువాత ఎనిమిదేళ్లలో 124 మంది రాజకీయ నాయకులు సిబిఐ కేసులను ఎదుర్కొంటున్నారు. అందులో 95 శాతం (118 మంది) ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్‌ హయాం (2004-14) పదేళ్లలో 72 మంది సిబిఐ కేసులను ఎదుర్కొనగా, 43 (60 శాతం) మంది ప్రతిపక్షాలకు చెందిన వారు. 29 (60 శాతం) మంది కాంగ్రెస్‌ భాగస్వామ్య పార్టీలపైనే నమోదయ్యాయి. మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న బిజెడి, వైసిపి, టిడిపి, అన్నాడిఎంకెలపై యుపిఎ హయాంలో కంటే బిజెపి పాలనలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్‌ హయాంలో వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై సిబిఐ కేసు నమోదు కాగా, ఇప్పుడు ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్‌ హయాంలో టిడిపి నేతలపై ఒక్క కేసూ నమోదు కాలేదు. ఇప్పుడు ఏకంగా ఐదు కేసులు నమోదయ్యాయి. బిజెడి నేతలపై అప్పుడు రెండు కేసులు నమోదు కాగా, ఇప్పుడు 10 కేసులు నమోదయ్యాయి. అన్నాడిఎంకెకి చెందిన ఒక నేతపై అప్పుడు కేసు నమోదు కాగా, ఇప్పుడు ఏకంగా నలుగురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను సాకుగా చూపి ఆయా పార్టీలను బిజెపి బ్లాక్‌ మెయిల్‌ చేస్తోంది. అందువల్లే ఆయా పార్టీలు పార్లమెంట్‌లో ప్రతి బిల్లుకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా నిలిచాయి.

01



                                                         మోడీ హయాంలో ముఖ్య నేతలు

ఒక సిఎం, 12 మంది మాజీ ముఖ్యమంత్రులు, పది మంది మంత్రులు, 34 మంది ఎంపిలు, 27 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఆరుగురు మాజీ ఎంపిలు మోడీ పాలనలో సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌, టిఎంసి మంత్రి పార్థ ఛటర్జీ, బీహార్‌ డిప్యూటి సిఎం తేజస్వి యాదవ్‌, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, అప్పటి కాంగ్రెస్‌ నాయకుడు హిమంత బిశ్వ శర్మ, టిఎంసి నేత సువేందు అధికారి, వైసిపి ఎంపి అవినాష్‌ రెడ్డి, టిడిపి ఎంపి సుజనా చౌదరి, కాంగ్రెస్‌ నేత చిదంబరం, ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, బిఎస్‌పి అధినేత్రి మాయావతి, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ సిసోడియా వంటి ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేశారు. వీరిలో హిమంత బిశ్వశర్మ, సువేందు అధికారి, అమరీందర్‌ సింగ్‌, సుజనా చౌదరి సహా మరో ఇద్దరు బిజెపిలో చేరారు. 2015లో అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజేందర్‌ కుమార్‌ కార్యాలయాలపై సిబిఐ దాడులు చేసింది.
 

                                        యుపిఎ హయాంలో కేసులు ఎదుర్కొన్న ముఖ్య నేతలు

నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, ఇద్దరు మంత్రులు, 13 మంది ఎంపిలు, 15 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మాజీ ఎంపిలు, ఒక మాజీ ఎమ్మెల్యే సిబిఐ కేసులు ఎదుర్కొన్నారు.

                                         రాజకీయ నాయకులపై నాలుగు రెట్లు పెరిగిన ఇడి కేసులు

రాజకీయ నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. 2014 నుంచి ఇప్పటి వరకు 121 మంది రాజకీయ నాయకులపై ఇడి కేసులు నమోదు చేయగా, వారిలో 115 (95 శాతం) మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే. ఆరుగురు బిజెపి, ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీలకు చెందిన వారు. యుపిఎ హయాం (2004-14)లో కేవలం 26 (54 శాతం) కేసులు రాజకీయ నేతలపై నమోదయ్యాయి. అందులో 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపైన కాగా, 12 కేసులు కాంగ్రెస్‌, భాగస్వామ్య పార్టీలపై నమోదయ్యాయి.
 

                                               మోడీ పాలనలో ముఖ్య నేతలపై ఇడి కేసులు

ఒక సిఎం, 14 మంది మాజీ ముఖ్యమంత్రులు, 19 మంది మంత్రులు, 24 మంది ఎంపిలు, 21 మంది ఎమ్మెల్యేలు, 11 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఏడుగురు మాజీ ఎంపిలపై ఇడీ కేసులు నమోదు చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారణ ఎదుర్కొంటున్నారు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాను కూడా ఈడి ప్రశ్నించింది. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డికె శివ కుమార్‌, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, అతని కుమారుడు కార్తీ చిదంబరంను ఏజెన్సీ వెంబడించింది. ఎన్‌సిపి నేతలు శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌, అనిల్‌ దేశ్‌ముఖ్‌, నవాబ్‌ మాలిక్‌, ప్రఫుల్‌ పటేల్‌ ఉన్నారు. శివసేన నేతలు సంజరు రౌత్‌, అనిల్‌ పరబ్‌, బీహార్‌ మాజీ సిఎం లాలూ ప్రసాద్‌, అతని కుటుంబం కేసులు ఎదుర్కొంటున్నారు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌, యుపి మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్‌ చౌతాలా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌లపై కేసు నమోదు చేసింది. అమరీందర్‌ సింగ్‌ బిజెపిలో చేరారు. 2019లో అప్పటి టిడిపి ఎంపి సుజనా చౌదరి నివాసంలో సోదాలు నిర్వహించి, అతని ఆస్తులను అటాచ్‌ చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన బిజెపిలో చేరారు.

02