
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో లోయలను దాటేందుకు వినియోగించే కేబుల్ కారులో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది చిక్కుకపోయారు. స్థానిక కాలమానం ప్రకారం ..మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా నుండి మరో మరొక చోటుకు వెళ్లాలంటే లోయను దాటాల్సిందేనని, దీనికోసం కేబుల్ కార్లను వినియోగిస్తుంటారని అధికారులు తెలిపారు.
మంగళవారం కూడా చిన్నారులు యథావిథిగా పాఠశాలకు బయలుదేరారు. కేబుల్ విరిగిపోవడంతో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు మొత్తం ఎనిమిది మంది 1200 అడుగుల (సుమారు 365 మీటర్లు) ఎత్తులో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి ఫోను ద్వారా ప్రమాదం గురించి అధికారులకు తెలియజేశారని అన్నారు. ''ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా కేబుల్ కారు ఆగిపోయింది. చిన్నారులతో సహా మేమంతా ఇక్కడ చిక్కుకుపోయాం. భయంతో ఒక వ్యక్తి స్పృహ కోల్పోయాడు. ఉదయం ఏడు గంటల నుంచి ఇక్కడే ఉండిపోయాం. ఇక్కడ పరిస్థితి ఏమీ బాలేదు. మా సమీపంలో ఒక హెలికాఫ్టర్ తిరిగింది. కానీ, మాకు ఎలాంటి సహాయం చేయకుండా వెళ్లిపోయింది'' అని చెప్పారు.
వారంతా 1200 అడుగుల ఎత్తులో చిక్కుపోయారని, హెలికాఫ్టర్ లేకుండా వారిని కాపాడడం అసాధ్యమని పాకిస్తాన్ 1122 రెస్యూ సర్వీస్‌కి చెందిన జుల్ఫిఖర్ ఖాన్ తెలిపారు. హెలికాఫ్టర్‌ను పంపించాలని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. స్థానికులు మసీదు లౌడ్ స్పీకర్ల ద్వారా అధికారులను అప్రమత్తం చేశారని అన్నారు. కేబుల్ కార్ సుమారు 1,000 నుండి 1200 అడుగుల ఎత్తులో నిలిచిపోయిందని ఖైబర్ పంఖ్తుఖ్వా సీనియర్ అధికారి సయ్యద్ హమ్మద్ హైదర్ తెలిపారు. సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు.