Nov 06,2023 21:01

పండుగ సీజన్‌లో డిమాండ్‌ కొరత
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టే వాహన అమ్మకాల్లో పతనం చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో వాహన విక్రయాలు 8 శాతం క్షీణించాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఎడిఎ) సోమవారం వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో 7.73 శాతం క్షీణించి 21,17,596 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలలో 22,95,099 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గడిచిన నెలలో ద్విచక్ర వాహన విక్రయాల్లో తగ్గుదల వల్లే మొత్తం అమ్మకాలపై ప్రభావం చూపిందని ఎఫ్‌ఎడిఎ వెల్లడించింది. కాగా.. పండుగ సీజన్‌లో వాహన అమ్మకాలు పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలకు నిదర్శనం. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే ద్విచక్ర వాహన అమ్మకాలు భారీగా పడిపోవడం ఆందోళనకరం. పండుగ సీజన్‌లో అమ్మకాలు పడిపోవడం వాహన పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తుంది. వచ్చే నెలల్లో అమ్మకాలపై మరింత ఒత్తిడి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎఫ్‌ఎడిఎ రిపోర్ట్‌ ప్రకారం.. క్రితం అక్టోబర్‌లో దిచక్ర వాహన విక్రయాలు 12.60 శాతం క్షీణించి 15.07 లక్షల యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో 17.25 లక్షల టూవీలర్ల అమ్మకాలు జరిగాయి. ప్రయాణికుల వాహన విక్రయాలు 1.35 శాతం తగ్గి 3,53,990 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది 3,58,884 యూనిట్ల విక్రయాలు జరిగాయి. మూడు చక్రాల వాహన అమ్మకాలు 45.63 శాతం పెరిగి 1,04,711 యూనిట్లుగా ఉన్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 6.15 శాతం పెరిగి 62,440 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. వాణిజ్య వాహన రిటైల్‌ విక్రయాలు 10.26 శాతం పెరిగి 88,699 యూనిట్లకు చేరాయి. నవరాత్రి సమయంలో మాత్రం అమ్మకాలు మెరుగ్గా జరిగాయని.. స్థూలంగా అక్టోబర్‌లో తగ్గాయని ఎఫ్‌ఎడిఎ వెల్లడించింది.