Aug 04,2022 07:57

1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత భారత ప్రజల్లో జాతీయతా భావం పెంపొందనారంభించింది. బ్రిటిష్‌ రాజ్‌ నుంచి దేశాన్ని విముక్తి గావించేందుకు అందరూ సమైక్యంగా పోరాడాలన్న స్పృహ పెరిగింది. దీనిని ముందుకు తీసుకెళ్లడంలో సంఘ సంస్కరణోద్యమాలు ముఖ్యమైన భూమిక వహించాయి.

వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో రగుల్కొన్న చైతన్యాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు బ్రిటిష్‌ పాలకులు అవలంభించని ఎత్తుగడ లేదు. కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో అనైక్యతను సృష్టించేందుకు వారు నిరంతరం ప్రయత్నించారు.1857-59 నాటి సిపాయిల తిరుగుబాటును బ్రిటిష్‌ వాళ్లు అణచివేయగలగడానికి దోహదపడిన అంశాల్లో. భారతీయుల్లో నెలకొని ఉన్న అనైక్యత ఒక ముఖ్యమైన అంశం. విదేశీ పాలనకు వ్యతిరేకంగా ప్రజానీకంలో ఒక వర్గం తిరుగుబాటు చేయగానే , ఆ ప్రజానీకంలోనే వివిధ వర్గాలు, సామాజిక తరగతుల మధ్య చీలికలు తెచ్చి ఆ తిరుగుబాటును అణచివేయడం బ్రిటిష్‌ పాలకులకు వెన్నతో పెట్టిన విద్య.
         భారత దేశంలో ప్రాచీన కాలపు తెగల సమాజం విచ్ఛిన్నమైన తరువాత పుట్టుకొచ్చిన వర్ణాశ్రమ ధర్మాలు కుల విభజన రూపంలో పరస్పర వ్యతిరేక వర్గాలుగా ఏర్పడడానికి దారి తీశాయి. అలాంటి సమాజంలో అంతర్లీనమై ఉన్న లక్షణమే భారత దేశ ప్రజల్లో అనైక్యతకు ఒక కారణం.
          ఆదిమ తెగల సమాజం విచ్ఛిన్నమైన తరువాత బానిస సమాజం , ఫ్యూడల్‌ వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం అనే వివిధ చారిత్రిక దశలుగా సమాజ గమనం సాగింది. వర్ణ వ్యవస్థ సృష్టించిన నిచ్చెన మెట్ల సమాజం ప్రజల మధ్య ఐక్యతకు ఒక పెద్ద అటంకంగా మారింది. దీనికి వ్యతిరేకంగా ఆనాడు పలు సంఘ సంస్కరణోద్యమాలు వచ్చాయి.
కుల-మత సంప్రదాయాలను పూర్తిగా మార్పు చేయాలని బెంగాలు హిందువులు తహతహలాడారు. దాన్ని సాధించడం కోసం ప్రారంభించిన ఉద్యమం, ఐరోపా ఖండపు పునర్వికాసోద్యమం ప్రేరణతో ఈ ఉద్యమం బయల్దేరింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన రాజారామ్‌ మోహన్‌రారు సంఘ సంస్కర్త మాత్రమే కాదు. బూర్జువా జాతీయవాద సిద్ధాంతాలకు ప్రతిభావంతుడైన ప్రతినిధి కూడా.
             కులం ప్రాతిపదికగా గల హిందూ ఆచారాలు, దాని వల్ల ప్రజలకు కలిగే కీడు గురించి ఆయన ఎక్కువగా ఆందోళన చెందేవాడు. భారత దేశంలోను, ప్రపంచంలోను రాజకీయ మార్పుల కన్నా ఈ సాంఘిక దురాచారాలపై పోరాటమే తక్షణ ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన నొక్కి చెప్పేవాడు. అలా అని భారత దేశ స్వాంత్య్రం తక్కువ ప్రాధాన్యత కలిగినదని ఆయన ఉద్దేశం కాదు. భారతీయ సమాజాన్ని ఈ దురాచారాల బంధనాల నుండి విముక్తి గావించడం అవశ్యకం అని ఆయన భావించారు.
హిందూ సమాజంలో నిమ్న కులాలవారి పట్ల, స్త్రీల పట్ల సాగుతున్న అమానుష చర్యలకు వ్యతిరేకంగా ఆయన కత్తి ఝుళిపించారు. కుటుంబంలో స్త్రీకి ఆస్తిహక్కు నిరాకరించడం, వితంతు పునర్వివాహం, సతీ సహగమనం, బహు భార్యత్వం, ఆడ పిల్లలను చదివించడంపై ఉన్న నిషేధాలను ఆయన గట్టిగా వ్యతిరేకించాడు. కుల వ్యవస్థలోనూ అదే విధమైన సాంఘిక సంస్కరణలు తీసుకురావాలని ఆయన వాదించాడు.
             పందొమ్మిదో శతాబ్దపు మొదటి మూడు దశాబ్దాలలో రామ్మోహన్‌ రాయ్ ఈ భావాలను ప్రచారంలో పెట్టారు.ఇది మొదట్లో బెంగాల్‌కే పరిమితమైనా, ఆ తరువాత క్రమంగా దేశమంతటికీ వ్యాపించింది. నిమ్నకులాలకు చెందినవారు కూడా అందులో పాల్గొన్నారు. మహారాష్ట్రలో బ్రాహ్మణేతర ఉద్యమ స్థాపక నాయకుడు జ్యోతి బా పూలే గురించి కూడా ఈ సందర్భంగా పేర్కొనాలి.
రాజా రామ్మోహన్‌ రారు మాదిరిగా గాక పూలే నిమ్న కులానికి చెందిన కుటుంబం నుంచి వచ్చినవాడు. క్రైస్తవ మత గురువుల సహాయం, తోడ్పాటుతో ఆయన తన విద్యను పూర్తి చేయలేకపోయారు. బ్రాహ్మణ ఆధిక్యతను ఆయన నిరసించాడు. దీంతో బ్రాహ్మణులు తదితర అగ్రవర్ణ దురహంకారుల ఆగ్రహానికి ఆయన గురికావలసి వచ్చింది. రామ్మోహన్‌ రారు స్థాపించిన బ్రహ్మ సమాజం ప్రధానంగా అగ్ర కులాలకు చెందిన హిందువుల మధ్యనే పనిచేసింది. అందువల్ల అది కుల వ్యవస్థకు వ్యతిరేకంగాను, స్త్రీ-పురుష సమానత్వం కోసం ఉద్దేశించిన ఉద్యమంగా సాగింది. మరో వైపు పూలే ప్రారంభించిన ఉద్యమం నిమ్న కులాల వారిలో ప్రత్యేకించి అంటరానివారిలో వేళ్లూనుకుంది. బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన బ్రహ్మ సమాజం, మహారాష్ట్రకు చెందిన సత్యశోధన సమితి మాత్రమే కాదు, పందొమ్మిదో శతాబ్దపు చివరి రోజుల్లో, ఇరవయ్యో శతాబ్ది తొలి రోజుల్లో భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు రూపాల్లో ఇటువంటి ఉద్యమాలు తలెత్తాయి. ఈ ఉద్యమాలన్నిటి సారాంశం ఒక్కటే..కులం, మతం పేరుతో సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను కూకటి వేళ్లతో పెకలించాలి. ఈ ఉద్యమాలకు ప్రేరణ వూపు ఇచ్చిందేమిటి? స్వాతంత్య్రం కోసం, అభ్యుదయం కోసం, బ్రిటిష్‌ పాలన కింద గల బూర్జువా వర్గంలో ఆకాంక్ష పెంపొందింది. అదే ఈ ఉద్యమాలకు వూపునిచ్చింది.