Aug 15,2023 14:49

న్యూఢిల్లీ  :  నేడు దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని, వాటిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన అసంఖ్యాక భారతీయులకు సెల్యూట్‌ చేస్తున్నట్లు తెలిపారు. వారు జాతీయ ఉద్యమంలో పాల్గనడంతో పాటు భారత దేశానికి బలమైన పునాది వేశారని అన్నారు. అటల్‌ బీహారీ వాజ్‌పేయి సహా దేశాభివృద్ధికి సహకరించిన మాజీ ప్రధానులందరిపై ప్రశంసలు కురిపించారు. నిరంతరం దేశం కోసం పనిచేశారని, దేశ పురోగతికి, అభివృద్ధికి అవసరమైన అనేక చర్యలు తీసుకున్నారని అన్నారు. అయితే నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి మూడు కూడా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పడం బాధకలిగిస్తోందని అన్నారు. కేవలం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మాత్రమే కాదు.. దేశ ఆత్మ కూడా ప్రమాదంలో ఉందన్నారు. దేశ సమగ్రత మరియు ఐక్యత కోసం, సోదర భావం మరియు సౌభ్రాతృత్వం కోసం, ప్రేమ మరియు సమైక్యత కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్వేచ్ఛను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని అన్నారు. అలాగే దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'భారత్‌ ఐక్యంగా నిలుస్తుంది.. ఇండియా విజయం సాధించి తీరుతుంది '' అని ప్రతిపక్ష కూటమినుద్దేశించి అన్నారు.