ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన శకటాలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంగళవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వ్యవసాయం, పశుసంవర్ధకశాఖ, పాఠశాల విద్య-సమగ్రశిక్ష, వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు, వైద్యారోగ్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, ఎపి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, సంక్షేమశాఖ, అటవీశాఖ, పరిశ్రమలశాఖ, రెవెన్యూశాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలను శకటాలపై రూపొందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాటిని పరిశీలించారు. పరేడ్ అనంతరం విజయవాడ నగర ప్రజలు వీక్షించేలా రూట్ మ్యాప్ నిర్ణయించి శకటాల ప్రదర్శన వాహనాలను సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనరు తుమ్మా విజరుకుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ 13 శకటాలు విజయవాడ నగర వీధుల్లోకి వెళ్లగానే ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమైన శకటాల ప్రదర్శన బెంజ్ సర్కిల్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, రామవరప్పాడు రింగ్ రోడ్, గుణదల, ఏలూరు రోడ్డు మీదుగా తిరిగి ఇందిరాగాంధీ స్టేడియం వరకు కొనసాగింది. ఈ శకటాల ప్రదర్శనలో పాఠశాల విద్య శకటానికి మొదటి బహుమతి రాగా, వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన శకటానికి రెండో బహుమతి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు మూడో బహుమతి వచ్చింది. ఈ బహుమతులను ఆయా శాఖల అధికారులు ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్నారు.















