Aug 15,2023 13:11

న్యూఢిల్లీ :   ప్రతి భారతీయుడి స్వరం భారతదేశమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు.

''బలం, బలహీనతతో సంబంధం లేకుండా భారత మాత ప్రతి భారతీయుడి స్వరం. ఆ స్వరంలో ఆనందం, భయం, బాధ అంతర్గతంగా దాగి ఉంటుంది. ఈ భరత మాత స్వరం వినేప్పుడు నా సొంత స్వరం, నా సొంత ఆకాంక్షలను నిశ్శబ్దంగా ఉంచాను. వినయంగా, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్వరం వినిపిస్తుంది'' అని అన్నారు. ''యాత్ర ఎంతో అద్భుతంగా సాగింది. నేను సముద్రంలో మాత్రమే కనిపించే దాని కోసం నదిలో వెతుకుతున్నాను. మాటలు హృదయం నుండి వస్తే అవి హృదయంలోకి ప్రవేశిస్తాయి'' అంటూ పర్షియన్‌ కవి రూమి వ్యాఖ్యలను ఉటంకించారు.

భారత్‌ జోడో యాత్ర ప్రారంభంలో తన పాత గాయం తిరగబెట్టిందని అన్నారు. మోకాలి నొప్పి ప్రారంభమైందని, అయినా తనతో కలిసి ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండటం, వారు అందించిన ఆదరణతో తన నొప్పి మటుమాయమైందని అన్నారు. ప్రతిసారి జోడో యాత్రను ఆపేద్దామనుకున్నప్పుడల్లా.. ఎవరో ఒకరు వచ్చి తనలో కొత్త శక్తిని నింపేవారని, అలా నిశ్శబ్ద శక్తి తనకు సహకరించిందని అన్నారు. చిమ్మచీకట్లు అలుముకున్న అడవిలో కాంతిని నింపే మిణుగురుల్లా తనకు దోహదం చేసిందని, ఈ క్రమంలో ఒకరోజు అంతులేని నిశ్శబ్దాన్ని అనుభవించానని అన్నారు. తన చేయి పట్టుకొని నడుస్తున్న వ్యక్తి మాట తప్ప తనకు మరో శబ్దం వినిపించలేదని యాత్ర అనుభవాలను గుర్తు చేసుకున్నారు.